Magha Puranam: The Spiritual Essence of Maghamasam
మాఘ పురాణం – 1వ అధ్యాయము
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం |
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ||
వ్యాసం వశిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం |
పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్ ||
వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే |
నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః ||
మాఘ మాస వైభవం: పుణ్యప్రదమైన మాసోత్తమం
భారతదేశం కర్మ, ధర్మ, ధ్యానాలకు నిలయమై, ప్రపంచ దేశాలలోనే విశిష్ట స్థానాన్ని కలిగి ఉంది. ఇక్కడ హిమాలయ పర్వతాలు, గంగాది నదులు, నైమిశారణ్యం వంటి పవిత్ర స్థలాలు ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. వైశాఖం, ఆషాఢం, కార్తీకం, మాఘం వంటి పుణ్యప్రదమైన మాసాలలో చేసే స్నానం, జపం, తపస్సులకు ఎంతో పుణ్యం లభిస్తుంది.
పూర్వం మహర్షులు శ్రీ మహావిష్ణువును కలిసి, స్నానానికీ, ధ్యానానికీ అనువైన ప్రదేశాన్ని నిర్దేశించమని ప్రార్థించారు. మహావిష్ణువు తన చక్రాన్ని విసరగా, అది నైమిశారణ్యంలో పడింది. అక్కడ శౌనకాది మహర్షులు నివసిస్తూ యజ్ఞయాగాదులు చేసేవారు. రోమహర్షణుడు, ఆయన కుమారుడు సూత మహర్షి కూడా ఆ యాగాలను చూడటానికి వచ్చేవారు. యాగం చేసే మునులు వారిని ప్రార్థించి, పుణ్యకరమైన కథలను, విశేషాలను చెప్పించుకునేవారు.
ఒకసారి శౌనకాది మహర్షులు దీర్ఘకాలం జరిగే యాగం ప్రారంభించారు. అనేక మంది మునులు దానిని చూడటానికి వచ్చారు. వారిలో సూత మహర్షి కూడా ఉన్నారు. శౌనకాది మునులు ఆయనను సగౌరవంగా ఆహ్వానించి, ఆసనంపై కూర్చోబెట్టి, “సూత మహర్షి! మీ తండ్రి రోమహర్షణుల వారు పురాణ ప్రవచనంలో ధర్మ విషయాలను వివరించడంలో సాటిలేని వారు. వారి కుమారుడైన మీరు కూడా ఆయనకు తగ్గట్టుగానే ఉన్నారు. మా అదృష్టవశాత్తు మీరు ఈ యాగ సందర్శనకు వచ్చారు. విరామ సమయంలో మాకు పుణ్యకరమైన విషయాలను వినిపించండి” అని ప్రార్థించారు.
Download free PDF Magha Puranam hereసూత మహర్షి వారి ఆతిథ్యాన్ని స్వీకరించి, “మీకు నా మీద ఉన్న అభిమానానికి కృతజ్ఞుడిని. పుణ్య కార్యాలు జరిగే చోట పుణ్యప్రదమైన విషయాన్ని చెప్పడం కూడా ఒక అదృష్టమే. మా తండ్రి గారి వలన విన్నదాన్ని, వ్యాస మహర్షి దయతో, నాకు తెలిసిన విషయాన్ని, మీ అనుగ్రహం చేత స్ఫురింపజేసుకొని, యథాశక్తి వినిపిస్తాను” అని వినయంగా అన్నారు.
మునులు ఆయనను మాఘ మాస మహిమను వివరించమని కోరారు. సూత మహర్షి క్షణకాలం ధ్యానంలో ఉండి, తన తండ్రిని, గురువులను తలచుకొని, “మహర్షులారా! మీరు అడిగిన ప్రశ్న చాలా ముఖ్యమైనది. చదువుకున్న వారు కొద్ది మంది అయినా యజ్ఞయాగాదులు చేసి పుణ్యం సంపాదించుకుంటారు. కానీ, అలాంటి అవకాశం లేని వారు తరించడానికి ఈ విషయం బాగా ఉపకరిస్తుంది. పూర్వం జగన్మాత పార్వతీదేవి పరమేశ్వరుడిని ఇదే విషయం గురించి అడిగింది. గృత్నమద మహర్షి మొదలైన వారు చెప్పిన విషయాలతో పాటు, పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పిన విషయాలను కూడా మీకు వినిపిస్తాను” అని చెప్పారు.
పార్వతీదేవి పరమేశ్వరుడితో, “విశ్వాత్మకా! సర్వలోకేశ్వరా! సర్వభూత దయానిధీ! ప్రాణేశ్వరా! మీ మాటలు అమృతం కంటే మధురంగా ఉన్నాయి. మాఘ మాస మహిమను వివరించాలని కోరుతున్నాను” అని ప్రశ్నించింది.
పరమేశ్వరుడు పార్వతితో, “కళ్యాణీ! జగన్మంగళా! నీవు అడిగిన విషయం చాలా రహస్యమైనది, గంభీరమైనది. అయినా, నాకిష్టురాలవైన నీకు చెప్పకూడనిది ఏముంది? తప్పకుండా చెబుతాను, వినుము. సూర్యుడు మకర రాశిలో ఉండగా, మాఘ మాసంలో ప్రాతఃకాల స్నానం చేసిన వారు పాప విముక్తులై మోక్షం పొందుతారు. గోవు పాదం మునిగినంత నీటిలోనైనా చేసిన స్నానం అధిక పుణ్యప్రదం. మొదటి స్నానం సర్వ పాపాలను పోగొడుతుంది. రెండవ స్నానం వైకుంఠ ప్రాప్తిని కలిగిస్తుంది. మూడవ స్నానం శ్రీ మహావిష్ణువును ఋణగ్రస్తుడిని చేస్తుంది. ప్రయాగలో మాఘ మాసంలో గంగా స్నానం చేసిన వారికి పునర్జన్మ ఉండదు. మాఘ మాసంలో ఉదయాన్నే నదిలో గాని, సరస్సులో గాని స్నానం చేసిన వారికి ముక్తి కలుగుతుంది. ఊరికి వెలుపల ఉన్న సరస్సు, నూయి, కాలువ మొదలైన వాటిలో చేసిన స్నానం పాపనాశనం, మోక్షదాయకం. తెలిసి గాని, తెలియక గాని, బలవంతంగా గాని, మాఘ మాసంలో ఒకసారి అయినా సూర్యోదయానికి ముందు స్నానం చేసినచో వారి పాపములన్నీ పోతాయి. భక్తి భావంతో నెలంతా చేసినచో విష్ణు లోకం చేరుకుంటారు. స్నానం చేసి పురాణం విన్నచో ఋషిగా జన్మిస్తారు” అని చెప్పాడు.
ఈ విధంగా సూత మహర్షి మునులకు మాఘ మాస మహత్యాన్ని వివరించాడు. మాఘ మాసంలో ప్రాతఃకాల స్నానం, దాన ధర్మాలు, పుణ్య కార్యాలు చేయడం వలన విశేష ఫలితాలు కలుగుతాయని ఈ కథ ద్వారా తెలుస్తుంది.
మాఘస్నానమును మాని, విష్ణువునర్చింపక, దానము చేయక పురాణమును వినక మాఘమాసమును గడిపిన వానికి మనోవాక్కాయ సంబంధములైన పాపములెట్లుపోవును? అతడు భయంకరమైన కుంభీపాకనరకమున బాధలు పడును. మదగర్వముచే మాఘస్నానము మానిన అధముడు, నీచజన్మలను పలుమార్లుపొందును. చలికి భయపడి స్నానము చేయనివారిని చూడరాదు. అట్టివారిని జూచిన పాపము పోవలెనన్నచో సూర్యుని చూచి నమస్కరించవలెను. ప్రాతః కాల మాఘస్నానము చేయని వారు పెక్కుమార్లు నీచజన్మలనందుదురు సుమా, దరిద్రులైనను, బాలురైనను ప్రాతఃకాల స్నానముచేసిన శ్రీ మహావిష్ణువు దయనుపొందెదరు. చిన్నపిల్లలు, అశక్తులైన వృద్ధులు హరినామస్మరణ చేయుచు ముమ్మారు జలబిందువులను శరీరముపై చిలుకరించుకొన్నను పుణ్యమే. నీచుడైనను మాఘస్నానము చేసిన పాపములను వీడి పుణ్యాత్ముడగును.
ఎట్టి పాపకర్మలు ఆచరించిన వాడైనను, మాఘమాస ప్రాతఃకాలమున మాయందు స్నానమాడినచో వాని పాపములను మేము నశింపజేయుదుమని జలములు ఘోషించుచున్నవి. మాఘస్నానము చేసినవానికి సంసార భయము లేదు. ఆడంబరము కొరకుగాని, భయముచే గాని, బలవంతముగాగాని, మాఘస్నానము చేసినవాడు పాపవిముక్తుడై పుణ్యాత్ముడగును. అశక్తుడు తాను మాఘస్నానము చేయలేకపోయినచో స్నానము చేసినవానికి దక్షిణనిచ్చి వానినుండి స్నానఫలమును పొందవచ్చును. ఈ మాసమున నిరుపేదలకు వస్త్రదానముగాని కంబళదానముగాని చేసిన స్నానఫలమునంది పుణ్యవంతులగుదురు. బలవంతముగా స్నానము చేసిన వారికిని, చేయించిన వారికిని పుణ్యముకల్గును. ఈ స్నానమును అన్ని వర్ణములవారును చేయవలెను. మాఘస్నానము చేయువారిని నిందించినను, పరిహసించినను, నివారించినను మహాపాపములు కలుగును.
పార్వతీ! మాఘస్నానము సద్యోముక్తిప్రదము దానికి సాటిలేదు. శక్తిలేనివారు కాలు చేతులను కడుగుకొని, ఆచమనముచేసి పురాణమును విన్నను వారికి స్నానఫలము కలుగును. అన్నిమాసములలో మాఘమాసముత్తమము. శ్రీవారిదేవతలందరిలో ఉత్తముడు. అన్నిమాసములలో మాఘమాసముత్తమము. వృక్షములలో అశ్వత్తవృక్షముత్తమము. తేజోస్వంతులందరిలో సూర్యుడుత్తముడు. శాస్త్రములన్నిటిలో వేదములుత్తమములు. కావున మాఘమాస స్నానము చేయువారిని, నిందించినను, నివారించినను మహాపాపములు కలుగును. నాలుగువర్ణముల వారిలో బ్రాహ్మణుత్తముడు. పర్వతములలో మేరుపర్వతముత్తమము. కావున మాఘమాస స్నానమనంత పుణ్యప్రదము సుమా.
దిలీపుడను మహారాజు పెక్కుయాగములను చేసిన పుణ్యాత్ముడు. ఉత్తముడైన ప్రజాపాలకుడు. ఈతడోకనాడు వేటకుపోయెను. అనేక మృగములను వేటాడి అలసిపోయెను.మనోహరమైన సరస్సునొకదానిని చూచి అచట కొంతకాలము విశ్రమించి తన నగరమునకు ప్రయాణమయ్యెను. అప్పుడు వృద్ధ బ్రాహ్మణుడొకడా మహారజునకు కనిపించెను. రాజు వానికి నమస్కరించి ఆశీస్సులనందెను. ఆ బ్రాహ్మణుడు ‘మహారాజా! పరమపవిత్రమైన మాఘమాసమున నీ సరస్సున స్నానము చేయకుండపోవుచున్నానేమి. మాఘమాసమున చేయు నదీస్నానముకాని, సరస్స్నానము కాని మిక్కిలి పుణ్యమునిచ్చునని యెరుగువా? యని ప్రశ్నించెను. రాజు మాఘస్నానమహిమను చెప్పుడని కోరగానతడు. రాజా నీ విప్పుడీ సరస్సున తప్పక స్నానము చేసిపొమ్ము మాఘమాస స్నాన మహిమను మీ గురువగు వశిష్ఠమహర్షివలన తెలిసికొనుమని చెప్పి తన దారిన పోయెను.
దిలీపమహారాజు మాఘమాసస్నాన మహిమ తెలిసికొనవలయునని తమ కులగురువైన వశిష్టమహర్షి యాశ్రమమునకు వెళ్లెను. గురువును దర్శించి నమస్కరించి మాఘమాసస్నాన మహిమను తెలుపగోరెను. వశిష్టమహర్షి దిలీపుని యాశీర్వదించి యిట్లనెను. నాయనా దిలీపా! నీకోరిక విశిష్టమైనది. మాఘమాసము చాలా విశిష్టత కలిగినది. మాఘమాసము శివకేశవ ప్రీతికరమైనది. ఆ నెలలో చేసిన పుణ్యకార్యములు యితర దినములలో చేసిన పుణ్యకార్యములకంటే ఎక్కువ పుణ్యము నిచ్చును.మాఘమాసమున ప్రాతఃకాలమునచేసిన స్నానమే సర్వపాపములను పోగట్టి అక్షయములైన పుణ్యఫలములనిచ్చును. స్నానమేయింత అధికమైనపుణ్యము నిచ్చునో పూజ పురాణ శ్రవణాదులవలన నెంతటి ఫలముండునో యూహించుకొనుము. మాఘస్నానము వలన సర్వ దుఃఖములను పోగట్టుకొని శుభలాభములను పొందిన కొందరి వృత్తాంతములను వివరింతును. దానిని బట్టి మాఘమాస వైశిష్ట్యమును తెలిసికొన యత్నింపుము.
పూర్వమొకప్పుడు భయంకరమైన క్షామము(వానలు లేకపోవుట పంటలు పండకపోవుట మొదలైన లక్షణముగల కరువు) వింధ్య-హిమాలయపర్వతముల మధ్యనున్న భూమిలో కలిగెను. దీనివలన సామాన్యజనులు, ప్రభువులు, మునులు, మహర్షులు, పశువులు, పక్షులు, సర్వప్రాణుల మిక్కిలి బాధపడినవి, అట్టివారిలో భృగుమహర్షి యొకడు అతడును ఆ ప్రాంతమును విడుచుటకు యిష్టములేకున్నను కైలాస పర్వత ప్రాంతముకడకు చేరి తనకునచ్చిన ప్రదేశమునందు ఆశ్రమమును నిర్మించుకొని తపమాచరించు కొనుచుండెను. పవిత్రము మనోహరము అయిన ఆ దివ్యప్రదేశమునకు గంధర్వులు యక్షులు, కిన్నరులు మున్నగు దేవజాతులవారును వచ్చుచుండిరి అచట విహరించి ఉత్సాహమును పొందుచుండిరి.
ఒకనాడు గంధర్వుడోకడు భార్యాసమేతుడై ఆ ప్రదేశమునకు వచ్చెను. అతడు భృగుమహర్షికి నమస్కరించెను. అతని శరీరము మిక్కిలి సుందరమైన గంభీరమై మనోహరమైవిచిత్రమై యుండెను. వాని మొగము మాత్రము పులిమొగమై యుండును. ఇందువలన అతడుయెంత చక్కగానున్నను పులిమొగమువలన విచిత్రముగా భయంకరమై యుండును. అతడు భృగుమహర్షికి నమస్కరించిన తరువాత మునీశ్వరా! నాకు భోగభాగ్యములన్నియునున్నవి. ఈ నా భార్యను చూసితిరికదా! ఈమె సౌందర్యము గుణసంపద నిరుపమానములు, నేను గంధర్వుడను మానవులకంటే దివ్యశక్తులు కొన్నియున్నవి. కాని భయంకర వికారమైన ఈ పులిమొగము నాకు బాధాకరముగనున్నది. దీనిని పోగట్టు కొనుటయెట్లో తెలియరాకున్నది. ఈ వికారమువలన నాకు గల సుఖములు భోగములు నన్ను సంతోషపరచుటలేదు. దయయుంచి నాకీ వికారరూపము పోవునుపాయమును చెప్పుడని ప్రార్థించెను.
భృగుమహర్షికి గంధర్వుని పరిస్థితికి జాలికలిగినది వానికి సాయపడవలయుననుకొన్నాడు. నాయనా పురాకృతకర్మము యెవనిని విడువడు. గతజన్మలో చేసిన పాపము వలన నీకీస్థితి కలిగినది. పాపము, దురదృష్టము, పేదరికమూ ఇవి మూడును జీవినిబాధించును. ఇట్టి వానిని పోగట్టుకొని శుభలాభము పొందవలెనన్న పుణ్యనదుల యందు స్నానము, పవిత్రక్షేత్రములందు దేవపూజ చేసినకొనవలయును.ఇట్టి వానిని పవిత్రమైన కాలమున చేసినచో సద్యఫలము కలుగును. కాలమంతయు మంచిదే అయినను మాఘమాసము విశిష్టమైనది. ఈ నెలలో చేసిన స్నానము, పూజ, జపము, తపము జీవికి గల పాపమునుపోగట్టి శుభమును వెంటనే కలిగించును. అన్ని పుణ్యనదులలో స్నానాదికముచేసినచో వచ్చుఫలితము, మాఘమాసములో నదిలోగాని, సముద్రములోగాని, కాలువలోగాని, సెలయేరులోగాని యే స్వల్పజల ప్రవాహమైనను అందు స్నానము చేసినచో వచ్చును. అనగా మాఘస్నానమును యేప్రవాహమున చేసినను సర్వతీర్థములయందు చేసిన పుణ్యము నిచ్చునంత గొప్పది. నీ జాతివారికైనను అనంత పుణ్యమునిచ్చును. నీ అదృష్టవశమున యిది మాఘమాస ప్రారంభముకావున నీ భార్యతో బాటు ప్రతిదినము ప్రాతఃకాలమున మాఘస్నానమును యిష్టదేవతా పూజను అచటనున్న నదిలో చేయుము అని భృగుమహర్షి ఆ గంధర్వునకు చెప్పెను. ఆ గంధర్వుడు ముని చెప్పినట్లుగా అచటి నదిలో మాఘస్నానమును, తీరమున యిష్టదేవతాపూజను విడువక మాఘమాసమంతయు చేసెను. ఆ పుణ్యవశమున వాని పులిమొగము పోయి వానికి సుందరమైన ముఖము వచ్చెను. గంధర్వుడును ఆశ్చర్యపడి మాఘమాసమహిమను కీర్తించును. కృతజ్ఞడై, మునికి భార్యతోబాటు నమస్కరించెను. అతని యాశీర్వాదమునంది తన భార్యలో బాటు తనలోకమున కరిగెను. దిలీపమహారాజా మాఘస్నాన మహిమను గమనించితివా? మరియోక కథను చెప్పుదును వినుమని వశిష్ఠుడు మరలనిట్లు పలికెను.
శౌనకాది మునులు యజ్ఞము చేయ తలపెట్టుట
సకల పురాణములకు ఆలవాలమైన నైమిశారణ్యమందు ఒకప్పుడు శౌనకాది మహాఋషులు లోక కళ్యాణార్థమై, ఒక మహాయజ్ఞమును తలపెట్టిరి. ఆ మహాయజ్ణము పరిసమాప్తమగుటకు ఒక పుష్కరకాలము అనగా పన్నెండు సంవత్సరములు పట్టును. ఎన్ని అడ్డంకులు వచ్చిననూ, ఆ యజ్ఞమును పూర్తీ చేయవలయుననెడి దీక్షతో శౌనకాది మునులు తలపెట్టి, యజ్న స్థలముగా నైమిశారణ్యములో ప్రవహించు గోమతీ నదీతీరమును ఎన్నుకొని ఒక శుభ ముహూర్తమున యజ్ఞమును ప్రారంభించిరి. అంత పెద్ద యజ్ఞము చూచి తరింపవలయుననెడి కోరికలతో, భరతఖండము నలుమూలలనుండీ తపోధనులెందరో వచ్చి యజ్ఞస్థల సమీపమునందు నివాసము లేర్పరచుకొనిరి.
అచటికేతెంచిన మునీశ్వరులలో బ్రహ్మ తేజస్సు గల శతవృద్ధులు, వేదములామూలాగ్రముగా నవగాహన చేసుకున్న వేదమూర్తులు, సకల శాస్త్రములు అధ్యయన మొనర్చిన మునికుమారులు వచ్చి పాల్గొనిరి.
ఆవిధముగా మునీశ్వరులందరూ తమ తమ శిష్య బృందములతోను, పరివారముల తోను, తండోపతండములుగా యజ్ఞస్థలానికి జేరుకొనిరి. వేలకొలది ఋషిపుంగవులతో ఆ యజ్ఞస్థలము క్రిక్కిరిసి యుండెను. ఆ యాగము సకల లోకములకు శుభకరమైనదియు, పుణ్యప్రదమైనదియు, 12 సంవత్సరములు ఏకధాటిగా జరుగు మహాయాగమగుటవలన పురాణ పురుషుడగు సూత మహాముని కూడా తన శిష్య బృందముతో వేంచేసి యాగాది కార్యక్రమములో పాల్గొనిరి.
దూర ప్రాంతాలనుండి వచ్చిన ఋషులు సూతులను దర్శన భాగ్యం కలిగినందున అమితానందం నొందిరి. సూతుల వారి ఆశీర్వాదములతో నిర్విఘ్నంగా యాగం జరుగునని అందరూ సంతోషపడిరి.
సూత మహాముని సకల శాస్త్రములు ఆమూలాగ్రముగ తెలిసియున్న మహానుభావుడు. వేదం, పురాణ ఇతిహాసాది సమస్త విషయములందూ వారికి తెలియనిది లేదు. అవి అన్నియు వారికి కొట్టిన పిండి వంటివి. వారి ముఖవర్చస్సు నుండి ప్రకాశించు బ్రహ్మ తేజస్సు, ఎల్లవేళలా నవ్వులొలికించు ముఖారవిందము, మేలిమి బంగారం వలె ప్రకాశించుచున్న శరీరం, వర్ణింప నలవికానిది. అటువంటి పుణ్య పురుషుడగు సూత మహాముని ఆగమనమునకు స్వాగతం పలికి, సాష్టాంగ దండ ప్రణామములాచరించి యజ్ఞం జరుగు ఆ పండ్రెండు సంవత్సరములలో యెన్నియో పురాణ గాధలు విని తరించవలెననెడి కోరికతో ముని పుంగవులందరూ వేచియుండిరి.
సూతుల వారు శౌనకాది మునుల కోరికలను గ్రహించినారు. ఇటువంటి పుణ్య కార్యములందు పురాణ పఠనం గావించి అశేష మునిసత్తములను తృప్తి పరచుట తన విద్యుక్తధర్మమని యెంచి వారి కోరికను మన్నించినారు.
ఒక శుభ ముహూర్తమున ఆశ్రమ వాసులందరూ సూతుల వారికి అర్ఘ్య పాద్యములొసంగి ఉచితాసనములపై ఆసీనులను జేసి “మునిశ్రేష్ఠా! మునికులతిలకా! ఇంతకుమున్ను ఎన్నియో పురాణ గాధలు తమరు తెలియజేయగా విని ఆనందించియున్నాము. అనేక ఇతిహాసములను ఆలకించి, అందలి సారమును గ్రహించి యుంటిమి. సమయము వచ్చినప్పుడు సకల శాస్త్రములలోని నీతికథలు మాకు వినిపించుచునే యున్నారు. అయినను మీబోటి సిద్ధపురుషులు పదునాలుగు లోకములు సంచారము చేసి యున్నందున ఎన్నో విషయములు మీరు అవగాహన చేసుకొనియున్నారు. గాన వినదగు విషయాలేమైనా యున్నయెడల విరామ కాలములో మాకు వినిపించవలయు”నని శౌనకాది మునులు ప్రార్థించిరి. ఆ ప్రకారముగా కోరిన శౌనకాది మునులు తన వలన క్రొత్త సంగతులు తెలుసుకొనవలెననెడి కుతూహలం కనపరచినందున వారలను జూచి సూత మహాముని ఇటుల పలికిరి –
“ముని పుంగవులారా! మీ మనోవాంఛను గ్రహించితిని. మీరు వినదగిన కథను నాకు తెలిసియున్నంత వరకూ విచారించి మీకు తృప్తి కలిగించెదను. ఇటువంటి మహా సమయమున పుణ్య కథలు చెప్పుట వలన నాకున్నూ, వినుట వలన మీకున్నూ పరమార్థము కల్గు’నని పలికెను.
శౌనకాది మునుల కోరిక
సూతమహామునిని అడిగినదే తడవుగా వారందులకు అంగీకరించగా “ధన్యులమైతి”మని మునులందరూ అమితానందం నొంది సూతులవారి పాదములను కండ్లకద్దుకొని
సూతమహామునితో –
“ఆర్యా! పద్మపురాణమందు లీనమైయున్న మాఘమాసం యొక్క మహాత్మ్యంను మరల మరల వినవలయుననెడి కుతూహలం కలుగుచున్నది. అదియునుగాక రాబోవు మాసం మాఘమాసమే అయినందున ఆ మాస మహాత్మ్యం, ఆచరించవలసిన విధానం, మాకు వివరించవలసిందిగా” కోరిరి.
ఆ విధంగా శౌనకాది మునులు ఇతర తపశ్శాలురు కోరుటవలన సూతమహర్షి మిక్కిలి సంతసించి యిట్లు పలికిరి.
“ముని పుంగవులారా! మీరందరూ అతిముఖ్యమైన విషయాన్నే అడుగుచున్నారు. మాఘమాసం కూడా ప్రారంభం కాబోవుచున్నది. ఇటువంటి సమయంలో మాఘ పురాణం వినుటవలన కలిగే ఫలము అంతింత కాదు. అదియునుగాక ఈ మహాయజ్ఞం జరుగుచున్న సమయములో మాఘమాసం యొక్క మహాత్మ్యం మీకు వివరించవలసిన భాగ్యము కలిగినందులకు నేను అదృష్టవంతుడనే. కాన సావధాన మనస్కులై ఆలకింపు”డని సూతమహర్షి ఇట్లు వివరించిరి –
“నేను ణా తండ్రి శిష్యుడగు రోమహర్షుని శిష్యుడను. అతడు మహా తపస్వి, జ్ఞాని. నాతండ్రి వద్ద సకల శాస్త్రములు అభ్యసించెను. విష్ణ్వంశ సంభూతుడగు వేదం వ్యాస మహర్షికి ప్రియ పాత్రుడను. వారి దయవలన నాకు కలిగిన జ్ఞానంతో మీలాంటి వారడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పగల శక్తి సామర్ధ్యములు కలిగిన వాడనయితిని. నేను తెలియజేయుచున్న నీతిబోధలు సకల లోకములకు శుభములు కలుగును. మీరడిగినటులే పూర్వం దిలీప మహారాజుకు తన కులగురువైన వశిష్ఠమహాముని మాఘమాస మహాత్మ్యమును వివరించినారు. ఆ విషయమునే నేను మీకు వివరించబోవుచున్నాను.
మాఘ పురాణం – 2వ అధ్యాయము – శివుడు పార్వతీ దేవికి మాఘమాస మహిమ చెప్పుట
వశిష్ఠులవారు మార్కండేయ వృత్తాంతమును, శివలింగాకార వృత్తాంతమును వివరించిన తరువాత, యింకనూ వినవలెనని కుతూహలపడి దిలీపుడు మరల యిట్లు ప్రశ్నించెను.” మహాముని! ఈ మాఘమాస మహత్యమును యింకను వినవలయుననెడి కోరిక ఉదయించుచున్నది గాన సెలవిం” డని ప్రార్థించగా వశిష్ఠుడు చెప్పసాగెను. మున్ను పార్వతీదేవికి శివుడును, నారదునకు బ్రహ్మయు మాఘమాస మహత్యమును గురించి చెప్పియున్నారు గాన శివుడు పార్వతికి చెప్పిన విధమును వివరించెదను వినుము. ఒకనాడు పరమశివుడు గుణాలు సేవించుచూ, నానారత్న విభూషితమగు కైలాస పర్వతమందలి మందారవృక్ష సమీపమున యేకాంతముగ కూర్చునివున్న సమయమున లోకజననియగు పార్వతీదేవివచ్చి భర్తపాదములకు నమస్కరించి, ‘స్వామీ మీవలన ననేక పుణ్య విషయములను తెలిసికొంటిని, కానీ, ప్రయాగక్షేత్ర మహత్యమును, మాఘమాస మహత్యమును వినవలెననడి కోరికవున్నది. కాన, ఈ యేకాంత సమయమందా క్షేత్రమహిమలను వివరింప ప్రార్థించుచున్నదాననని’ వేడుకొనగా, పార్వతీపతి యగు శంకరుడు మందహాసముతో నిట్లు వివరించెను, దేవి! నీ యిష్టమును తప్పక తీర్చెదను శ్రద్దగా వినుము.
సూర్యుడు మకరరాశియందువుండగా మాఘమాసమందు ప్రాతఃకాలమున ఈ మనుజుడు నదిలో స్నానము చేయునో ఆతడు సకలపాతకములనుండి విముక్తుడగుటయే కాక, జన్మాంతమందు మోక్షమును పొందును. అటులనే మాఘమాసములో సూర్యుడు మకరరాశి యందుండగా, ప్రయాగ క్షేత్రమునందే నరుడు స్నానమాచరించునో అతనికి వైకుంఠప్రాప్తి కలుగును. అంతియేకాదు జీవనది వున్నను, లేకున్నను కడకు గోపాదము మునుగునంత నీరు ఉన్నచోటకాని, తటాకమందుకాని మాఘమాసములో చేసిన ప్రాతకాలస్నానము గొప్పఫలము నిచ్చుటయేగాక సమస్తపాపములను విడిపోవును. రెండవరోజు స్నానముజేసిన విష్ణులోకమునకు పోవును. మూడవనాటి స్నానమువలన విష్ణు సందర్శనము కలుగును. మాఘమాసమునందు ప్రయాగక్షేత్రమందు గల గంగానదిలో స్నానమాచరించిన యెడల ఆ మనుజునకు మరుజన్మ అనునది వుండదు. దేవీ! మాఘమాస స్నానఫలం యింతింతయని చెప్పజాలను మాఘమాసమునందు భాస్కరుడు మకరరాశి యందుండగ యేది అందుబాటులో వున్న అనగా నదికాని, చెరువు కాని, నుయ్యి కాని, కాలువకాని లేదా గోపాదము మునుగునంత నీరున్న చోట కాని ప్రాతఃకాలమున స్నానమాచరించి, సూర్యభగవానునకు నమస్కరించి, తనకు తోచిన దానధర్మములుచేసి శివాలయమునగాని విష్ణ్వాలయమునగాని దీపము వెలిగించి భక్తి శ్రద్ధలతో అర్చన చేసిన మానవునకు వచ్చు పుణ్యఫలము యింతింతగాదు.
ఏ మానవుడైననూ తన శరీరములో శక్తిలేక, కడకు బావియందైననూ స్నానమాచరించి శ్రీవారి దర్శనమును చేసినచో అతడెట్టి కష్టములు అనుభవించుచున్ననూ ఆ కష్టములు మేఘములవలె విడిపోయి విముక్తుడగును. ఎవరైననూ తెలిసిగాని తెలియకగాని మాఘమాసములో సూర్యుడు మకరరాశియందుండగా నదీస్నానమాచరించిన యెడల అతనికి అశ్వమేధయాగము చేసినంతఫలము దక్కును. అదియునుగాక, మాఘమాస మంతయు ప్రాతఃకాలమున నదిలోస్నానముచేసి, శ్రీమన్నారాయణుని పూజించి, సాయంకాల సమయంబున మాఘపురాణము చదివి, విష్ణు అందిరమునగాని, శివాలయమున గాని దీపము వెలిగించి, ప్రసాదము సేవించిన యెడల అతనికి తప్పక విష్ణులోకప్రాప్తి కలుగుటయేకాక, పునర్జన్మ యెన్నటికిని కలుగదు. ఇటుల ఒక్క పురుషులే గాక, స్త్రీలు కూడా ఆచరించవచ్చును మానవుడు జన్మమెత్తిన తరువాత మరల ఘోరపాపములుచేసి మరణారంతరమున రౌరవాది నరకబాధలు అనుభవించుటకంటె, తాను బ్రతికున్నంత కాలము మాఘమాసమందు నదీస్నానము చేసి, దానధర్మాది పుణ్యముల నాచరించి వైకుంఠ ప్రాప్తి నొందుట శ్రేయస్కరముగదా! ఇదే మానవుడు మోక్షము పొందుటకు మార్గము. ఓ పార్వతీ! యే మానవుడు మాఘమాసమును తృణీ కరించునో అట్టివాడు అనుభవించు నరకబాధల గురించి వివరించెదను సావదానముగా ఆలకింపుము.

నేను తెలియజేసిన విధయముగా ఏ మనుజుడు మాఘమాసమందు ప్రాతఃకాలమున నదీస్నానముగాని, జపముగాని, విష్ణుపూజగాని, యధాశక్తి దానాది పుణ్యకర్మములు గాని చేయడో అట్టివాడు మరణానంతరమున సమస్త నరకబాధలను అనుభవించుచు కుంభీనసమను నరకమున పడద్రోయబడును. అగ్నిలో కాల్చబడును, ఱంపములచేత, ఖడ్గములచేత నరకబడును. సలసలకాగు తైలములో పడవేయబడును. భయంకరులగు యమ కింకరులచే పీడించబడును. ఏ స్త్రీ వేకువజామున లేచి, కాలకృత్యములను తీర్చుకొని, నదికిపోయి స్నానము చేసి, సూర్యనమస్కారము విష్ణుపూజా చేసి తన భర్త పాదములకు నమస్కరించి, అత్తమామల సేవలు చేయునో అట్టి ఉత్తమ స్త్రీ అయిదవతనముతో వర్ధిల్లి యిహమందు పరమందున సర్వసౌఖ్యములు అనుభవించును. ఇది ముమ్మాటికి నిజము. మాఘమాసమందు యేస్త్రీ అటులచేయదో, అట్టి స్త్రీముఖము చూచినంతనే సకలదోషములూ కలుగుటయేగాక ఆమె పంది, కుక్క జన్మలనెత్తి హీనస్థితినొందురు. మాఘమాసస్నానమునకు వయఃపరిమితిలేదు, బాలుడైనను, యువకుడైనను, వృద్ధుడైనను, స్త్రీయైనను, బాలికయైననూ, జవ్వనియైననూ, ఈ కులమువారైననూ కూడా మాఘస్నాన మాచరించవచ్చును. ఈ మాసమంతయు కడునిష్ఠతో వుండిన కోటియజ్ఞములు చేసినంత పుణ్యముకలుగును. యిది అందరికిని శ్రేయోదాయకమైనది.
పార్వతీ! దుష్ట సహవాసము చేసేవారు, బ్రహ్మహత్యాది మహాపాపములు చేసినవారు, సువర్ణమును దొంగలించినవారు, గురు భార్యతో సుఖించినవారు, మద్యము త్రాగి పరస్త్రీలతో క్రీడించువారు, జీవహింసచేయువారు మాఘమాసములో నదీస్నానము చేసి విష్ణువును పూజించినయెడల వారి సమస్తపాపములు నశించుటయేగాక, జన్మాంతరమున వైకుంఠప్రాప్తి కలుగును మరియు కులభ్రష్టుడైనవాడును కించిత్ మాత్రమైననూ దానధర్మములు చేయనివాడునూ, యితరులనువంచించించె వారివద్ద ధనమును హరించినవాడును అసత్యమాడి ప్రొద్ధుగడుపువాడును, మిత్రద్రోహియు, హత్యలు చేయువాడును, బ్రాహ్మణులను హింసించువాడును, సదావ్యభిచార గృహములలో తిరిగి, తాళిగట్టిన ఇల్లాలిని బిడ్డలను వేధించువాడును రాజద్రోహి, గురుద్రోహి, దైవభక్తి లేనివాడును, దైవభక్తులను యెగతాళిచేయువాడును, గర్వముకలవాడై తానే గొప్పవాడనని అహంభావముతో దైవకార్యములనూ ధర్మకార్యములనూ చెడగొట్టుచూ దంపతులకు విభేదములను కల్పించి సంసారములు విడదీయువాడును, ఇండ్లను తగలబెట్టువాడును, చెడుపనులకు ప్రేరేపించువాడను యీ విధమైన పాపకర్మలు చేయువారలు సైతము యెట్టి ప్రాయశ్చిత్తములూ జరుపకనే మాఘమాసమందు స్నానము చేసినంత మాత్రముననే పవిత్రులగుదురు. దేవీ! ఇంకనూ దీని మహత్యమును వివరించెదను వినుము. తెలిసియుండియు పాపములు చేయువాడు, క్రూరకర్మములు ఆచరించువారు, సిగ్గువిడిచి తిరుగువాడు, బ్రాహ్మణదూషకుడు మొదలగువారు మాఘమాసములో ఉదయమే నదికి వెళ్ళి స్నానము చేసిన యెడల వారికున్న పాపములన్నీ నాశనమగును. మాఘమాస స్నానమును ప్రాతఃకాలముననే చేయవలెను. అలాగున చేసినచో సత్ఫలితము కలుగును. యే మానవుడు భక్తిశ్రద్ధలతో మాఘమాసము మొదటి నుండి ఆఖరు పర్యంతమూ స్నానములు చేసెదనని సంకల్పించునో, అటువంటి మానవునికున్న పాపములు తొలగిపోయి, యెటువంటి దోషములూలేక పరిశుద్ధుడగును, అతడు పరమపదము జేరుటకు అర్హుడగును. శాంభవీ! పండ్రెండు మాసములలోనూ మాఘమాసము మిక్కిలి ప్రశస్తమైనది. సకలదేవతలలో శ్రీమన్నారాయణుడు ముఖ్యుడు. అన్ని శాస్త్రములలో వేదము ప్రధానమైనది. అన్ని జాతులలో బ్రాహ్మణుడధికుడు, అన్ని పర్వతములలో మేరుపర్వతము గొప్పది. అటులనే అన్ని మాసములో మాఘమాసము శ్రేష్ఠమైనదగుటచేత ఆ మాసమంతా ఆచరించెడి యే స్వల్పకార్యమైననూ గొప్ప ఫలితాన్ని కలగజేయును. చలిగానున్నదని స్నానముచేయని మనుష్యుడు తనకు లభించబోవు పుణ్యఫలమును కాలితో తన్నుకొన్నట్లే అగును. వౄద్ధులు, జబ్బుగానున్న వారు చలిలో చన్నీళ్ళ్లోలోస్నానము చేయలేరు. కాన, అట్టివారికి యెండుకట్టెలు తెచ్చి అగ్ని రాజవేసి వారిని చలికాగనిచ్చి తరువాత స్నానము చేయించినయెడల ఆ స్నానఫలమును పొందగలరు. చలి కాగినవారు స్నానము చేసి శ్రీవారినిదర్శించిన పిదప అగ్నిదేవునికి, సూర్యభగవానునికి నమస్కరించి నైవేద్యము పెట్టవలెను. మాఘ మాసములో శుచియైన ఒక బీదబ్రాహ్మణునికి వస్త్రదానము చేసిన యెడల శుభఫలితము కలుగును.
ఈ విధముగా ఆచరించెడి వారినిజూచి, యే మనుజుడైనను అపహాస్యము చేసినను లేక అడ్డు తగిలినను మహా పాపములు సంప్రాప్తించును. మాఘమాసము ప్రారంభము కాగానే వృద్ధులగు తండ్రిని, తల్లిని, భార్యను లేక కుటుంబసభ్యులందరినీ మాఘమాస స్నానమాచరించునటుల యే మానవుడు చేయునో అతనికి మాఘమాస ఫలితము తప్పక కలుగును. ఆ విధముగానే బ్రాహ్మణునికి కాని, వైశ్యునికికాని, క్షత్రియునికి కాని, శూద్రునికికాని మాఘమాసస్నానమును చేయుమని చెప్పినయెడలవారు పుణ్యలోకమునకు పోవుటకుయే అడ్డంకులునూ ఉండవు. మాఘమాసస్నానములు చేసినవారిని గాని, చేయలేని వారినికాని, ప్రోత్సహించువారలనుకాని జూచి ఆక్షేపించి పరిహాసములాడు వారికి ఘోర నరకబాధలు కలుగటయేగాక, ఆయుఃక్షీణము, వంశక్షీణము కలిగి దరిద్రులగుదురు. నడచుటకు ఓపికలేనివారు మాఘమాసములో కాళ్ళుచేతులు, ముఖము కడుగుకొని, తలపై నీళ్ళుజల్లుకొని, సూర్యనమస్కారములు చేసి, మాఘపురాణమును చదువుటగాని, వినిటగాని చేసిన యేడవ జన్మాంతమున విష్ణు సాన్నిధ్యమును పోందుదురు. పాపము, దరిద్రము నశింపవలయునన్న మాఘమాస స్నానముకన్న మరొక పుణ్యకార్య మేదియును లేదు. మాఘమాసము వలన కలుగు ఫలిత మెటువంటిదనగా, వంద అశ్వ మేధయాగములుచేసి, బ్రాహ్మణులకు యెక్కువ దక్షిణలిచ్చిన యెంతటి పుణ్య ఫలము కలుగునో మాఘస్నానము చేసిన అంతటి పుణ్య ఫలము కలుగ్ను. బ్రాహ్మణ హత్య, పితృహత్యాది మహాపాతకములు చేసిన మనుజుడైనను మాఘమాసమంత యును కడు నిష్ఠతోనున్న యెడల రౌరవాది నరకముల నుండి విముక్తుడగును. కనుక ఓ పార్వతీ! మాఘమాస స్నానము వలన యెట్టి ఫలితము కలుగునో వివరించితిని గాన, నే చెప్పిన రీతిన ఆచరించుట అందరికినీ శుభప్రదము.
మాఘ పురాణం – 3వఅధ్యాయము – గురుపుత్రికాకథ
మంగళదాయినీ! సర్వమంగళా! మాఘ మాసస్నాన ప్రభావముచే పూర్వమొక బ్రాహ్మణపుత్రిక పాపవిముక్తయై తన భర్తతో హరిసాన్నిధ్యము నందినది. అని శివుడు పార్వతీ దేవితో పలికెను. అప్పుడు పార్వతీదేవి స్వామీ! ఆ బ్రాహ్మణ పుత్రిక యెవరు. ఆమె చేసిన పాపమేమి! మాఘస్నానమున పాపవిముక్తి నందిన విధానమేమి? వివరముగ చెప్పగోరుచున్నాననగా శివుడిట్లుపలికెను. దేవి వినుము, పూర్వము సౌరాష్ట్రదేశమున బృందారకమనే గ్రామంలో సుదేవుడనే బ్రాహ్మణుడుండేవాడు. అతడు సదాచారవంతుడు, వేదశాస్త్రపండితుడు. అతనికి శిష్యులు చాలా మంది వుండేవారు. వారు, గురు సేవచేస్తూ విద్యాభ్యాసం చేస్తూవుండే వాళ్లు. ఆ సుదేవునికి సర్వాంగసుందరి అయిన కుమార్తె వుండేది. పొడవైన కేశములతో, చక్కని ముఖంతో, చక్కని కనుముక్కు తీరులో ఆమె మిక్కిలి మనోహరంగా వుండేది. ఇట్టి కుమార్తెను ఎవరికిచ్చి వివాహం చేయగలనని అతడు విచారిస్తూవుండేవాడు.
ఒకనాడు సుమిత్రుడనే శిష్యుడు సమిధలు, ధర్భలు మొదలైన వాటికోసం గురువు పంపగా వెళ్ళాడు. బంతితో ఆడుకుంటున్న గురుపుత్రికకూడా సుమిత్రుని వెంబడించి వెళ్లింది. సుమిత్రుడును చాలాదూరముపోయి ఆ అరణ్యములో ఒక జలాశయాన్ని చూచాడు. ఆ చెరువుగట్టున యెత్తైన చెట్లున్నాయి. నీరు నిర్మల మనోహరంగా వుంది, పద్మాలు వానిపై వ్రాలే తుమ్మెదలరొద, అనేకవర్ణములలోనున్న కలువలు, జలసంచారము చేయు జలప్రాణుల విహారము, మొదలైనవానిచే ఆ సరస్సు మనోహరముగనుండెను. కోకిలలుగుంపులు కట్టి మధురధ్వనులు చేయుచుండెను. చిలుకలు గోరువంకలు నేర్చినమాటలను పలుకుచున్నవి. ఎత్తైన చెట్లతో కప్పబడిన ఆ ప్రదేశము ఒక ఏకాంతమందిరములా వుంది.
గురుపుత్రిక ఆ చెరువులోని నీరుత్రాగి అచట వృక్షములకున్న పండ్లను తిని ఒకచోట కూర్చుండెను. సుమిత్రునిపై మనసుపడింది. ఓయీ! మనుష్య సంచారము లేని, యేకాంత ప్రాయమైన యీప్రదేశంలో నాకు నీతో కలిసి సుఖపడాలని వున్నది. ఈ వనము నీకును నాకును నచ్చినది మన మిద్ధరమును పడుచువారము, మన కలయిక సుఖప్రదమగును ఆలసించకనావద్దకు రమ్ము, నా శరీరము దూదికంటే మెత్తగానున్నది, నీకు మరింత సుఖమిచ్చును, రమ్ము నన్ను మోహములో తనివి దీర కౌగిలించుకొనుము, రమ్ము రమ్మనిపిలిచెను. సుమిత్రుడు మంచిదానా! నీవిట్లనకుము, నీ మాట దురాచార పూరితము. నీవు వివాహము కాని బాలవు. నాకు గురుపుత్రికవు మనము సోదరీసోదరులము, నీవు మన్మధ పరవశురాలవై ఇలా అనుచితముగా పలుకుచున్నావు. నేను నీతో రమింపజాలను. నేనీ మాటను సూర్యచంద్రుల సాక్షిగా చెప్పుచున్నాను. ఇట్టి పాపము చేసిన మనమిద్దరము చిరకాలము నరకవాసము చేయవలసియుండును. కావున యింటికి పోదమురమ్ము, గురువుగారు మనకై ఎదురు చూచుచుందురు. ఆలస్యమైనచో నిన్ను దండింపవచ్చును. సమిధలు, దర్భలు మున్నగు వానిని గొనిపోదము రమ్ము అని పలికెను.
గురుపుత్రిక ఆ మాటలను విని ఓయీ! కన్యారత్నము, సువర్ణము. విద్యాదేవత, అమృతము స్వయముగ చెంతకు చేరినపుడు వలదన్నవాడు మూర్ఖుడు. ఒకరినొకరము కౌగిలించుకొనక సుఖమునందక నేనింటికిరాను. నేనిచటనే నాప్రాణములను విడిచెదను. నీవు ఇంటికి తిరిగి వెళ్లి నేను రానిచో మా తండ్రి నిన్ను శపించును. నేను నీతో సుఖింపని యీ శరీరమునొల్లను. ఇచటనే యీ శరీరమును విడిచెదను. నీవింటికిపోయి దీని ఫలితము అనుభవింపుము అని నిష్టురముగ మన్మధావేశముతో మాటలాడెను. సుమిత్రుడును యేమిచేయవలెనో తెలియని స్థితిలోనుండెను. చివరకాతడు గురుపుత్రిక కోరికను దీర్చుటకంగీకరించెను. వారిద్దరును పద్మములతో పుష్పములతో ఎగురుటాకులతో మన్మధశయ్యను తీర్చుకొని మనోహరమైన ఆ వాతావరణములో యధేచ్చా సుఖములననుభవించిరి. వారిద్దరును తృప్తిపడిన తరువాత సమిధలు మున్నగువానిని దీసికొని గ్రామమునకు బయలుదేరిరి. గురువు శిష్యుడు తెచ్చిన సమిధలు మున్నగు వానిని చూచి యానందపడెను. పుత్రికను చూచి నీవు చాల అలసినట్లున్నావు, మధురాహారమును తిని విశ్రాంతినందుమని లోనికి పంపెను. ఆమెయు అట్లేయనిలోనికెగెను.
తండ్రియామెను కాశ్మీరదేశవాసియగు బ్రాహ్మ్ణునకిచ్చి వివాహము చేసెను. కొంతకాలమునకు ఆమె భర్త మరణించెను. భర్తను కోల్పోయి నేలపై బడి దుఃఖించుచున్న కుమార్తెను చూడలేక సుదేవుడును మిగుల దుఃఖించెను. అయ్యో! సుఖములనందవలసిన వయసులోనే బాధాకరమైన వైధవ్యము కలిగినదేమి? ఈమెకిట్టి బాధను కల్పించిన ఆ బ్రహ్మయెంత మూర్ఖుడో కదా అని పలువిధములుగా దుఃఖించుచుండెను. ఇట్లు సుదేవుడు వాని భార్య దుఃఖించుచుండగా దృడవ్రతుడను యోగి ఆ ప్రాంతమున దిరుగుచు సుదేవునిరోదనధ్వనిని విని వాని వద్దకు వచ్చి ‘జ్ఞానస్వరూపా! నీ దుఃఖమేమియో చెప్పుము. నీ దుఃఖమును పోగొట్టెదనని ధైర్యము చెప్పెను. సుదేవుడు తన దుఃఖకారణమును చెప్పి మరల దుఃఖించెను. యోగి సుదేవును, భార్యపుత్రికలను చూచి క్షణకాలము ధ్యానయోగము నందియిట్లు పలికెను. ఓయీ! వినుము నీ కుమార్తే పూర్వజన్మలో క్షత్రియకులమున జన్మించినది. వ్యభిచారిణియై చెడు ప్రవర్తన కలిగియుండెను. సౌందర్యవతి యౌవన వతి యగు ఆమె తన జారుల మాటలను విని తన భర్తను వధించెను. భర్తను వధించి భయపడి శోకించి ఆత్మహత్య చేసికొనెను. ఈమె పతిహత్యను, ఆత్మహత్యను చేసినది. ఆ రోషమువలన నీమెకీ జన్మమున యిట్టి వైధవ్యము కలిగినది. ఇట్టి యీమె పవిత్రమైన నీ వంశముననెట్లు జన్మించినదాయని నీకు సందేహము రావచ్చును. దానికిని కారణము కలదు వినుము. ఈమె తన పూర్వజన్మలో మాఘమాసమున సరస్వతీ నదీతీరమున గౌరీవ్రతము నాచరించువారితో కలసి వారు యిసుకతో చేసిన గౌరీదేవిని పూజించుచుండగా నీ వ్రతమును చూచినది. ఆ పుణ్యము బలమున నీమె పవిత్రమైన వంశమున జన్మించినది. ఈ జన్మయందునుస్వేరిణియై నీ శిష్యులతో అధర్మముగ రమించెను. ఈ దోషమువలన నీమె తమ కర్మఫలముల యిట్లననుభవించుచున్నది చేసిన కర్మము ననుభవింవింపక తప్పదు కదా!
సుదేవుడు యోగిమాటలను విని చెవులు మూసుకొని తన కుమార్తె పూర్వజన్మలో పతిహత్య, ఆత్మహత్యలకు పాల్పడుబదును. ఈ జన్మలో కన్యయై సోదరుతుల్యుడైన తన శిష్యునితో రమించుటనువిని మరింత దుఃఖించెను. యోగికి నమస్కరించి ‘తండ్రీ! నా కుమార్తే చేసిన పాపముయేమి చేసిన పోవును? ఆమె భర్త జీవించుటయేట్లు జరుగును? దయయుంచి చెప్పుడని పరిపరివిధముల ప్రార్థించెను.’ అప్పుడా యోగి ‘ఓయీ విద్వాంసుడా! నీ కుమార్తె చేసిన పాపములుపోవుటకు, ఆమె మాంగళ్యము నిలుచునట్లును చేయుటకొక ఉపాయముకలదు. శ్రద్ధగావినుము మాఘమాసమున ప్రాతఃస్నానముచేసి ఆ నదీతీరమునగాని సరస్సు తీరమున యిసుకతో గౌరీదేవిని జేసి షోడశోపచారములతో పూజింపవలయును. సువాసినులకు దక్షిణతో నా గౌరీదేవిని సమర్పించవలయును. ఈ విధముగ నీమచే ప్రతిదినము చేయింపుము. ఈమె భర్త తిరిగి జీవించును. ఈమె పాపములను నశించును. మాఘశుద్ద తదియనాడు రెండు క్రొత్తచెటలను తెచ్చి వానిలో చీర, రవికలగుడ్డ, ఫలపుష్పాదులు, పసుపుకుంకుమ మున్నగు సువాసిని అలంకారములనుంచి దక్షిణ తాంబూలములతో వాయనము నుంచి సువాసినీపూజచేసి ముత్తైదువలకిచ్చి ఏడుమార్లు ప్రదక్షిణ నమస్కారముల నాచరింపజేయుము. ఆ సువాసినికి షడ్రసోపేత భోజనము పెట్టి గౌరవింపవలయును. మాఘమాసమున ప్రాతఃకాలస్నానముల చేతను పైన చెప్పిన వ్రతాచరణము చేతను ఈమెకు పాపక్షయము కలుగును. భర్త పునర్జీవితుడై ఈమె మాంగళ్యము నిలుచును. మాఘస్నానము చేసిన విధవరాలు విష్ణులోకమును చేరును. మాఘస్నానము చేసి గౌరివ్రతమాచైంచిన సువాసిని తన మాంగళ్యమును నిలుపుకొని చిరకాలము సుఖించును. పిచ్చివారు, మూర్ఖులు మాఘస్నానము చేసినచో వారెట్టి వారైనను వారియనుహ్రహమునొంది చిరకాలము సుఖించి పుణ్యలోకముల నందుదురు. అని యోగి వివరించి తన దారినబోయెను. సుదేవుడు యోగి మాటలను నమ్మి తన కుమార్తెచే మాఘస్నానమును, గౌరీ పూజా విశిష్టమైన కాత్యాయనీ వ్రతమును భక్తి శ్రద్ధలతో చేయించెను. కాత్యాయనీ వ్రత మహిమ చేత సుదేవుని కుమార్తె పాపములుపోయి ఆమె భర్త పునర్జీవితుడయ్యెను. ఆమెయు చిరకాలము తన భర్తతో సుఖించి తన తల్లిదండ్రులతోను, భర్తతోను కలిసి దేహాంతమున వైకుంఠమును చేరెను. కావున మాఘమున ప్రాతఃకాల స్నానము నదిలోగాని, సరస్సునగాని, కాలువలోగాని చేసి తీరమున శ్రీహరి నర్చించినవారు, సుదేవుని పుత్రిక వంటివారైనను యిహమున సర్వసుఖములనంది పరమున వైకుంఠవాసులగుదురు సుమాయని శివుడు పార్వతీదేవికి మాఘస్నాన మహిమను వివరించెను.
మాఘ పురాణం – 4వ అధ్యాయము – సుమిత్రునికథ
పార్వతీదేవియు శివునిమాటలను విని స్వామీ మరి గురుకన్యా సంగమము చేసిన ఆ సుమిత్రుడు, సుదేవుని శిష్యుడు అతడేమయ్యెనో వాని వృత్తాంతము నెరుగగోరుచున్నాను, దయయుంచి దానిని వివరింపుడని కోరగా శివుడిట్లు పలికెను. పార్వతీ! సరియైన ప్రశ్ననడిగితివి వినుము. సుదేవుని శిష్యుడును తాను చేసిన గురుపుత్రికా సంగమమునకు పశ్చాత్తాపపడెను, చనిపోదునని గురుపుత్రిక బెదిరించుటచే భయపడి ఆమెతో వ్యభిచరింతినని అతడు బాధపడుచుండెను. తుదకు తనలోని బాధను భరింపలేక గురువు వద్దకు వచ్చి నమస్కరించి యిట్లుపలికెను. గురువర్యా! పూర్వము నేను మీ వద్ద చదువుచున్నప్పుడొకనాడు సమిధలు మున్నగువాటికై అడవికి మీ ఆజ్ఞచేపోతిని. మీ కుమార్తెయు బంతితోనాడుకొనుచు నాతో మీరు చూచుచుండగానే అడవికి వచ్చినది. అచట నిర్జనమైన ఏకాంత మనోహరప్రదేశమున నన్ను తబకోరిక తీర్చవలసినదిగ బలవంతపెట్టినది. నేనందుకు అంగీకరింపలేదు. అప్పుడామె ఓయీ! నీవు నామాటవిని నన్నుకూడనిచో నేనిచట నా ప్రాణములను విడిచెదను అనగా బలవంతముగ నాత్మహత్య చేసికొందును. నేను లేకుండ నీవింటికి పోయినచో నాతండ్రి నా కుమార్తె యెక్కడయని అడిగిన నీవేమని చెప్పగలవు. నీ గురువైన నా తండ్రి నాయందలి ప్రేమచే నిన్ను తప్పక శపించును. మూర్ఖుడా! యిప్పటికైనను నన్ను పొంది సుఖించుము. నన్ను వేగముగ కౌగలించుకొనుము రమ్ము. నా కోరికను దీర్చుమని యనేక విధములుగ నిర్భందించినది. నేనును మీ శాపమునకు భయపడి ఆ అరణ్యమున నీ పుత్రికతో రమించి ఆమెకోరికని తీర్చితిని. తరువాత నీ విషయమును మీకు చెప్పుటకు భయపడితిని. మీకుమార్తె చేసిన ద్రోహమువలన నేను పాపమును పొందితిని. దయయుంచి క్షమించి నీ పాపమునకు ప్రాయశ్చిత్తమును బోధింపుడని ప్రార్థించెను.
సుమిత్రుని మాటలను విని సుదేవుడు కొంతసేపు విచారించి యిట్లు పలికెను. ఓయీ! నీవు యితరుల ఒత్తిడికిలోనై చేసిన పాపమునకు ప్రాయశ్చిత్తము నడుగుచున్నావు. వినుము అన్ని నదులలో మిక్కిలి యుత్తమ నదియైన గంగాతీరమునకు పోయి పన్నెండు సంవత్సరముల పాటు తపమాచరింపుము. అదియే నీకు తగిన ప్రాయశ్చిత్తమని పలికెను. శిష్యుడైన సుమిత్రుడును గురువుచెప్పిన యుపదేశమును పాటించి గంగాతీరమునకు ప్రయాణమయ్యెను. అతడు తన ప్రయాణములో ఒకచోటనొక దివ్యమైన ఆశ్రమమును జూచెను. ప్రయాణము చేయవలసిన యతడు అచట విశ్రమించదలచెను. అచటివారందరును శిష్యులు, మిత్రులు, కుటుంబసభ్యులు మున్నగువారితో మాఘస్నానముచేసి శ్రీహరిని ఆ సరస్సు తీరమున పూజించి మాఘపురాణమును వినుచుండిరి.
సుమిత్రుడును వారికి నమస్కరించి మీరు చేయువ్రతమెట్టిది దయయుంచి వివరింపుడని ప్రార్థించెను. ఈ వ్రతమునకు ఫలమేమి? దీనిని చేసినచో నేలోకముకల్గును. మీరు పూజించునది యేదైవమును దయయుంచి చెప్పుడని యడిగెను. వారు సుమిత్రుడడిగిన ప్రార్థన విని తమలోనోకడైన సత్యవ్రతుడను వానిని విషయము వివరింపుమని నియమించిరి. సత్యవ్రతుడు సుమిత్రునితో ఇట్లు పలికెను, ఓయీ శ్రద్దగా వినుము. సూర్యుడు మకర రాశిలో నుండగ మాఘమాసమున ప్రాతఃకాలమున నది, సరస్సు మున్నగువానియందు స్నానముచేసినవాడు శ్రీహరికి యిష్టుడగును. ఇట్లు మాఘమున ప్రాతఃకాలస్నానము చేసి తీరమున శ్రీహరిని అర్చించి శ్రీహరి మహిమను వివరించు పురాణమును వినుచు మాఘమాసమంతయు గడుపుట పుణ్యప్రదమైన వ్రతము. మాఘ స్నానము మానినవాడు సత్యశౌచములను విడిచినవాడు, పరులనునిందించువాడు, బ్రహ్మహత్యచేసిన వానితో సమానులు, అబద్దపుసాక్ష్యమును చెప్పినవాడు, దురాచారుడు స్త్రీ సాంగత్యలోలుడు మాఘమాసస్నానము మానినవాడు, బ్రహ్మహత్యచేసిన వానితో సమానులేయగుదురు. తోటలను కూల్చినవాడు, కన్యలను, అశ్వములను అమ్మినవాడు, చెరువుగట్టును తెగ కొట్టినవాడు, పరస్త్రీ సాంగత్యము కలవాడు, దేవద్రవ్యము నపహరించువాడు, తానిచ్చిన దానినే దొంగలించువాడు, మద్యపానలోలుడు, ఆడినమాటను తప్పినవాడు, పెద్దలను, దేవతలను, బ్రాహ్మణులను ద్వేషించువాడు, దేవునికి నివేదన చేయని అన్నమును తినువాడు,పితృశేషాన్న భోజనుడు, సోదరుని భార్యతో రమించువాడు, అసత్యభాషణుడు, భుజించుచు అపవిత్రుల మాటలను వినువాడు, పురాణ శ్రవణమును, వివాహాది శుభకార్యములను పాడుచేయువాడు, తల్లిదండ్రులను దేషించు వాడు, వీరందరును పాపాత్ములే సుమా. మేము చేయుచున్న యీమాఘమాస వ్రతమును పాటించినచో యీ పాపుల బుద్ధులు మారి పరిశుద్ధులై పుణ్యములనందుదురు. మాఘస్నానము చేసి తీరమున తులసీదళములతో మాధవునర్చించిన వాని పుణ్య అమితమైనది సుమా. వ్రతాంతమున చేయు అన్నదానము శుభఫలప్రదము. ఈ వ్రత మాచరించిన వానికి పునర్జన్మ యుండదు అని సత్యవ్రతుడు మాఘస్నానవ్రత ఫలమును పెక్కువిధములుగ వివరించెను. సుమిత్రుడును వారికి తాను చేసిన పాపమును, గురువు చెప్పిన ప్రాయశ్చిత్తమును వివరించెను. అప్పుడు వారు మాఘస్నానమును మూడు దినములు చేసిన సర్వపాపములు నశించును. కావున యీ మాసమున యింకను మూడుదినములు మిగిలియున్నది. ఈ మూడుదినములును మాఘస్నానమాచరించి ప్రాయశ్చిత్తముగ గంగాతీరమున తపము చేయుమని సుమిత్రునకు హితము పలికిరి.
సుమిత్రుడును వారి మాటప్రకారము మాఘమాసము చివరలో మిగిలిన మూడు దినములును మాఘస్నానమును చేసి గంగాతీరమునకు పోయి ప్రాయశ్చిత్త తపమునారంభించెను. నిశ్చలమైన అతని తపము తీవ్రమై వర్ణింప రాని తీరులోనుండెను. ఈ విధముగా పన్నెండు సంవత్సరములు గడచినవి. అయినను మానక అతడిట్లు తపమాచరించుచు చక్రపాణియగు, శ్రీ హరి కృపావిశేషమునంది అనుగృహీతుడై మాఘస్నాన ప్రభావముచే గంగాతీర తపశ్చర్యచే కేవల ప్రాయశ్చితమునేగాక, మోక్షమును కూడా పొందెను. పార్వతీ నీవడిగిన సుదేవ శిష్యుడగు సుమిత్రుని వృత్తంతమును పూర్తిగ చెప్పితిని. సుమిత్రుని పాపవినాశమును, పుణ్యప్రాప్తిని వివరించు యీ కథను మాఘస్నానము చేసినవాడు. శ్రీహరి పూజానంతరము ఒకసారి చదివినను వైకుంఠమును చేరును. వాని పితృదేవతలును తమ పాపములను పోగొట్టుకొని వైకుంఠమునందుదురు. చందోవిహీనమైన మంత్రము, ఓంకారము లేని తపస్సు, మాఘస్నాన పూజాదులు లేని ధర్మాచరణ వ్యర్థములు సుమా అని శివుడు పార్వతికి వివరించెను.
మాఘ పురాణం 5వ అధ్యాయము – కుక్కకు విముక్తి కా విలుగుట
దిలీప మహారాజా! సుమిత్రుని కథ ఈశ్వరుడు పార్వతీదేవికి చెప్పిన రీతిగా విన్నావుకదా! ఇంకొక కథను పార్వతికి ఈశ్వరుడు ఈ విధముగా చెప్పెను. అదెట్లనగా మాఘమాసములో నదీస్నానములు చేయువారు గొప్ప ధనశాలులగుదురు. వర్తమానకాలమందు యెన్ని కష్టములు అనుభవించుచున్నప్పటికిని మాఘమాసము మొదలైన తరువాత, వారి కష్టములు క్రమేపి సమసిపోవును. మాఘశుద్ద దశమినాడు నిర్మలమైన మనస్సుతో శ్రీ మన్నారాయణుని పూజించినయెడల శ్రీహరి కటాక్షమునకు పాత్రులగుదురు. అందులో అణుమాత్రమైనను సంశయము లేదు అని పార్వతీదేవితో శంకరుడు వివరించుచుండగా పార్వతి –
“నాధా! శ్రీ లక్ష్మినారాయణుల వ్రతము చేసిన యెడల మనోవాంఛా ఫలసిద్ది కలుగునని చెప్పియుంటిరి గదా! ఆ వ్రత విధానమెట్టిదో, యెటుల ఆచరించవలెనో తెలియ పరచుడని” కోరినది. అంత మహేశ్వరుడు పార్వతితో ఇట్లు చెప్పసాగెను. మాఘశుద్ధ దశమినాడు ప్రాతఃకాలమున కాలకృత్యములు తీర్చుకొని స్నానము చేసి నదిఒడ్డునగాని, ఇంటివద్ద కాని, మంటపము నుంచి ఆ మంటపము ఆవుపేడతో అలికి పంచరంగులతో ముగ్గులు పెట్టి మంటపము మధ్య యెనిమిది రేకుల పద్మము వేసి, అన్ని రకాల పుష్పములు, ఫలములు తీసుకువచ్చి లక్ష్మినారాయణులను మంటపపు మధ్యనౌంచి, ఆ విగ్రహాలకు గంధము, కర్పూరము, అగరు మొదలగు ద్రవములు పూసి పూజించవలెను. రాగిచెంబులో నీళ్ళుపోసి మామిడిచిగుళ్లను అందులోవుంచి దానిపై కొబ్బరికాయ పెట్టి కొత్తవస్త్రము నొకదానిని కప్పి, లక్ష్మినారాయణుల ప్రతిమను ప్రతిష్టించి పూజించవలెను. ఆ మండపము మధ్యలో సాలగ్రామమునుంచి, ఒక సద్బ్రాహ్మణుని ఆహ్వానించి పూజించి వారిచేత ధూప దీప చందనాగరు పరిమళ వస్తువులుంచి నైవేద్యము పెట్టవలెను.
తరువాత రాగిపాత్రలో నీరుపోసి అర్ఘ్యప్రదానము చేయవలెను. అటు తరువాత సూర్యనారాయణ స్వరూపుడగు శ్రీరామచంద్ర ప్రభువును మదిలో ధ్యానించవలెను. మాఘమాసస్నానము చేయువారు వారి తల్లిదండ్రులు బంధుమిత్రుల సమక్షంలో మాఘమాస వ్రతము చేయవలయును. ఒక సద్బ్రాహ్మణునకు బియ్యము, బెల్లము, ఉప్పు, పప్పు, కాయగూరలు, పండ్లు మొదలగునవి ఏకపాత్రయందు వుంచికాని, క్రొత్తగుడ్డలో మూటగట్టికాని దానమియ్యవలయును. మాఘపురాణమును స్వయముగా పఠించునపుడుగాని, లేక వినునప్పుడు కాని చేతిలో అక్షితలు ఉంచుకొని, చివరిలో శ్రీమన్నారాయణుని ధ్యానించుకొని కొన్ని అక్షతలు భగవంతునిపై ఉంచి మరికొన్ని అక్షతలు తమ తలపైవేసుకొనవలయును గాన ఓ శాంభవీ! మాఘస్నానముచేసి మాఘశుద్ధ దశమినాడు లక్ష్మినారాయణులను నిష్ఠతో పూజించిన యెడల యెటువంటి మాహాపాపములైనను నశించిపోవును. ఇందులకొక ఉదాహరణ కూడా తెలియజేసెదను, సావధానురాలవై వినుము. గౌతమమహర్షి, ఒకనాడు తన శిష్యులతోగూడి తీర్థయాత్రలు చేయుటకై ఉత్తరదిశకు బయలుదేరాడు. వారు అనేక పుణ్యనదులలో స్నానములు చేయుచు ప్రసిద్ధ క్షేత్రములని దర్శించుచు మార్గమందున్న ముని పుణ్గవులతో యిష్టాగోష్ఠులు జరుపు కొన్నారు. అప్పటికి మాఘమాసము ప్రవేశించుట వలన కృష్ణానదిలో స్నానము చేయవలయునని ఆ ప్రాంతమునకు వచ్చి విడిది చేసిరి. గౌతముడు తన శిష్యులతో గూడి కృష్ణానదిలో సూర్యోదయ సమయములో స్నానము చేసి, తీరమున నున్న ఒక రావిచెట్టు వద్దకు వచ్చి
శ్లో. మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణురూపిణే |
అగ్రతశ్శివరూపాయ, వృక్షరాజాయతే నమో నమః ||
అని రావిచెట్టుకు నమస్కరించి, ఆ చెట్టు మొదట ఆసీనుడయి శ్రీహరిని విధియుక్తముగా పూజించెను. తరువాత శిష్యులందరికి మాఘమాస ప్రభావమును వినిపించెను. ఈ విధముగా ప్రతిదినము ఆచరించుచుండగా మాఘశుద్ధ దశామినాడు ఆ చెట్టు మొదట మండపమేర్పరచి ముగ్గులు, బొట్లుపెట్టి, మామిడాకుల తోరణాలు కట్టి అలంకరించారు. ఆ మండపము మధ్యలో శ్రీహరి చిత్రపటము నుంచి పూజించినారు. ఆ విధముగా పూజించుచున్న సమయంలో ఒక ఆడ కుక్క వచ్చి భగవంతునికి చేయుచున్న పూజా విధానమంతయు రెప్పవాల్చకుండా దీక్షతో చూచుచు
ఆ రావిచెట్టునకు యెదురుగా కూర్చుని ఉండెను. శిష్యులు వారి వద్దనున్న దండముతో దానిని బెదిరించిరి. ఆ కుక్క అచటనుండి లేచి ఉత్తరం వైపు మళ్ళి మరల తూర్పునకు తిరిగి, రావిచెట్టునకు యెదురుగా కూర్చుని ఉండెను. శిష్యులు వారి వద్దనున్న దండముతో దానిని బెదిరించిరి. ఆ కుక్క రావిచెట్టు చుట్టు తిరిగివచ్చినది. అప్పటికి మూడుసార్లు ఆ మండపము చుట్టు ప్రదక్షిణము చేసినందునా, అది మాఘమాసము అయివున్నందునా అది వెంటనే తన కుక్క రూపమును వదలి ఒక రాజుగా మారిపోయెను. ఆ రాజు సకలాభరణాలు ధరించిన వాడై మునులయెదుట నిలబడి వారందరికి నమస్కరించెను. అక్కడున్న ఆడకుక్క రాజుగా మారిపోవుటచూచిన మునులూ, గౌతమ మహర్షి కూడా అమితాశ్చర్యము నొందిరి. “ఓయీ! నీవెవ్వరవు? నీవిట్లు మారుటకు కారణమేమి?” అని గౌతముడు ప్రశ్నించెను.
“మునిచంద్రమా! నేను కళింగరాజును, మాది చంద్రవంశము నాపేరు జయచంద్రుడు, నాకు అన్ని విద్యలయందు ప్రావీణ్యత గలదు. నా దేశ ప్రజలను ధర్మ మార్గమున పరిపాలన చేయుచూ వున్నాను, దానధర్మములనిన నాకు అతిప్రేమ, నేను అనేక దానాలు చేసియుంటిని, గో, భూ, హిరణ్య, సాలగ్రామ దానాలు కూడా చేసియున్నాను, ఎక్కువగా అన్నదానము, తిలదానము చేసియున్నాను. అనేక ప్రాంతాలలో చెరువులు త్రవ్వించాను. నూతులు త్రవ్వించి బాటసారులకు నీడనిచ్చు నిమిత్తం చెట్లను నాటించాను. ధర్మశాలలను కట్టించాను. పశువులు త్రాగుటకు నీటి గుంటలు త్రవ్వించాను. నిత్యము బీద ప్రజల నిమిత్తం అన్నదానములు, మంచినీటి చలివేంద్రములునునెన్నో పుణ్యకార్యాలు చేసియున్నాను. అనేక దేవాలయాలను నిర్మించి, దైవ విగ్రహాలను ప్రతిష్టించాను. సద్బ్రాహ్మణుల చేతను, వేదాలు చదువు పండితుల చేతను యెన్నో క్రతువులు చేయించాను. పురాణాలలో వున్న ధర్మాలన్నియును చేసియున్నాను. కాని, నేనిలా కుక్కనయ్యాను, దానికి కారణము లేకపోలేదు. ఆ కారణము కూడా నేను విశరపరచెదను వినుడు.
ఒకానొక దినమున ఒకముని పుంగవుడు గొప్ప యఙ్ఞ మొకటి తలపెట్టాడు. యజ్ఞము చేయుటన్న సామాన్య విషయము కాదు కదా! దానికి ధనము, వస్తు సముదాయము చాలా కావలెను గాన, ఆ మునిపుంగవుడు నా వద్దకు వచ్చి అర్థించెను. ముని సత్తముడు వచ్చిన వెంటనే యెదురేగి కాళ్ళుకడిగి ఆ నీళ్ళు నా శిరస్సుపై జల్లుకొని కుశల ప్రశ్నలడిగితిని ఆ మునియు నా సత్కారమునకు మిక్కిలి సంతసించి, ‘రాజా! నీకు గుప్త విషయములు తెలియజేయుదును, ఈ మాసములో మకర రాశి యందు సూర్యుడు ప్రవేశించును. ఆ దినము సూర్యోదయము అయిన తర్వాత నీవు స్నానము చేసి భక్తి శ్రద్ధ్లతో మాఘమాస మహత్మ్యమును చదువుట కాని లేక వినుట కాని చేయుము. దాని వలన నీకు వైకుంఠ ప్రాప్తి కలుగును. అంతియేకాగ, అశ్వమేధయాగము చేసిన యెడల యెంతటి ఫలితము కలుగునో అంతటి ఫలము కాని, తీర్థస్నానములు చేయగా వచ్చిన ఫలముగాని లేక దానపుణ్యములు అనగా వందయాగాలు చేసినంత ఫలముగాని పొందగలవు. మాఘ శుద్ధ సప్తమి ఆదివారం వచ్చినగాని, దశమి ఆదివారం వచ్చిన కాని ఉదయమే స్నానము చేసిననూ మరియు మాఘపౌర్ణమిరోజు ఉదయమున స్నానము చేసిననూ మానవుడు యెటువంటి పాపములనైనను విడువగలడు.
ఒక వేళ యితర జాతుల వారైనను మాఘమాసమంతా నిష్ఠతో నదీస్నానమాచరించి, దానధర్మాలాచరించి మాఘ పురాణము పఠించినను లేక వినినను మరుజన్మలో బ్రాహ్మణులై జన్మింతురు, అని ఆ మునివర్యుడు నాతో చెప్పగా, నేను అతనిని అవమానించినటుల మాటలాడి యిట్లంటిని. అయ్యా! మునిసత్తమా! మీరు పలికిన విషయములు నాకు తెలియును, అన్నియు బూటకములు. వాటిని నేను యదార్థములని అంగీకరించెను. ఏవో అతిశయోక్తులు తప్ప మరొకటికాదు గాన నేనుయే మాఘమాసములు చేయుటకాని, దాన పుణ్యాదులు చేయుటగాని, పూజా నమస్కారములు ఆచరించుటకాని చేయును. చలిదినములలో చన్నీళ్ళు స్నానము చేయుట యెంత కష్టము? ఇక నాకు యీ నీతిబోధలు చెప్పకుడు. నాకున్న ఫలములు చాలునని ఆ మునితో అంటిని నా మాటలకు మునికికోపము వచ్చినది, ముఖం చిట్లించుకొని సరే, నేను చెప్పవలసినది చెప్పితిని. అది నా ధర్మము అని యజ్ఞమునకు కావలసిన ధనమును తీసికొనకుండానే వెడలిపోయినాడు. అంతట నేను ఆ మునిని చేతులుపట్టి బ్రతిమలాడగా, యెట్టకేలకు అంగీకరించి ధనమును తీసికొనిపోయెను, ఆ విధముగా నేను కొంతకాలము రాజ్యమేలి ప్రాణములను విడిచితిని, తరువాత నాకు వరుసగా యేడుజన్మలూ కుక్క జన్మయే వచ్చినది. నా పాపఫలమేమోగాని కుక్కగా యేడు జన్మలూ బాధపడితిని ఇప్పుడు మీరు చేయు పూజాస్థలము చుట్టు మూడు పర్యాయములు ప్రదక్షిణము జేసితిని కాన నా పూర్వజన్మస్మృతి నాకు కలిగినది. దైవ యోగమును యెవ్వరునూ తప్పించలేరు గదా! ఇటుల కుక్కజన్మలో ఉండగా మరల నాకు పూర్వ జన్మస్మృతి యెటుల సంక్రమించినదో వివరింపుడనివేడెదను అని రాజు పలికెను.
ఆ రాజు చెప్పిన వృత్తాంతము విని గౌతమముని ఆశ్చర్యపడి మాఘమాసమును నీవు చులకనగా చూచుటవలన యెంతటి విపత్తువాటిల్లెనో అనుభవమే చెప్పుచున్నది. నీ వద్దకు వచ్చిన మునిసత్తముడు ఉత్తముడు. అతను పలికిన విషయములన్నియు యదార్థములే నీవు కుక్కవై యెటుల పవిత్రుడనైతివో ఆ వృత్తాంతమును వివరించెదను సావధానుడవై ఆలకింపుము.
నేను నా శిష్యులతో కృష్ణవేణీ తీరమందుండి ఈ మాఘమాసమంతయు కృష్ణానదిలో స్నానములు జపములు చేసి తిరిగి మరొక పుణ్యనదికి పోవుదమని వచ్చియుంటిని. మేమందరము ఈ వృక్ష రాజము క్రింద విష్ణు విగ్రహాన్ని పూజించుకొనుచున్నాము. కుక్క రూపములోనున్న నీవు దారినిపోతూ యిచ్చట నైవేద్యమును చూసి తినవలయుననెడి ఆశతో పూజా సమీపమునకు వచ్చి కూర్చుంటివి. అప్పుడు నీవు యెలాగున్నావో తెలుసా! నీ శరీరమున బురదమైల తగిలివున్నది. చూచుటకు చాలా అసహ్యముగా వున్నావు. పరిశుద్ధులమై భగవంతుని పూజచేయుచున్న సమయములో అచటకు జంతువు కాని, పక్షికాని, వచ్చియున్న దానిని తరిమివేయుట సహజమే కదా! నీవు అసహ్యముగా వుంన్నందున నా శిష్యులు నిన్ను తపోదండములతో నిన్ను కొట్టబోవుటచే పారిపోయి, నైవేద్యమును తినవలెనను. ఆశతో తిరిగి యధాస్థానమునకు వచ్చి కూర్చుంటివి. మరల నా శిష్యులు నిన్ను కొట్టబోవుటచే పారిపోయి తిరిగి మళ్ళి వచ్చినావు. అట్లు మూడు పర్యాయములు తిరుగుటచే భగవంతుడు నీ రూపమును మార్చి నిజరూపమును ప్రసాదించినాడు. అనగా భగవంతుని మండపము చుట్టూ తిరుగుటవలన మాఘమాస ఫలము కలిగి పునర్జన్మ వచ్చినదన్నమాట. ఇక మాఘమాస మంతయు నదిలోస్నానం చేసి భగవంతుని ధ్యానించి, పురాణపఠనము చేసినచో యెంతటి ఫలమువచ్చునో ఊహించుకొనుము అని చెప్పగా రాజు వినుచుండగా, అంతలోనే ఆ రావిచెట్టునకున్న ఒక తొర్రనుండి ఒక మండూకము బయటకు వచ్చి, గౌతమఋషి పాదముల పైపడి బెకబెకమని అరచి, అటునిటు గెంతుచుండెను. అట్లు గెంతుటలో మండపము వద్దకు వచ్చి చూచుచుండగానే కొంచెములో హఠాత్తుగా కప్ప రూపమును వదలి మునివనితగా మారిపోయెను. ఆమె నవ యవ్వనవతి, అతి సుందరాంగి, గౌతమఋషిని చూడగానే ఆమెకు జ్ఞానోదయమై తన యొక్క పూర్వజన్మ వృత్తాంతమంతయు జ్ఞప్తికి వచ్చినది. అంత గౌతమముని ‘అమ్మాయీ! నీ వెవ్వరిదానవు? నీ నామధాయమేమి? నీ వృత్తాంతము యేమి?’ అని ప్రశ్నించెను. ఆమె తన పూర్వజన్మ వృత్తాంతము తెలియ జేయుటకై యిట్లు చెప్పదొడంగెను.
మాఘ పురాణం – 6వ అధ్యాయము – కప్పరూపమును విడిచిన స్త్రీ పూర్వకథ
మునిశ్రేష్ఠా! నా వృత్తాంతమును తెలియజేయుదును గాన ఆల్కింపుము. నా జన్మస్థానము గోదావరి నది సమీపమందున్న ఒక కుగ్రామము, నా తండ్రి పేరు హరిశర్మ, నా పేరు మంజుల. నన్ను నా తండ్రి కావేరితీరవాసియగు జ్ఞానానందుడను వానికిచ్చి పెండ్లి చేసెను. అతడు దైవభక్తుడు, జ్ఞాని, నిగర్వి మాకు వివాహమైన వెంటనే అతని వెంట కాపురమునకు వెళ్ళినాను. మరి కొన్నాళ్ళకు మాఘమాసము ప్రవేశించినది.
ఒకనాడు నా భర్త “సఖీ! మాఘమాసము ప్రవేశించినది, యీనెల చాల పవిత్రమైనది, దీని మహత్తు చాలా విలువైనది. నేను నా చిన్నతనము నుండి ప్రతి సంవత్సరమూ మాఘ స్నానములు చేయుచున్నాను. నీవు నా భార్యవు కావున నీవును యీ మాఘమాసమంతయు యీ కావేరీ నదిలో స్నానమాచరింపుము. ప్రతిదినము ప్రాతఃకాలమున నిద్రలేచి, కాలకృత్యములు తీర్చుకొను సమయమునకు తెల్లవారి సూర్యోదయమగును. సూర్యుడు ఉదయించిన వెంటనే నదికిపోయి నదిలో స్నానము చేయుదము. ప్రభత సూర్యునికి నమస్కరించిన తరువాత నది ఒడ్డున విష్ణువు యొక్క చిత్రపటమును పెట్టి పువ్వులతోను, మంచి గంధము, అగరు, ధూప దీపములతోను పూజించి స్వామికి ఖండచెక్కర, పటిబెల్లం నైవేద్యమిచ్చి నమస్కరింతము, తరువాత తులసితీర్థము లోనికి పుచ్చుకొందుము. మన కుటీరమునకు వచ్చి మాఘపురాణమును రోజుకొక అధ్యాయము చొప్పున పఠింతము. దీని వలన మనకు చాలా ఫలము కలుగును. నీ అయిదవతనము చల్లగా వుండును” అని హితబోధ జేసెను.
నేను అతని మాటలు వినిపించుకోక రుసరుసలాడి, అతనిని నీచముగా జూచితిని, నా భర్త చాలా శాంతస్వరూపుడు. అయిననూ నేను హద్దుమీరి మాటలాడుటచే అతనికి కోపము వచ్చి “ఓసీ మూర్ఖురాలా! నా యింటికి వచ్చి నా వంశమును ఉద్ధరిస్తావనుకున్నాను. ఇంత దైవద్వేషిణివని నాకు తెలియదు. నీవిక నాతో ఉండదగవు. మాఘమాస వ్రతము నీకింత నీచముగా కనిపించినదా, అదియే నీ పాపమునకు నిన్ను శిక్షించును గాని, మగని మాటకు మారాడిన ఫలితముగా కృష్ణానదీతీరమందున్న రావిచెట్టు తొర్రలో మండూకమువై పడిఉందువుగాక” అని నన్ను శపించెను.
“అమ్మాయీ! భయపడకుము, నీకీశాపము కలిగి వెయ్యేండ్లు పైగా అయినది. ఇంతకాలము నీవు అనేక కష్టములు పడి జీవించినావు. నీ భర్తయును యేకాంతముగా చాలకాలము జీవించి హరినామ సంకీర్తనలు చేయుచు మృతుడయ్యెను. అతడిప్పుడు వైకుంఠములోనున్నాడు. నీవు నీ పతిమాటలు విననందున యెంత కష్టపడినావో తెలిసినదికదా! మాఘమాస ప్రభావము అసామాన్యమైనది. సకల సౌభాగ్యములు, పుత్రసంతతి, ఆరోగ్యము కలుగుటయేగాక మోక్షసాధనము కూడ నీకీ మాఘమాస వ్రతము మించిన మరి యొక వ్రతము లేదు. విష్ణుమూర్తికి ప్రీతియైనది వ్రతము నీ భర్త దూరదృష్టి కలజ్ఞాని, అతని గుణగణాలకు అందరూ సంతసించెడి వారు నిన్ను పెండ్లి యాడిన తరువాత తన వంశాభివృద్ధి చేసుకొనవలయుననెడి ఆశతో నుండెడివాడు. కానీ, నీ వలన అతని ఆశలన్నీ నిరాశలయిపోయినవి. నీ మూర్ఖత్వము వలన నీ భర్తకు కోపము కలిగి నిన్ను శపించవలసి వచ్చెను. నిన్ను నీళ్ళలో స్నానము చేయమన్నాడు, నీవు చేయనన్నావు. అందువలన నీకు నీరు దొరకకుండా చెట్టుతొర్రలో జీవించుమని శపించాడు.
ఈ దినమున దైవ నిర్ణయముచే నీవు నా సమక్షములో పడినందున నీ భర్త శాపము ప్రకారము మరల నీ నిజరూపమును పొందగలిగినావు అందునా యిది మాఘమాసము కృష్ణానదీ తీరము కాన మాఘమాస వ్రత సమయము నీకన్ని విధములా అనుకూలమైన రోజు అందుచే నీవు వెంటనే శుచివైరమ్ము. స్త్రీలుకాని, పురుషులుకాని యీ సమయములో ప్రాతఃకాలమున స్నానము చేసినయెడల విష్ణు సాన్నిధ్యమును పొందుదురు. ఎవరైనా తెలిసి కాని, తెలియక కాని మాఘశుద్ధ సప్తమి, దశమి, పౌర్ణమి లయందునూ, పాడ్యమి రోజుననూ నదీ స్నానమాచరించినయెడల వారి పాపములు నశించును. మాఘ సుద్ధ పాడ్యమినాడునూ, అటులనే దశమి, ఏకాదశి, ద్వాదశి దినముల లోనూ స్నానము చేసి శ్రీమన్నారాయణుని పూజించి, పురాణ కాలక్షేపము చేసినయెడల శ్రీహరి సంతోషించి మనోవాంఛలు సిద్ధించునటుల వరమిచ్చును. భక్తి శ్రద్ధలతొ మాఘ పురాణము వినిన మోక్ష ప్రాప్తి కలుగును”, అని గౌతమ ముని ఆమెతో చెప్పినట్లుగా మహేశ్వరుడు పార్వతితో ఈ కథ చెప్పెను.
మాఘ పురాణం – 7వ అధ్యాయము – లోభికి కలిగిన మాఘమాస స్నానఫలము
వశిష్ట మహర్షి పార్వతితో పరమేశ్వరుడు చెప్పిన పిసినారి వృత్తాంతమును దిలీపుడు యిట్లు తెలియజేసెను. పార్వతీ! చాలాకాలం క్రిందట దక్షిణ ప్రాంతమందు అసంతవాడయను నామముగల పెద్దనగరముండెను. అందు బంగారుశెట్టి అను వైశ్యుడొకడు వుండెను. అతని భార్యపేరు తాయారమ్మ. బంగారుశెట్టి పిసినిగొట్టు తనకున్న పిత్రార్జిత సంపదయే లెక్కకు మిక్కుటముగా నున్నది, కాని, అతడు ఇంకనూ ధనాశకలవాడై తనవద్దనున్న ధనమును వడ్డీలకిచ్చి మరింత సంపన్నుడయ్యెను. కాని ఒక్కనాడైననూ శ్రీహరిని ధ్యానించుటగాని, దానధర్మాలు చేయుటగాని యెరుగడు. అంతేకాక బీదప్రజలకు వారి ఆస్తులపై వడ్డీలకు ఋణాలిచ్చి ఆ అనుకున్న గడువుకు ఋణం తీర్చనందున తప్పుడు సాక్ష్యాలతో వ్యాజ్యములు వేసి, వారి ఆస్తులు సైతము స్వాధీన పరచుకొనేవాడు. ఒకనాడు బంగారుశెట్టి గ్రామాంతరము వెళ్ళెను, ఆ రొజు సాయంత్రం ఒక ముదుసలి బ్రాహ్మణుడు బంగారుశెట్టి భార్యను చూచి, “తల్లీ! నేను ముసలివాడను నా గ్రామము చేరవలయునన్న యింకనూ పది ఆమడలు వెళ్ళవలసియున్నది. ఇప్పుడు చీకటి కాబోతున్నది, ఆకాశంలో మేఘాలు ఉరుముతున్నాయి. చలిగాలికి వణికిపోతున్నాను. మీ ఇంటివద్ద రాత్రి గడుపనిమ్ము నీకెంతైనా పుణ్యముంటుంది. నేను సద్భ్రాహ్మణుడను, సదాచారవ్రతుడను ప్రాతఃకాలమున మాఘస్నానము చేసి వెళ్ళిపోయెడను” అని బ్రతిమలాడెను.
తాయారమ్మకు జాలికలిగెను వెంటనే తన అరుగుమూల శుభ్రము చేసి, అందొక తుంగచాపవేసి, కప్పుకొనుటకు వస్త్రమిచ్చి పండుకొనుడని పలికెను. ఆమె దయార్ర్ద హృదయమునకు ఆ వృద్ద బ్రాహ్మణుడు సంతసించి విశ్రాంతి తీసుకొనుచుండగా తాయారమ్మ ఒక ఫలమునిచ్చి దానిని భుజింపుమని చెప్పి, “ఆర్యా మాఘస్నానము చేసి వెళ్ళెదనని యన్నారు కదా! ఆ మాఘస్నానమేమి? సెలవిండు వినుటకు కుతూహలముగా నున్నది” అని అడుగగా నా వృద్ధ బ్రాహ్మణుడు దుప్పటికప్పుకొని, “అమ్మా మాఘమాసము గురించి చెప్పుట నాశక్యము కాదు, ఈ మాఘమాసములో నది యందు గాని, తటాకమందు గాని లేక నూతియందుగాని సూర్యోదయము అయిన తర్వాత చన్నీళ్ళు స్నానము చేసి విష్ణుమందిరనికి వెళ్ళి తులసి దళముతోను, పూలతోను పూజ చేసి స్వామివారి ప్రసాదమును స్వీకరించవలెను, తరువాత మాఘపురాణము పఠించవలెను. ఇట్లు ప్రతిదినము విడువకుండా నెలరోజులు చేసి ఆఖరున బ్రాహ్మణ సమారాధన, దానధర్మములు చేయవలెను. ఇట్లు చేసినయెడల మానవును రౌరవాది నరక విశేషములలో పడవేయు అశేష మహాపాపములు వెంటనే నశించిపోవును. ఒకవేళ ఈ నెలరోజులూ చేయలేనివారూ, వృద్దులూ, రోగులు ఒక్కరోజయినను అనగా ఏకాదశినాడు గాని, ద్వాదశినాడు గాని లేక పౌర్ణమినాడు గాని పై ప్రకారము చేసినచో సకలపాపములు తొలగి సిరిసంపదలు, పుత్రసంతానము కలుగును. ఇది నా అనుభవముతో తెలియజేయుచున్నాను” అని చెప్పగా, ఆ బ్రాహ్మణుని మాటలకు తాయారమ్మ మిక్కిలి సంతసించి తాను కూడ ప్రాతఃకాలమున బ్రాహ్మణునితో బాటు నదికిపోయి స్నానము జేయుటకు నిశ్చయించుకొనెను.
అంతలో పొరుగూరికి వెళ్ళిన తన భర్తయగు బంగారుశెట్టి యింటికిరాగా ఆమె అతనికి మాఘమాసము గురించి చెప్పి తాను తెల్లవారుజామున స్నానమునకు పోదునని తెలియజేసెను. భార్య చెప్పిన మాటలకు బంగారుశెట్టికి కోపమువచ్చి, వంటినిండా మంటలు బయలదేరినట్టుగా పళ్ళు పటపటాకొరికి “ఓసీ వెర్రిదానా! ఎవరు చెప్పినారే నీకీ సంగతి? మాఘమాసమేమిటి? స్నానమేమిటి? వ్రతము, దానములేమిటి? నీకేమైనా పిచ్చి పట్టినదా? చాలు చాలు అధిక ప్రసంగముచేసినచో నోరునొక్కివేయుదును. డబ్బును సంపాదించుటలో పంచప్రాణములు పోవుచున్నవి ఎవరికిని ఒక్కపైసాకూడా వదలకుండా వడ్డీలు వసూలుచేస్తూ కూడబెట్టిన ధనమును దానము చేయుదువా? చలిలో చన్నీళ్ళు స్నానముచేసి, పూజలుచేసి, దానములుచేస్తే వళ్ళూ యిల్లూ గుల్లయి, నెత్తి పైన చెంగు వేసుకొని ‘భిక్షాందేహీ’ అని అనవలసినదే జాగ్రత్త! వెళ్ళి పదుకో”, అని కోపంగా కసిరాడు.
ఆ రాత్రి తాయారమ్మకు నిద్రపట్టలేదు. యెప్పుడు తెల్లవారునా యెప్పుడు నదికి వెళ్ళి స్నానము చేతునా అని ఆతృతగా ఉన్నది. కొన్ని గడియలకు తెల్లవారినది తాను కాలకృత్యములు తీర్చుకొని యింటికి వచ్చియున్న వృద్ధ బ్రాహ్మణునితో కలిసి, మగనికి చెప్పకుండ నదికిపోయి స్నానముచేయుచున్నది. ఈలోగా బంగారుశెట్టి పసిగట్టి ఒక దుడ్డుకర్ర తీసుకొని నదికిపోయి నీళ్ళలోదిగి భార్యను కొట్టబోవుచుండగా, ఆ యిద్దరూ కొంతతడవు నీళ్ళలో పెనుగులాడిరి అటుల మునుగుటచే ఇద్దరికి మాఘమాస ఫలము దక్కినది. మొత్తం మీద బంగారుశెట్టి భార్యను కొట్టి యింటికి తీసుకువచ్చినాడు.
కొన్ని సంవత్సరములు తరువాత ఒకనాడు ఇద్దరకూ ఒకవ్యాధి సోకినది. మరికొన్ని రోజులకు ఇద్దరూ చనిపోవుటచే బంగారుశెట్టిని తీసుకొనిపోవుటకు యమభటులు వచ్చి కాలపాశము వేసి తీసుకొని పోవుచుండిరి. తాయారమ్మను తీసికొని పోవుటకు విష్ణుదూతలు వచ్చి ఆమెను రధముపై ఎక్కించుకొని తీసికొనిపోవుచుండిరి. అపుడు తాయారమ్మ యమభటులతో యిట్లు పలికెను.
“ఓ యమభటులారా! ఏమిటీ అన్యాయము? నన్ను వైకుంఠమునకు తీసుకొని పోవుట ఏమిటి? నా భర్తను యమలోకమునకు తీసుకొనిపోవుట ఏమిటి? ఇద్దరమూ సమానమేగదా” అని వారి నుద్దేశించి అడుగగా, ఓ అమ్మా! నీవు మాఘమాసములో ఒకదినమున నదీస్నానము చేయగా నీకీ ఫలము దక్కినది. కనీ, నీ భర్త అనేకులను హింసించి, అన్యాయముగా ధనార్జన చేసి అనేకులవద్ద అసత్త్యములాడి నరకమన్న భయములేక భగవంతునిపై భక్తిలేక వ్యవహరించునందులకే యమలోకమునకు తీసుకొని పోవుచున్నాము అని యమభటులు పలికిరి.
ఆమె మరల వారినిట్లు ప్రశ్నించెను. “నేను ఒకే దినమున స్నానము చేసినందున పుణ్యఫలము కలిగినప్పుడు నన్ను కొట్టుచూ నాతో నా భర్తకూడా నీటమునిగినాడు కదా! శిక్షించుటలో యింత వ్యత్యాసమేలకలుగెను?” అని అనగా ఆ యమభటులకు సంశయము కలిగి, యేమియు తోచక చిత్రగుప్తుని వద్దకు వెళ్ళి జరిగిన సంగతిని, ఆమె వేసిన ప్రశ్ననూ తెలియజేసిరి. చిత్రగుప్తుడు వారి పాపపుణ్యముల పట్టికచూడగా, ఇద్దరకూ సమానమైన పుణ్య ఫలము వ్రాసియున్నది. జరిగిన పొరపాటునకు చిత్రగుప్తుడు విచారించి బంగారుశెట్టిని కూడా వైకుంఠమునకు తీసుకొని పొమ్మని విష్ణుదూతలతో చెప్పెను. విష్ణులోకమునకు ముందు వెళ్ళియున్న తాయారమ్మ తన భర్త గతి యేమయ్యెనో యని ఆతృతతో ఉండగా, బంగారుశెట్టి పుష్పకవిమానము మీద తెచ్చి వైకుంఠములో విడిచిరి. భార్యా భర్తలిద్దరూ మిక్కిలి సంతసమందిరి. రాజా! వింటివా! భార్యవలన భర్తకు కూడా యెటుల మోక్షము కలిగెనో భర్త దుర్మార్గుడై పిసినిగొట్టుగా వ్యవహరించినను భార్యా యధాలాపముగా ఒక్కరోజు మాఘమాసస్నానము చేసినందున యిద్దరికిని వైకుంఠప్రాప్తి కలిగినదిగా! గనుక మాఘస్నానము నెలరోజులు చేసినచో మరింత మోక్షదాయకమగుననుటలో సందేహములేదు.
8వ అధ్యాయము – దత్తత్రేయుడు కార్తవీర్యార్జునకు ఉపదేశమిచుచుట
దత్తత్రేయుడు బ్రహ్మా, విష్ణు, మహేశ్వరుల యొక్క అంశమున జన్మించినాదు. అతడు కూడ లోక
కళ్యాణముకొరకు ఘనకార్యములు చేసినాడు, త్రిమూర్తులు దత్తాత్రేయుని రూపమున జన్మించి ఉన్నారు.
దత్తత్రేయుని కాలములో కార్తవీర్యర్జునుడను క్షత్రియ వీరుడు ‘మాహిష్మతీ యను నగరమును రాజధానిగా జేసుకొని
పాలించుచుండెను. అతనికి గురువర్యులు దత్తత్రేయులు, ఒకనాడు కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయుని
ఆశ్రమమునకు వెళ్ళి నమస్కరించి “గురువర్యా! మీ అనుగ్రహమువలన అనేక విషయాలు తెలుసుకొని వుంటిని, కాని
మాఘమాసము యొక్క మహత్మ్యమును వినియుండలేదు. కావున, మాఘమాసము యొక్క విశిష్టత గురించి మాఘమాస
ఫలము గురించి నాకు వివరించవలసినదిగా కోరుచున్నాను, అని దత్తాత్రేయుని కోరెను. దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునుని
కోరికను మన్నించి ఈ విధముగా వివరించెను. “భూపాలా! భరతఖండములోనున్న పుణ్యనదులకు సమనమైన
నదులు ప్రపంచమండెచ్చటనూలేవు. ఈ నదులలో ముఖ్యమైనవి పండ్రెండు. అందుచేతనే వీటికి పుష్కర
ప్రవేశము కలుగుచున్నది. బృహస్పతి ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్కరాశి యందున్నప్పుడు ఆయా
నదులకు పుష్కర ప్రారంభమగును. కనుక అటువంటి నదుల యందు స్నానము చేసి దానధర్మములచరించిన యెడల దానివలన
కలుగు ఫలము వర్ణించుటకు నాకు కూడ సాధ్యము కాదు. అందునా మాఘమాసమందు నదిలో స్నానము చేసిన
గొప్పఫలితము కలుగుటయేకాక జన్మరాహిత్యము కూడ కలుగును. గనుక, యే మానవుడైననూ మాఘమాసములో
సూర్యుడు మకర రాశియందుండగా మాఘస్నానముచేసి, ఒక సద్బ్రాహ్మణునకు దానధర్మములు చేసినచో
పంచమహపాతకములు చేసినవాడైనను ముక్తి పొందగలడు”, అని దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునికి యింకనూ యీవిధముగా
చెప్పుచున్నాడు.
“పూర్వకాలమున గంగానదీతీరపు ఉత్తరభాగమున భాగ్యపురమను పట్టణము కలదు. అందు నివసించు జనులు కుబేరులువలెనున్నారు. ఆ నగరములో మాంబరుడను వైశ్యుడు కలడు. అతడు గొప్ప ధనవంతుదు, బంగారునగలు, నాణేములు రాసులకొలది ఉన్నవాడు. కొంతకాలమునకు హేమాంబరుడు చనిపోయెను,
తండ్రి చనిపోగానే అతని కుమారులిద్దరూ తండ్రి ఆస్తిని భాగములు చేసి పంచుకొని, యిష్టమువచ్చినటుల
పాడు చేయుచుండిరి. ఇద్దరు చెరొక ఉంపుడుకత్తెనూ జేరదీసి, కులభ్రష్టులైరి. ఒకనాడు పెద్ద కుమారుడు వేశ్యతో
ఉద్యానవనములో విహరించుచుండగా కర్మవశాత్తు త్రాచుపాము కరచుటచే నోటివెంట
నురుగలు గ్రక్కుచూ చనిపోయినాడు, ఆ విధముగా హేమాంబరుని కుమారులిద్దరూ చనిపోయినారు. యమదూతలు వచ్చి వారిద్దరినీ
యమలోకమునకు తీసుకొని వెళ్ళిరి. చిత్రగుప్తుడు వారి జాబితాలను చూసి, పెద్దవానిని నరకంలో పడవేయమన్నాడు.
రెండవవానిని స్వర్గమునకు పంపించమన్నాడు. అప్పుడు చిత్రగుప్తునితో యిలా అన్నాడు. “అయ్యా! మేమిద్దరమూ ఒకేతండ్రి బిడ్డలము. ఇద్దరమూ ఒక
విధముగానే పాపములు చేసియున్నాము. అయినా అతనికి నరకమును, నాకు స్వర్గమును యేల ప్రాప్తించును” అని అడిగెను. ఆ మాటలకు చిత్రగుప్తుడు ” ఓయీ
వైశ్యపుత్రా! నీవు నీ వేశ్యను కలుసుకొనుటకు ప్రతిదినము యామెతో సంగమించి గంగానదిని దాటి అవతల గట్టున నీ మిత్రుని యింటికి
వెళ్ళి వచ్చుచుండెడివాడవు. అటులనే మాఘమాసములో కూడా నదిని దాటుతుండగా కెరటాలజల్లులు నీశిరస్సుపై పడినవి. అందు వలన నీవు పవిత్రుడవైనావు మరొక విష్యమేమనగా నీ మిత్రుడు బ్రాహ్మణుడు, ప్రతి నిత్యము బ్రాహ్మణ దర్శనము చేసినచో గోహత్యాది మహాపాపములు కూడ నశించును.
కాన విప్రుని చూచుటవలన నీకు మంచిఫలితమే కలిగినది. అదియ్తునుకాక ఆ బ్రాహ్మణుడు జపించు గాయత్రీ మంత్రమును కూడా నీవు వినియున్నావు. గంగానదిలోని నీరు నీ శరీరము మీదపడినది. గనుక నీ పాపములు నశించినందున నిన్ను స్వర్గానికి పంపుచున్నాను” అని చిత్రగుప్తుడు వివరించెను. ఆహా! ఏమి నా
భాగ్యము గంగాజలము నా మీద పడినంత మాత్రమునే నాకింతటి మోక్షము కలిగినదా” అని వైశ్యకుమారుడు సంతసించి, దేవదూతలతో స్వర్గలోకమునకు వెళ్ళిపోయెను
శ్రీ మధ్వ నవమి —> click this link.
మాఘ పురాణం – 9వ అధ్యాయము – గంగాజల మహిమ
ఓ కార్తవీర్యార్జునా! శివపూజ గురించి శివమహత్మ్యమును గురించి వివరించెదను వినుము. మున్ను శ్రీరామచంద్రుడు రావణుని చంపుటకు సముద్రముపై వారధి కట్టినచోట
శివలింగమును ప్రతిష్టించి శివుని ధ్యానించి, వారధిదాటి రావణుని చంపెను. అటులనే హనుమంతుడూ సముద్రమును దాటునపుడు శివుని ధ్యానించి రామునికి నమస్కరించి, మహా బలమును సంపాదించి సముద్రమునుదాటెను. అర్జునుడు యుద్ధమునకు బయలుదేరే ముందు శివపూజ చేసియే
యుద్ధరంగములో ప్రవేశించును. మరెందరో మహానుభావులు శివుని ధ్యానించి జయము చేకూర్చుకొనిరి.
స్త్రీలు తమ మనోవాంచలను తీర్చుకొనిరి. కనుక, పూజదు శివపూజ పవిత్రమైనది. అటులనే నదులలో గంగానది పరమపవిత్రమైనది. ఎటులనగా, గంగాజలము విష్ణుపాదములనుండి పుట్టినదియు, శివుని శిరస్సునుండి ప్రవహించునట్టిదయు అయినందుననే సర్వపాపహరమైనది. గంగా జలములో స్నానమునకు అంత ప్రాముఖ్యత ఉన్నది. ఇంకనూ గంగాజలము గురించి చెప్పబోవునది ఏమనగా యే నీళ్ళనుగాని, “గంగ గంగ గంగ” అని మూడు పర్యాయములు అనుకొని శిరస్సున చల్లుకొనినచో ఆ
నీళ్ళు గంగాజలముతో సమానమయినవగును. గంగాజ్లము విష్ణుమూర్తి ప్రతి రూపము కనుక, మాఘమాసములో అంగాస్నానము అత్యంత పుణ్యప్రదమని తెలుపుచూ గంగా జల మహత్మ్యము గురించి కార్తవీర్యార్జు నకు దత్తాత్రేయుదు వివరించెను.
కొంత కాలము క్రిందట మగధరాజ్యములో పురోహితవృత్తిచే జీవించుచున్న నలుగురు బ్రాహ్మణులుండిరి. నలుగురికి నలుగురు కుమార్తెలుండిరి.
వారు నిండు యవ్వనవతులై ఉండీరి. కొన్నాళ్ళకు ఆ గ్రామపు కోనేటిలో స్నానం చేయుటకు ఒక గురుకుల విద్యార్థి వచ్చెను, బ్రాహ్మణ
కన్యలాయువకుని అందము చూచి, మోహించి, అతనిని సమీపించి చుట్టుముట్టి మమ్ములను వివాహం చేసుకోమని
బలవంతము చేయగా ఆ బ్రాహ్మణ విధ్యార్థికి విద్య పూర్తి కానందున వారి కోర్కెలను నిరాకరించెను. అంత ఆ కన్యలు కోపంతో నీవు పిశాచానివి కమ్మని శపించగా, ఆ విధ్యార్థియూ, మీరుకూడ పిశచులగుదురుగాక అని ప్రతి శాపమిచ్చుటచే వారంతా పిశాచ రూపములతో ఆ కొలను వద్దనే వుండి, అందరిని బాదించి, ఆహారము దొరికితే వాటాలకై పెనుగులాడుకొనుచుండిరి. కొంతకాలమునకు ఒక సిద్దుడాకోనేటి దగ్గరకురాగా నా పిశాచముల తల్లి దండ్రులు, తమ బిడ్డలకు కలిగిన పిశాచ రూపములెట్లు పోవునని అడిగిరి. ఆ సిద్దుడు వారందరిచేత మాఘమాసములో గయలోనున్న త్రివేణిలో స్నానము చేయించినచో వారికున్న పిశాచ రూపములు తొలగిపోవునని చెప్పగావారట్లు చేయుటచే అయిదుగురికి యధా రూపములు కలిగినవి. ఇట్లు జరుగుటకు మాఘమాసమహత్మ్యమే కారణము.
మాఘమాస మందలి నదీ స్నానము మనుజులకే కాక దేవతలకు, గంధర్వులకు కూడ పవిత్రమైనది. ఓక మాఘమాసములో నొకగంధర్వుడు తన భార్యతో భూలోకానికి వచ్చి గంగానదిలో స్నానమాడెను. అతని భార్య మాత్రము స్నానమాచరింనని చెప్పుటచే ఆమెకు దైవత్వము నసించి గంధర్వలోకానికి వెళ్ళలేకపోయినది. ఆమెను విడిచి పెట్టి ఆ గంధర్వుడొకడే వెళ్ళిపోయాడు. ఆమె అడవిలో తిరుగుచూ విస్వామిత్రుడు ఉన్నచోటుకు వెళ్ళి వయ్యారముగా క్రీగంటచూసెను. ఆమె అందానికి, యవ్వనానికి విస్వామిత్రుడు తన్మయుడై ఆమెను ప్రేమించుటచే యిద్దరూ కామక్రీడలలో తెలియాడుచుండగా, మరల ఆ గంధర్వుడు తన భార్యను వెదుకుచూ వచ్చి చూడగా, విస్వామిత్రుడు గంధర్వస్త్రీ క్రీదించుచుందిరి. ఆ దృస్యమును చూచి మందిపడుచు తపస్వివై యుండి కూడా యిలా కామతృష్ణ కలవాడవైనందున, నీకు కోతి ముఖము కలుగుగాకయని విస్వామిత్రుని, పాషాణమై పడియుండమని భార్యను శపించి వెళ్ళిపోయినాడు.
విస్వామిత్రుడు చేయునది లేక వానర ముఖం కలిగియుండగా నారదుడు ఆ విషయము తెలుసుకొని విశ్వామిత్రుని కడకు వచ్చి, ” విశ్వామిత్రా! క్షణభంగురమైన తుచ్ఛకామ వాంఛకులోనై నీ తపశ్శక్తినంతా వదులుకున్నావు. సరేలెమ్ము గంగానదిలో స్నానము చేసి, నీ కమండలములో గంగా జలము తెచ్చి ఈ పాషాణముపై చల్లుము”, అని వివరించగా విశ్వామిత్రుడు గంగాస్నానముచేసి, విష్ణువును ధ్యానించి, కమండలముతో నీరు తెచ్చి, పాషాణముపై చల్లగా ఆ రాయి పూర్వం గంధర్వ శ్త్రీ రూపమును పొంది, గంధర్వలోకమునకు వెళ్ళిపోయెను. పూర్వరూపము నందిన విస్వామిత్రుడు తపస్సునకు వెళ్ళిపోయెను.
మాఘ పురాణం -10 వ అధ్యాయం మృగశృంగుని వివాహము
మాఘ పురాణం -10 వ అధ్యాయం దిలీప మహీజునకు వశిష్ఠువారు ఇట్లు చెప్పసాగిరి –
పువ్వు వికసించగానే వాసన వేయును. అది ఒకరు నేర్పవలసిన అవసరము లేదు. అది ప్రకృతినైజము. ఆవిధముగానే మృగశృంగుడు బాల్యదశ నుండియే హరినామ స్మరణయందాసక్తి గలవాడయ్యెను.
అతనికి ఐదు సంవత్సరములు నిండిన తరువాత గురుకులములో చదువ వేసిరి. అచట సకల శాస్త్రములు అతిశ్రద్ధగా నేర్చుకొనుచు, అధ్యాపకుల మన్ననల నొందుచు పాండిత్యము సంపాదించెను. విద్యలు పూర్తయిన తర్వాత తల్లిదండ్రుల యానతిపై దేశాటన చేసి యనేక పుణ్యనదులలో స్నానమాచరించి మాఘమాస పలము సంపాదించియుండెను.
కుమారుడు దేశాటన పూర్తిచేసి వచ్చిన తరువాత అతని తల్లిదండ్రులు కన్యను చూచి వివాహం చేయుటకు నిశ్చయించినారు. మృగశృంగుడు తానూ వరించిన సుశీలను మాత్రమె వివాహం చేసుకొనెదనని తన మనో నిశ్చయమును తల్లిదండ్రులకు తెలుపగా కుమారుని ఇష్టప్రకారంగా ఒక మంచి ముహూర్తమున మృగశృంగునకు సుశీలకు అతివైభవంగా వివాహం చేసిరి.
సుశీల స్నేహితురాండ్రగు మిగిలిన ఇద్దరూ మృగశృంగుని చూచి “ఆర్యా! మా స్నేహితురాలగు సుశీలను పెండ్లి చేసుకొనినట్లే మా ఇద్దరినీ కూడా యీ శుభలగ్నమున పరిణయమాడుము” అని పలికిరి. మృగశృంగుడు ఆశ్చర్యపడి అసంభవం. అది ఎట్లు జరుగును?” అని ప్రశ్నించగా – “మా సుశీలను పెండ్లాడినట్లే మమ్ము కూడా పెండ్లాడుమని ఆడబడుచులు పట్టుబట్టినారు.
మరి పురుషునకు ఒక్క భార్యయేకదా! ఇద్దరు భార్యలా?” అని మృగశృంగుడు ప్రశ్నించగా –
ఇద్దరు ముగ్గురు యువతులను పురుషుడు వివాహము చేసుకొనుటకు శాస్త్రములు అంగీకరించుచున్నవి కదా! దశరధునకు ముగ్గురు భార్యలు, శ్రీకృష్ణునకు ఎనమండుగురు భార్యలు, పరమేశ్వరునకు గంగా, గౌరీ ఇద్దరు గడ! వారికి లేని అభ్యంతరములు నీకు కలవా అని ఆ కన్యలు ప్రశ్నించి చుట్టుముట్టిరి. మృగశృంగుడు ఏమీ జవాబు చెప్పలేకపోయాడు.
వివాహపు వేడుకలను చూడ వచ్చిన అనేకమంది మునీశ్వరులు కూడా మృగశృంగా “అభ్యంతరము తెలుపవలదు. ఆ యిరువురి కన్యల యభీష్టము నెరవేర్చుము. వారు దుఃఖించిన నీకు జయము కలుగదు. అయిననూ ఇటువంటి ఘటనలు మున్ను అనేకములు జరిగియున్నవి” అని పలికిరి. పెద్దలందరి అభిమతము ప్రకారము మృగశృంగుడు ఆయిరువురు కన్యలను కూడా వివాహము చేసుకున్నాడు.
ఈ విధంగా మృగశృంగుని వృత్తాంతము దిలీపునకు వివరింపగా “మహర్షీ! వివాహములు ఎన్ని విధములు? వాటి వివరములు తెలియజేసి నన్ను సంత్రుప్తుని చేయుడు” అని ప్రార్థించగా వశిష్ఠుల వారు మరల ఇట్లు చెప్పసాగిరి. “రాజా! వివాహములెన్ని విధములో వాటి వివరములు చెప్పెదను. సావదానుడై ఆలకింపుము”
- బ్రాహ్మణ కన్యను బాగుగా శృంగారించి వరుని పిలిపించి చేయు వివాహమునకు “బ్రాహ్మము” అని పేరు.
- దైవము: యజ్ఞము చేయు వానికి యజ్ఞము చేయుటకు వధువును ఇచ్చి చేయు పెండ్లికి “దైవము” అని పేరు.
- ఆర్షము: పెండ్లికుమారుని నుండి రెండు గోవులను పుచ్చుకొని అతనికి పెండ్లి కూతురునిచ్చి పెండ్లి చేయు దానిని “ఆర్షము” అని అందురు.
- ప్రాజాపత్యము: ధర్మము కోసం దంపతులు కట్టుబడియుండుడని దీవించి చేయు వివాహమునకు ‘ప్రాజాపత్యము’ అని పేరు.
- అసురము: డబ్బు పుచ్చుకొని కన్యను యిచ్చి వివాహం చేయడానికి ‘అసుర’ అని పేరు.
- గాధర్వము: ఒకరినొకరు ప్రేమించుకొని వారంతట వారు చేసుకొను వివాహమును ‘గాంధర్వ’ వివాహమని పేరు.
- రాక్షసము: వరుడు కన్యను బలాత్కారం చేసి వివాహమాడు దానిని ‘రాక్షస’ వివాహమని పేరు.
- పైశాచిక: మోసగించి అనగా మాయమాటలచే నమ్మించి పెండ్లి చేసుకోను దానిని “పైశాచిక’ మని పేరు.
ఈ ఎనిమిది రకములూ వివాహ సంబంధమైన పేర్లు. గాన వాటి ధర్మములు తెలియపర్చెదను ఆలకింపుడు.
గృహస్థాశ్రమ లక్షణములు
మంచి నడవడికతో ఇహమూ, పరమూ సాధించవలయునన్న యీ గృహస్థాశ్రమ మొక్కటియే సరియైన మార్గము.
భార్యయు, భర్తయు అనుకూలంగా నడచుకోనుత, ఉన్నంతలో తృప్తిచెందుట, దైవభక్తితో నడచుకొనుట అతిథి సత్కారములాచారించుట, మొదలగు సద్గుణములతో నడచుకొనే వాడే సరియైన గృహస్తుడనబడును. నోములు నోచుట, వ్రతములు చేయుట, పర్వదినములలో ఉపవాసములుండి కార్తికమాసమందునా, మాఘమాస మందునా నదీస్నానం చేసి, కడు నిష్ఠతో శివకేశవులను స్మరించుట మొదలగు కార్యములాచరించుట వారికి మంచి తేజస్సు కలుగును.
ప్రాతః కాలమున నిద్రనుంచి లేచినప్పుడు భగవంతుని స్మరించుకొని లేచి, కాలకృత్యములు తీర్చుకొని స్నానం చేసి నిష్ఠతో భగవంతుని పూజించవలయును. కార్తిక మాసమందు, మాఘ మాసమందు, వైశాఖ మాసమందు తన శక్తి కొలదీ దానధర్మములు చేసినచో గొప్ప ఫలం కలుగును. గాన ప్రతి మనుజుడూ ఇహ సుఖములకే కాక పరలోకమును గురించి కూడా ఆలోచించవలయును.
పతివ్రతా లక్షణములు
పురుషుడు తనకు సద్గతి కలిగే నిమిత్తమనేక ఘనకార్యములు చేసిన కాని మంచి ఫలము పొందలేక పోవుచున్నాడు. అటులనే ప్రతి స్త్రీ తన భర్తను దైవంగా భావించి మనసారా ఆరాధించవలెను. తన భర్త యొక్క మంచి గుణములనే స్వీకరించవలయును గాని, అందాన్ని ఆకారాన్ని చూచి మోసపోకూడదు. అటులనే పురుషులునూ స్త్రీయొక్క అందమునే చూడక, శీలము, గుణమును లెక్కించి ప్రేమతో ఆదరించవలెను. ఆవిధముగా స్త్రీ పురుషులిద్దరూ అన్యోన్యానురాగముతో కాపురము చేసిన యెడల ఆ సంసారము ఎంతో బాగుండును. ఉత్తమ స్త్రీ తన భర్తను ఏవిధంగా ప్రేమతో సేవిన్చునో ఆ విధంగానే అత్తమాలల సేవ, అతితిసేవలయందు కూడా తగు భక్తిశ్రద్ధలతో చేసినయెడల అట్టి స్త్రీకి సద్గతి కలుగును.
భార్య తన భర్త ఆలోచనయందు మంత్రివలె సలహాలివ్వవలయును. పనిపాటల యందు సేవకురాలి వలె నడుచుకొనవలయును. భోజనం వద్దిన్చునప్పుడు తల్లి తన కుమారునకు ఎంత ఆప్యాయంగా భోజనం పెట్టులో ఆవిధంగా భర్తకు భోజనం వడ్డించవలెను. శయన మందిరమున వేశ్యవలె భర్తకు ఆనందం కలుగజేయవలయును. రూపంలో లక్ష్మిని బోలియుండవలెను. ఓర్పు వహించుటలో భూదేవిని బోలియుండవలెను. ఈవిధంగా ఏ స్త్రీ నడచుకొనునో ఆమెయే ఉత్తమ స్త్రీ అనబడును.
స్త్రీ బహిష్టు అయిన నాలుగు దినములు ఏ పనిని చేయరాదు. అతిగా మాటలాడ కూడదు. ఎవరినీ ముట్టుకొన రాదు. అ నాలుగు రోజులు విశ్రాంతి తీసుకొనవలెను. నాలుగవ రోజున సూర్యోదయము కాకుండా తలంటి నీళ్ళు పోసుకొని శుభ్రమైన ఉడుపులు ధరించి భర్త పాదములకు నమస్కరించి సూర్య భగవానునకు నమస్కరించి తర్వాత తమ ఇష్ట దేవతలను పూజించవలయును. ఎటువంటి సమయమునందైననూ భర్త భుజించకుండా తాను భుజించకూడదు.
ఇటువంటి లక్షణములు కలిగివున్న ఆ ముగ్గురు కన్యలను మృగశృంగుడు పెండ్లాడి ఆనందంతో కాలం గడుపుచుండెను. గృహస్థాశ్రమమును ఆదరించుచుండెను.
మృకండుని జననము:
ఉత్తమ లక్షణములు గల స్త్రీలను పెండ్లియాడితిగదా యని మృగశృంగుడు మిగుల ఆనందించెను. ఆ ముగ్గురు పడతులతోను సంసారము చేయుచుండెను. అటుల కొంతకాలం జరిగినది. సుశీల యను భార్య గర్భం ధరించి ఒక శుభలగ్నమున కుమారుని కనెను. తన కన్న తన కుమారుడు అన్ని విద్యలయందు గొప్ప ప్రవీణుడు కావలయునని ఆశ కలవాడై జాతకర్మలు జరిపించి కుమారునికి “మృకండు”డని నామకరణం చేశారు. మృకండుడు దినదిన ప్రవర్థమానుడై తల్లిదండ్రుల యెడ, బంధుజనుల యెడ, పెద్దలయెడ, భయభక్తులు గలిగి పెరుగుచుండెను. ఐదేళ్ళు నిండినవి. మృగశృంగుడు మృకండునకు ఉపనయనం చేసి విద్యనభ్యసించుటకై గురుకులమునకు పంపించినాడు. గురుకులంలో గురువు చెప్పిన సకల శాస్త్రములు నేర్చుకొనుచు సకల లక్షణయుతుడై గురువుయొక్క మన్ననలు పొందుచు, యుక్త వయస్సు వచ్చువరకు చదివి సకల శాస్త్రములయందు ప్రావీణ్యతను సంపాదించెను. మృకండుడు విద్యనూ పూర్తి చేసుకొని తల్లిదండ్రుల కడకు వచ్చెను. మరికొంత కాలమునకు ‘మరుద్వతి’యను కన్యతో వివాహం చేసిరి. ఆనాటినుండీ మృకండుడు గృహస్థాశ్రమము స్వీకరించెను.
మృగశృంగుని మిగిలిన ఇద్దరు భార్యలకు కూడా పుత్రులు జన్మించినందున వారికి కూడా అన్ని విద్యలు నేర్పిరి. పెద్దవారలయిన తరువాత వివాహములు చేసెను. తన కుటుంబమంతయును మాఘమాసంలో స్నానములు, జపములు, దానధర్మములు మరింత నిష్ఠతో జరుపవలసినదిగా ప్రోత్సహించెడివాడు. తామార్జించుకున్న మాఘమాస ఫల ప్రభావంచే సంసారమునండు ఏ ఇబ్బందియు లేకుండా వుండుటే గాక మృగశృంగునకు మనుమలు కూడా కలిగినందున మరింత యానందించి తన వంశ వృక్షం శాఖోపశాఖలగుచున్నది గదాయని సంతోషించుచు తనకింక ఏ ఆశలూ లేనందున భగవస్సాన్నిధ్యంనకు బోవలయునని సంకల్పించి, తపస్సు చేసుకొనుటకు అడవికి వెళ్ళి తన తపోబలముతో శ్రీ మహావిష్ణువును ప్రసన్నుని చేసికొని, నారాయణుని కృపకు పాత్రుడై వైకుంఠమునకేగెను. “విన్నావు కదా భూపాలా! మృగ శృంగుడు తాను చేసుకున్న మాఘమాస ఫలము వలన తనకు పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుటయే గాక బొందితో శ్రీమన్నారాయణుని వెంట వైకుంఠానికి వెళ్ళినాడు. ఇక అతని జ్యేష్ట కుమారుడైన మృకండుని యొక్క వృత్తాంతమును చెప్పెదను ఆలకింపుము” అని వశిష్ఠుల వారు దిలీప మహారాజునకు ఇట్లు వివరించినారు.
మృగశృంగుడు అడవికి వెళ్ళిపోయిన నాటినుండి జ్యేష్టపుత్రుడగు మృకండుడే సంసార భారమంతయు మోసి, గృహమునందు ఏ అశాంతియు లేకుండా చూచుచుండెను. ఆయనకొక విచారం పీడించుచుండెను. అదెట్టిదనగా తాను వివాహమాడి చాలాకాలం గడిచిననూ సంతానం కలుగలేదు. అందుచేత అతడు లోలోన కుమిలిపోవుచుండెను. అతడొకనాడు ఈవిధముగా తలపోసెను – “కాశీ మహాపుణ్యక్షేత్రము. సాంబశివునకు ప్రత్యక్ష నిలయము. అటువంటి వారణాసిని చూచినంత మాత్రమున సకల పాపములు హరించుటయే గాక మనస్సునందు కోరికలు నెరవేరును. అనేకమంది కాశీ విశ్వనాథుని దర్శనము చేసుకొని వారి యభీష్టములను పొందగలిగిరి. గాన నేను నా కుటుంబ సమేతముగా వెళ్ళుదును.” అని మనసున నిశ్చయించుకొని ప్రయాణ సన్నద్ధుడై బయలుదేరెను.
మార్గమధ్యమున అనేక కౄరమృగముల బారినుండి క్రిమికీటకాల ప్రమాదమునుండి అతికష్టము మీద తప్పించుకొని కుటుంబ సహితముగా కాశీ క్షేత్రము వెళ్ళాడు. కాశీ పట్టణమునానుకొని పవిత్ర గంగానది తన విశాల బాహువులను చాచి ప్రశాంతముగా ప్రవహించుచున్నది. మృకండుడు పరివార సహితముగా ప్రసిద్ధి చెందినా మణికర్ణికా ఘట్టమున కాలకృత్యాది స్నాన విధులు నెరవేర్చుకొని విశ్వనాథుని మందిరమునకు బయలుదేరి వెళ్ళెను. ఆలయంలోనికి రాగానే మృకండునకు ఎక్కడలేని ఆనందం కలిగెను. తన జన్మ తరించెనని తానూ కైలాసమందున్నట్లు తలంచి విశ్వేశ్వరుని భక్తి శ్రద్ధలతో ప్రార్థించెను.
ఈవిధంగా కుటుంబ సమేతముగా మృకండుడు కాశీవిశ్వేశ్వరుని ధ్యానించి ఒక లింగమును ప్రతిష్ఠించి దానికి మృకండేశ్వర మహాలింగమని నామకరణం చేసి దాని కెదురుగా తన భార్య పేర మరొక లింగమును ప్రతిష్టించెను. ఆవిధంగా ఒక సంవత్సరమునకు విశ్వేశ్వరుని సన్నిధానమందు గడపనెంచెను. ఒక దినమున మృకండుని మువ్వురు తల్లులు పవిత్ర గంగానదిలో స్నానమాచరించి విశ్వేశ్వరుని పూజించుచుండగా వెంటనే తెలివి తప్పి ప్రాణములు విడచిరి. మృకండుడు చాలా కాలము దుఃఖించెను. విధిని ఎవ్వరూ తప్పించలేరు గదా! అయినా ఈశ్వరుని ధ్యానించుచు ప్రాణములను విడచిరి. చనిపోయిన ముగ్గురు తల్లులకు మృకండుడు యధావిధిగా దహన సంస్కారములు గావించి మాతృ ఋణమును తీర్చుకున్నాడు. మృకండునకు ఎంతకాలమునకునూ సంతానం కలుగనందున కాశీక్షేత్రమునకు వచ్చినాడు గదా! సంతానం కొరకు భార్యా సమేతుడై విశ్వనాథుని గూర్చి తపస్సు చేసినాడు. అనేక దానధర్మములు చేసినాడు. అతని తపస్సుకు మెచ్చి పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమైరి. మృకండునకు అతని భార్య మరుద్వతికి అమితానందం కలిగి పరమేశ్వరుని అనేక విధముల స్తుతించగా పరమేశ్వరుడిట్లు పలికెను.
“మహామునీ! మీ భక్తికి ఎంతయో సంతసించినారము. మీరు చేయు తపస్సు మమ్మెంతో ఆకర్షించినది. మీ నిష్కళంక భక్తికి మెచ్చి మీ కోర్కెలను దీర్చగా వచ్చినారము. గాన మీ యభీష్టము నెరింగింపుడు” అని పలికెను. అంత మృకండుడు నమస్కరించి “మహాదేవా! తల్లీ అన్నపూర్ణా! ఇదె మా నమస్కృతులు. లోకరక్షకా! మీ దయవలన నాకు సలక్షణవతి, సౌందర్య సుకుమారవతియగు పత్ని లభించినందువలన నేను మిమ్ము ధ్యానించుచు ఆమెతో సంసార సుఖం అనుభవించుచున్నాను. కానే ఎంతకాలమైననూ మాకు సంతానం కలుగనందున క్రుంగి కృశించుచున్నాము. సంతానం లేని వారికి ఉత్తమ గతులు లేవు గదా! కావున మాకు పుత్రసంతానం ప్రసాదించ వేడికొనుచున్నాను” అని పార్వతీ పరమేశ్వరులను ప్రార్థించాడు.
మృకండుని దీనాపములాలకించి త్రినేత్రుడిట్లు పలికెను. “మునిసత్తమా! నీ మనోభీష్టము నెరవేరగలదు. కాని ఒక్క నియమమున్నది. బ్రతికి యున్నంతవరకు వైధవ్యముతో వుండు పుత్రిక కావలయునా” లేక అల్పాయుష్కుడగు పుత్రుడు కావలయునా”” అని ప్రశ్నించిరి. మృకండునకు ఆశ్చర్యము కలిగెను. పరమశివుని మాటలకు ఆలోచనలో పడవలసి వచ్చెను. కొంత తడవాగి హే శశిధరా! నన్ను పరీక్షింప నెంచితివా? నాకు జ్ఞానోదయ మయినది మొదలు నేటి వరకు మీ ధ్యానమునే సలుపుచు, సేవించుచున్న నాకు ఏమి చెప్పవలయునో తోచకున్నది. అయినను కలకాలము వైధవ్యముతో కృంగి కృశించే పుత్రికకన్నా అల్పాయుష్కుడగు పుత్రరత్నమునే ప్రసాదింపుడు” అని నుడివెను.
“అటులనే యగుగాక” యని త్రిశూలధారి వరమిచ్చి పార్వతీ సమేతంగా అంతర్ధానమయ్యెను. పరమేశ్వరానుగ్రాహమున ఒక శుభముహూర్త కాలమున పుత్రుని గనెను. మృకండునకు పుత్రసంతానము కలిగెనని అనేకమంది ఋషిసత్తములు బాలుని చూడవచ్చిరి. వ్యాసమహర్షి కూడా వచ్చి ఆ బిడ్డకు జాతకర్మ జేసి, మార్కండేయుడని నామకరణం చేసి వెడలెను. ఓ దిలీప మహారాజా! పరమ పూజ్యుడును భాగవతోత్తముడును, అగు మృకండుడు పరమేశ్వరుని మెప్పించి, వారి దయకు పాత్రుడయి సుపుత్రుని బడసెను.
మాఘ పురాణం – 11 వ భాగం
మార్కండేయుని వృత్తాంతము
వశిష్ఠుడుల వారు దిలీపునకు మృగశృంగుని వివాహం, మృకండు జననం, కాశీవిశ్వనాథుని దర్శనం, విశ్వనాధుని వరము వలన మార్కండేయుని బడయుట మొదలగు వృత్తాంతమును వివరించి –
మహారాజా! ఇక మార్కండేయుని గురించి వివరింతును. శ్రద్ధగా ఆలకింపుము అని వశిష్ఠుల వారు ఈవిధంగా చెప్పదొడగిరి. మార్కండేయుని ఆయువు పదహారు సంవత్సరములు మాత్రమే. రోజులు గడుచుచున్న కొలది తల్లిదండ్రులకు దిగులు ఎక్కువగుచుండెను. అయిదేళ్ళు నిండగానే కుమారునికి ఉపనయనాది వైదిక కర్మలన్నీ పూర్తిచేసిరి. ఆరవయేడు దాటగానే మార్కండేయుని చదివించుట ప్రారంభించిరి. అతడు తన తండ్రివలెనే అచిరకాలములోనే సకల శాస్త్రములు, వేదాంత, పురాణ, ఇతిహాసములు, స్మృతులు పఠించి గుణవంతుడని ప్రశంసలనందెను. “కుమారా! నీవు పసితనమందే సకల శాస్త్రములు అభ్యసించి నీ బుద్ధి కుశలతచే అందరి మన్ననలను పొందుచున్నావు. అందులకు మేమెంతయో ఆనందించుచున్నాము. అయినను, గురువులయెడ పెద్దలయెడ బ్రాహ్మణులయెడ మరింత భక్తిభావంతో మెలగవలయును. వారి ఆశీస్సులు నీకు మంగళకరమగును. గాన నీవట్లు చేసినచో నీ ఆయుర్దాయము వృద్ధియగును” అని చెప్పిరి. అటుల పదిహేను సంవత్సరములు గడిచిపొయినది. రోజురోజుకి తల్లిదండ్రుల ఆందోళన, భయం ఎక్కువగుచున్నవి. పరమశివుని వరప్రసాదుడగు మార్కండేయుని జన్మదినోత్సవము చేయవలెననీ తలచి మహాఋషులందరకు ఆహ్వానములు పంపించినారు. మునీశ్వరులు గురువర్యులు మొదలగు వారందరూ మృకండుని ఆశ్రమానికి వచ్చిరి. అందుకు మృకండుడానందమొంది అతిథి సత్కారములు జేసెను. మార్కండేయుడు వచ్చిన పెద్దలందరకు నమస్కరించాడు. అటులనే వశిష్ఠునకు నమస్కరించగా, అతడు మార్కండేయుని వారించెను. అటుల చేసినందులకు అందరూ ఆశ్చర్యపడి “మహానుభావా! మీరట్లు వారించుటకు కారణమేమి?” అని ప్రశ్నించారు.
అంత వశిష్ఠుల వారు “ఈ బాలుడు కొద్ది దినములలో మరణించగలడు. మీరందరూ ఈతనిని “దీర్ఘాయుష్మంతుడవు కమ్ము” అని దీవించితిరి గదా! అదెటుల అగును? ఈతని ఆయుర్దాయము పదహారేండ్లే కదా! ఇప్పుడు పదిహేనవ జన్మదినోత్సవము జరుపుతున్నారు. పరమేశ్వరుడిచ్చిన వరము ప్రకారము యీతడు ఒక్క సంవత్సరమే జీవించును” అని నుడివిరి. అంతవరకూ మార్కండేయుని దీవించిన మునీశ్వరులందరూ చాల విచారించిరి. “చిరంజీవివై వర్ధిల్లు”మణి దీవించినందున వారి వాక్కు అమంగళమగునని బాధపడి “దీనికి మార్గాన్తరము లేదా? యని వశిష్ఠుల వారినే ప్రశ్నించారు. వశిష్ఠుడు కొంతసేపు ఆలోచించి “మునిసత్తములారా! వినుడు. మనమందరము యీ మార్కండేయుని వెంటబెట్టుకొని బ్రహదేవుని వద్దకు పోవుదము.రండి” అని పలికి తమవెంట ఆ మార్కండేయుని తోడ్కొని పోయిరి.
మునీశ్వరుల ఆగమనమునకు బ్రహ్మ సంతసించెను. మునులందరితో పాటు మార్కండేయుడు కూడా బ్రహ్మకు నమస్కరించగా బ్రహ్మ “చిరంజీవిగా జీవించు నాయనా”యని దీవించెను. అప్పుడు వశిష్ఠ మహర్షి మార్కండేయుని జన్మ వృత్తాంతమును బ్రహ్మకు వివరించెను. బ్రహ్మ కూడా జరిగిన పొరపాటుకు విచారం వెలిబుచ్చి కొంత తడవాగి “భయపడకు” అని మార్కండేయుని దగ్గరకు జేరదీసి “పరమేశ్వరుడు ఈ బాలుని దీర్ఘాయుష్మంతునిగా జేయును గాక”యని తన మనస్సులో శివుని ధ్యానించెను. అంతట మునులవంక జూచి ఓ మునులారా! మీరు పోయిరండు. ఈతనికి ఏ ప్రమాదమూ జరుగనేరదు.అని పలికి, వత్సా! మార్కండేయా! నీవు కాశీక్షేత్రమునకు పోయి విశ్వనాథుని సదా విశ్వనాథుని సేవించుచుండుము. నీకేయాపదకలుగదు. గాన నీవట్లు చేయుము.
మార్కండేయుడు గృహమునకు వచ్చి తల్లిదండ్రులకు నమస్కరించి కాశీవిశ్వనాథుని సేవించి వచ్చెదను. అనుజ్ఞ నిమ్మని కోరగా మృకండుడు అతని భార్యయు కొడుకుయొక్క ఎడబాటునకు కడుంగడు దుఃఖించిరి. ఎట్టకేలకు మార్కండేయుని దీక్షను కాదనలేక కుమారుని విడిచిపెట్టి యుండలేక అందరూ కాశీక్షేత్రమునకు బయలుదేరిరి.
కుటుంబ సహితంగా కాశీకిపోయి మృకండుడు కాశీవిశ్వేశ్వరాలయ సమీపమందొక ఆశ్రమం నిర్మించెను. మార్కండేయుడు సదా శివధ్యానపరులై రాత్రింబవళ్ళు శివలింగముగడనే యుండెను. పదహారవయేడు ప్రవేశించెను. మరణ సమయమాసన్నమైనది. యముడు తన భటులతో “మార్కండేయుని ప్రాణములు గొని తెమ్మని ఆజ్ఞాపించెను. యమభటులు మార్కండేయుని ప్రాణములు గొనిపోవుటకు శివసన్నిధిని ధ్యానము జేసుకొనుచున్న మార్కండేయుని కడకు వచ్చుసరికి భటులు ఆ సమీపమందు నిలువలేకపోయిరి. కాలపాశము విసరుటకు చేతులు ఎత్తలేకపోయారు. మార్కండేయుని చుట్టూ మహా తేజస్సు ఆవరించినది. ఆ తేజస్సు యమభటులపై అగ్నికణముల వలె బాధించెను. ఆ బాధకోర్వలేక భటులు పోయి జరిగిన వృత్తాంతమును యమునా కెరిగించగా యముడాశ్చర్యపడి తానే స్వయముగా మార్కండేయునిపై కాలపాశము విసరెను. మార్కండేయుడు కన్నులు తెరచి చూచుసరికి యముడు తన ప్రాణమును తీసుకుపోవ సిద్ధముగా నుండగా మార్కండేయుడు భయపడి శివలింగమును కౌగలించుకొని ధ్యానించు సరికి కైలాసవాసుడగు పార్వతీపతి తన భక్తుని ఆక్రందన వినిపించుసరికి మహా రౌద్రాకారముతో శివలింగమును చీల్చుకొని వచ్చి త్రిశూలముతో యముని సంవారించి మార్కండేయుని రక్షించెను.
యముడు చనిపోవుటకు అష్టదిక్పాలకురు బ్రహ్మాది దేవతలు వచ్చి శివుననేక విధముల ప్రార్థించి జటాధారి కోపమును చల్లార్చి మహేశా! యముడు తన కర్తవ్యమును నెరవేర్చినాడు. తన వరప్రసాదుడగు మార్కండేయునికి పదహారేండ్లు మాత్రమే ఆయువునిచ్చితిరి గదా! అతనిని ఆయువునిండిన వెనుకనే యముడు ప్రాణములు తీయుటకు వచ్చెను. మార్కండేయుని చిరంజీవిగా జేసితిరి. అందులకు మేము ఎంతయో ఆనందించుచున్నారము. గాని ధర్మ పాలన నిమిత్తం యముడు లేకుండుట లోటుకదా! గాన మరల యముని బ్రతికించుడని ఇంద్రుడు వేడుకొనెను. అంత ఈశ్వరుడు యముని బ్రతికించి “యమా! నీవు నా భక్తుల దరికి రావలదుసుమా!” అని పలికి అంతర్ధానమయ్యెను.
పరమశివుని దయవలన తన కుమారుడు దీర్ఘాయుష్మంతుడయినందులకు మృకండుడు మిక్కిలి సంతసించి తానూ చేసిన మాఘ మాస ఫలమే తన కుమారుని కాపాడినదని మాఘమాస ప్రభావం లోకులందరకు చెప్పుచుండెను.
మాఘపురాణం – 12వ అధ్యాయము – పుణ్యక్షేత్రములలో మాఘస్నానము
ఈవిధంగా అనేక పుణ్యపురుషుల వృత్తాంతములను మాఘమాస స్నాన ఫల మహిమను దిలీప మహారాజునకు వశిష్ఠుల వారు వివరించగా “మహర్షీ! మీ కృప వలన అనేక వృత్తాంతములను తెలుసుకొని కృతార్థుడనైతిని. కాని మరొక సంశయం నాకు గలదు. అది ఏమనగా మాఘమాసమందు ఏయే తీర్థములు దర్శింపవలెనో సెలవిండనీ వినమ్రుడై కోరగా వశిష్ఠుల వారు మరల యిట్లనెను.
దిలీప మహారాజా! మాఘ స్నానములు చేయుటయందు ఆసక్తి గలవారలకు ముఖ్యమగు తీర్థ మహిమల గురించి వివరించెను. శ్రద్ధగా ఆలకింపుము.
మాఘమాసంలో నదీస్నానం ముఖ్యమైనది. మాఘ స్నానము చేయక తీర్థములు సేవించిన చాలునని
అనుకొనుట అవివేకం. ఎందుకు అనగా మాఘమాసంలో ఏ నదిలోని నీరైనను గంగనీటితో సమానము. అందుచేత మాఘమాసంలో నదీస్నానం సర్వ పాపహరమైనది ఆవశ్యకమైనది కూడాను.అటులనే ప్రయాగ అతి ముఖ్యమైన క్షేత్రం. ఈ భరత ఖండములో అతి ప్రధానమైన గంగానది సముద్రంలో కలియుచోట మాఘ స్నాన మాచరించిన ఏడు జన్మలలోని పాపములు సహితం హరించును. మాఘమాసంలో నదీస్నానంతో బాటు విష్ణు దేవాలయములు, మహేశ్వరాలయములు మొదలగు మూడువందల అరవై పుణ్యక్షేత్రములు దర్శించిన యెడల గొప్ప ఫలం కల్గుటయే గాక మరల జన్మ అనేది కలుగదు.
ఇక త్రయంబకమను నొక ముఖ్యమైన క్షేత్రం కలదు. అది పడమటి కనుమల దగ్గరున్నది. అచటనే పవిత్ర గోదావరీనది జన్మించినది. గౌతముడు తన గోహత్యా దోషమును పోగొట్టుకొనుటకు ఈశ్వరుని గురించి ఘోరతపస్సు చేసి, గోదావరిని గోహత్య జరిగిన ప్రాంతమునకు ప్రవహింపజేసినాడు. అదియునుగాక మాఘమాసంలో గోడావరియండు స్నానం చేసినయెడల సకలపాపములు తక్షణం హరించి పోవుటయే గాక ఇహమందు పరమందు సుఖపడుదురు. గౌతమీనదిలో మరికొన్ని ప్రసిద్ధములగు ఉపనదులు కూడా కలిసి తమ తమ స్నేహ సౌభ్రాతృత్వమును చాటుచున్నవి. అటులనే ‘పరంతప’ అను ఉపనది ప్రవహించే చోట కూడా శివుడు లింగాకారముగా వెలసి వున్నాడు. దానికి ఆవలగా ప్రభావం అను క్షేత్రం గలదు. ఆ క్షేత్రం బ్రహ్మ హత్యా మహాపాపములను సహితం పోగొట్టగలదు. ఇందుకొక ఇతివృత్తము గలడు. సావధానుడవై ఆలకింపుము.
విష్ణుమూర్తి నాభికమలమున బుట్టిన బ్రహ్మకు ఈశ్వరునికి ఐదేసి తలలు ఉండేవి. ఈశ్వరునకు పంచవక్త్రుడు, త్రినేత్రుడు అనే పేర్లు కూడా కలవు కదా! బ్రహ్మదేవుడు నాకు అయిదు తలలున్నవి, నేనే గొప్పవాడని అనగా నాకు ఐదు వలలున్నవి నేనే గొప్ప వాదనని శివుడు వాదించాడు. ఇద్దరూ గర్వముతో వ్యవహరించినందున చిలికి చిలికి గాలివాన వలె వారిద్దరిమధ్య కలహము పెద్దదయ్యెను. కడకు ఇద్దరూ యుద్ధముచేయగా శివుడు బ్రహ్మయొక్క ఐదవ తలను నరికివేసెను. వెంటనే శివునకు బ్రహ్మ హత్యాపాతము చుట్టుకున్నది.
శివుడు భయపడి నరికిన బ్రహ్మ తలను చేతితో పట్టుకొని ముల్లోకాలు తిరుగుతుండగా క్రమముగా చేతిలో ఉన్న బ్రహ్మ తల ఎండిపోయి పుర్రెగా అయినది. ఈశ్వరుడు ఆ పుర్రెతోనే భిక్షమడుగుచూ భూలోకానికి వచ్చాడు. ఈశ్వరుడు సహజంగా అందమైనవాడు. అతడు భిక్షాటనకు వచ్చి ‘భిక్షాందేహి’యని అనగా గృహిణులు భిక్షపట్టుకొని గుమ్మము కడకు రాగా శివుని మోహనాకారమును చూచి మోహితులై భిక్షవేసి శివుని వెంట పోవుచుండిరి. ఈ విచిత్రమును మునీశ్వరులు చూచి, కోపం కలవారై తమ భార్యలు శివుని వెంట పోవుట సహించలేక, ఈతనికి పురుశాత్వము నశించుగాక అని శపించెను.
ఈశ్వరుడు చేయునది లేక జారి క్రిందపడిపోయిన ఆ లింగమునందే ఐక్యమైపోయినాడు. అటుల లింగాకారంగా మారినందువలన ఎనలేని తేజస్సుతో ఆ లింగము ప్రకాశించుచుండెను. కోటి సూర్యుల తేజస్సు కలిగి ప్రళయం సంభవించునా? యన్నట్లు భయంకరంగా నుండెను. అప్పుడు బ్రహ్మ, విష్ణువు శివుని వద్దకు వచ్చి వానినోదార్చి ప్రయాగ క్షేత్రం వచ్చిపోయి అచ్చట శివునికున్న బ్రహ్మహత్యాది పాపములు పోయి ఆ విధంగా భూలోకమునకు వచ్చిన శివుడు అప్పటినుండీ లింగాకారంగా మారినందున భక్తులు ఆ లింగమునే పూజించుచు శివసాన్నిధ్యము పొందగలుగుచున్నారు.
మాఘపురాణం – 13వ అధ్యాయం – శివుడు పార్వతికి మాఘమాస మహాత్మ్యమును వివరించుట
వశిష్ఠుల వారు మార్కండేయుని వృత్తాంతమును శివలింగాకార వృత్తాంతమును వివరించిన తరువాత ఇంకనూ వినవలెనని కుతూహలుడై దిలీపునకు మరల యిట్లు ప్రశ్నించెను.
“మహామునీ! ఈ మాఘమాస మహాత్మ్యమును ఇంకనూ వినవలయుననెడి కోరిక ఉదయించుచున్నది. గాన సెలవిండ”ని ప్రార్థించగా వశిష్ఠుడు యిట్లు చెప్పసాగెను.
మున్ను పార్వతీ దేవిని శివుడును, నారదునకు బ్రహ్మ, మాఘమాస మహాత్మ్యం గురించి చెప్పియున్నారు. గాన శివుడు పార్వతికి చెప్పిన విధమును వివరించెదను వినుము. ఒకనాడు పరమశివుడు గణాధి సేవితంబును, నానారత్న విభూషితంబునాగు కైలాస పర్వతమందలి మందార వృక్ష సమీపమున ఏకాంతంగా కూర్చుని వున్నా సమయమున జగజ్జనని యగు పార్వతీదేవి వచ్చి, భర్త పాదములకు నకస్కరించి “స్వామీ! మీవలనననేక పుణ్య సంగతులు తెలుసుకొంటిని. కానీ ప్రయాగ క్షేత్ర మహాత్మ్యమును మాఘమాస మహాత్మ్యమును వినవలెననెడి కోరిక వున్నది. గాన ఈ ఏకాంత సమయమందాక్షేత్ర మహిమలను వివరింప ప్రార్థించుచున్న దాన!”నని వేడుకొనగా పార్వతీ పతియగు శంకరుడు మందహాసంతో ఇట్లు వివరించెను.
దేవీ! నీ యభీష్టము తప్పక తీర్చెదను శ్రద్ధగా వినుము. సూర్యుడు మకరరాశియందు వుండగా మాఘమాసమందు ప్రాతఃకాలమున ఏ మనుజుడు నదిలో స్నానము చేయునో అతడు సకల పాపముల నుండి విముక్తుడగుటయే గాక జన్మాంతమందు మోక్షమును పొందును. అటులనే మాఘమాసంలో సూర్యుడు మకరరాశియందు వుండగా, ప్రయాగ క్షేత్రమందు ఏ నరుడు స్నానమాచరించునో అతనికి వైకుంఠప్రాప్తి కలుగును. అంతియే గాదు, జీవనది వున్నాను లేకున్నను కడకు పాదం మునుగునంత నీరు వున్నచోట గాని తటాకమందు గాని, మాఘమాసంలో ప్రాతఃకాల స్నానము గొప్ప ఫలము నిచ్చుటయే గాక సమస్తపాపములు విచ్చిపోవును. రెండవరోజు స్నానం చేసిన విష్ణులోకమునకు పోవును. మూడవ నాటి స్నానం వలన విష్ణుదర్శనం కలుగును. మాఘమాసమందు ప్రయాగ క్షేత్రమందు గల గంగానదిలో స్నానమాచరించిన యెడల ఆ మనుజునకు మరుజన్మమనునది వుండదు.
దేవీ! మాఘ మాస స్నాన ఫలము ఇంతయని చెప్పజాలను. మాఘమాసంనందు భాస్కరుడు మకరరాశియందు ఉండగా ఏది అందుబాటులో వున్న అనగా – నదిగానీ, చెరువుగానీ, నుయ్యి గానీ, కాలువ గానీ, లేక పాదము మునుగునంత నీరున్నచోట గానీ ప్రాతఃకాలమున స్నానమాచరించి సూర్య భగవానునకు నమస్కరించి తనకు తోచిన దాన ధర్మములు చేసి శివలాయమున గాని విష్ణ్వాలయమున గాని దీపము వెలిగించి భక్తి శ్రద్ధలతో అర్చన చేసిన మానవులకు వచ్చు పుణ్యఫలం అంతింతగాదు.
ఏ మానవునకైననూ తన శరీరంలో శక్తిలేక, నడువలేనటువంటి వాడు, గోవుపాదం మునుగునంత నీరున్న ఏ సెలయేటియందైనను కడకు బావియందైననూ స్నానమాచరించి శ్రీహరి దర్శనము చేసినచో అతడెట్టి కష్టములు అనుభవించుచున్ననూ వాని కష్టములు మేఘమువలె విడిపోయి ముక్తుడగును. ఎవరైనను తెలిసిగాని, తెలియకగాని, మాఘమాసంలో సూర్యుడు మకరరాశియందుండగా నదీస్నాన మాచరించిన యెడల అతనికి అశ్వమేధ యాగం చేసినంత ఫలము దక్కును. అదియును గాక మాఘమాసమంతట ప్రాతఃకాలమున నదిలో స్నానం చేసి శ్రీమన్నారాయణుని పూజించి సాయంకాలమున గానీ దీపం వెలిగించి ప్రసాదం సేవించిన యెడల అతనికి తప్పక విష్ణులోక ప్రాప్తి కలుగుటయే కాక పునర్జన్మ ఎన్నటికినీ కలుగదు. ఇటుల ఒక్క పురుషుడేగాక స్త్రీలు కూడా ఆచరించవచ్చును. మానవుడు నరజన్మమెత్తిన తరువాత మరలఘోరపాపములు చేసి మరణానంతరం రౌరవాది నరకబాధలు అనుభవించుటకంటె తానూ బ్రతికి ఉన్నంతకాలం మాఘమాసమందు నదీస్నానం చేసి దాన పుణ్యములు ఆచరించి వైకుంఠ ప్రాప్తినొందుట శ్రేయస్కరం గదా! ఇదే మానవుడు మోక్షము పొందుటకు దగ్గర మార్గం గాన ఓ పార్వతీ! ఇంకనూ వినుము. ఏ మానవుడు మాఘమాసము తృణీకరించునో అట్టి వాడు ఎటువంటి బాధలు అనుభవించునో వివరించెదను. సావధానురాలవై ఆలకింపుము.
నేను తెలియజేసిన విధముగా ఏ మనుజుడు మాఘమాసమందు ప్రాతఃకాలమున జపముగానీ, విష్ణుపూజ గానీ, యథాశక్తి దాన పుణ్యములు చేయడో అట్టి వాడు మరణానంతరం సమస్త నరక బాధలు అనుభవించును. కుంభీ నరకంలో పడద్రోయబడును. అగ్నిలో కాల్చబడును. రంపముల చేత ఖడ్గముల చేత నరుకబడును. సలసల కాగు తైలములో పడవేయబడును. భయంకర యమకింకరులచే పీడింపబడును. ఏ స్త్రీ వేకువ ఝాముననే లేచి కాలకృత్యంబులు తీర్చుకొని నదికి పోయి స్నానం చేసి సూర్య నమస్కారము, విష్ణు పూజ చేసి, తన భర్త పాదములకు నమస్కరించి, అత్తమామలకు సేవలు చేయునో, అట్టి ఉత్తమ స్త్రీకి అయిదవతనం వర్ధిల్లి, ఇహమునందు పరమునందు సర్వ సౌఖ్యములూ అనుభవించును. ఇది ముమ్మాటికీ నిజం. మాఘమాసమందు ఏ స్త్రీ అటుల చేయదో, అట్టి స్త్రీ ముఖం చూచిన సకల దోషములు కలుగుటయేగాక, ఆమె పంది, కుక్క జన్మమెత్తి హీనస్థితి నొందును.
మాఘమాస స్నానమునకు వయోపరిమితి లేదు. బాలుడైనను, యువకుడైనను, వృద్ధుడైనను, స్త్రీయైనను, బాలికయైనను, జవ్వనియైనను, మాఘస్నాన మాచరించవచ్చును. ఈ మాసమంతయు కడునిష్ఠతో వుండిన కోటి యజ్ఞములు చేసినంత పుణ్యం కలుగును. ఇది అందరికిని శ్రేయోదాయక మైనది. “ పార్వతీ! దుష్టులలో స్నానం చేసినవారు బ్రహ్మ హత్యాది మహాపాపములు చేసినవారు, సువర్ణము దొంగిలించిన వారు, గురు భార్యతో సంభోగించు వారు, మద్యము త్రాగి పరస్త్రీలతో క్రీడించువారు, జీవహింసలు చేయువారు, మాఘమాసములో నదీ స్నానం చేసి విష్ణువును పూజించిన యెడల అట్టివారి సమస్త పాపములు నశించుటయేగాక, జన్మాంతరమున వైకుంఠప్రాప్తి కలుగును. మరియు కులభ్రష్టులైన వారును, కించిత్ మాత్రమైనను దాన ధర్మములు చేయని వారును, ఇతరులను వంచించి వారి వద్ద ధనము అపహరించిన వాడును, అసత్యమాడి పొద్దు గడుపు వాడును, మిత్రద్రోహియు, హత్యలు చేయువాడును, బ్రాహ్మణులను హింసించు వాడును, సదా వ్యభిచార గృహములో తిరిగి తాళి కట్టిన ఇల్లాలిని కన్నబిడ్డలను వేధించు వాడును, రాజ ద్రోహి, గురుద్రోహియు, దేశభక్తి లేనివాడును, దైవభక్తులను ఎగతాళి చేయువాడును, గర్వం కలవాడు, తాను గొప్ప వాడనను అహంభావంతో దైవకార్యాలను, ధర్మకార్యాలను, చెడగొట్టుచూ దంపతులకు విభేదములు కల్పించి సంసారమును విడదీయు వాడును, ఇండ్లను తగులబెట్టువాడునూ, చెడు పనులకు ప్రేరేపించు వాడునూ, ఈవిధమైన పాప కర్మలు చేయువారలు, ఎట్టి ప్రాయశ్చిత్తంబులు జరుపకనే మాఘమాసమందు మాఘమాస స్నానం చేసిన యెడల వారందరూ పవిత్రులగుదురు.
“దేవీ! ఇంకనూ దాని మహాత్యంబును వివరించెదను. వినుము. తెలిసియుండియూ పాపములు చేయు వాడునూ, సిగ్గు విడిచి తిరుగు వాడనూ, బ్రాహ్మణ దూషకుడూ, మొదలగు వారు మాఘ మాసములో ఉదయమే నదికి వెళ్ళి స్నానం చేసిన యెడల వారికున్న పాపములన్నీ నాశనమగును. మాఘమాస స్నానమును ప్రాతఃకాలముననే చేయవలెను. ఆలాగున చేసినచో సత్ఫలితం కలుగును. ఏమానవుడు భక్తి శ్రద్ధలతో మాఘమాసం మొదటినుండి ఆఖరు పర్యంతమూ స్నానమును చేసెదనని సంకల్పించునో అటువంటి మానవులకున్న పాపములు తొలగిపోయి ఎటువంటి దోషములూ లేక పరిశుద్ధుడగును. అతడు పరమపదము చేర అర్హుడు అగును.
క్రూర కర్మలు ఆచరించు వాడునూ
శాంభవీ! పండ్రెండు మాసములలో మాఘమాసం మిక్కిలి ప్రశస్తమైనది. సకల దేవతలలో శ్రీమన్నారాయణుడు ముఖ్యుడు. అన్ని శాస్త్రములలో వేదము ప్రధానమైనది. అన్ని జాతులలో బ్రాహ్మణుడు అధికుడు. అన్ని పర్వతాలలో మేరు పర్వతం గొప్పది. అటులనే అన్ని మాసములలో మాఘమాసం శ్రేష్ఠమైనదగుటచే ఆమాసమునందు ఆచరించే ఏ స్వల్పకార్యమైననూ గొప్ప ఫలితాన్ని కలుగజేయును. చలిగా వున్నదని స్నానం చేయని మనుష్యుడు తనకు లభించబోవు పుణ్యఫలం కాలితో తన్నుకున్నట్లేయగును. వృద్ధులు, జబ్బుగా వున్నవారు, చలిలో చన్నీళ్ళలో స్నానం చేయలేరు. కాన అట్టివారికి ఎండుకట్టెలు తెచ్చి అగ్ని రాజేసి వారిని చలికాగనిచ్చిన తరువాత స్నానం చేయించినయెడల ఆస్నాన ఫలం పొందగలరు. అదియునూ గాక చలికాగిన వారు స్నానం చేసి శ్రీహరిని దర్శించిన పిదప అగ్ని దేవునికి సూర్య భగవానునికి నమస్కరించి నైవేద్యం పెట్టవలెను. మాఘమాసంలో శుచియై ఒక బీద బ్రాహ్మణుడికి వస్త్రదానము చేసినయెడల మంచి ఫలితము కలుగును.
ఈవిధంగా ఆచరించిన వారిని చూచి ఏ మనుజుడైననూ అపహాస్యంగా చూచిననూ లేక అడ్డు తగిలిననూ మహాపాపములు సంప్రాప్తించును. మాఘ మాసం ప్రారంభం కాగానే వృద్ధులగు తండ్రినీ, తల్లినీ, తన భార్యనూ లేక కుటుంబ సభ్యులందరినీ మాఘస్నానము ఆచరించునటుల ఏమానవుడు చేయునో అతనికి మాఘమాస ఫలితం తప్పక కలుగును. ఆవిధంగానే బ్రాహ్మణునిగానీ, వైశ్యుని గానీ, క్షత్రియుని గానీ శూద్రుని గానీ, మాఘ మాసస్నానం చేయమని చెప్పినయెడల వాడు పుణ్యలోకం పోవుటకు ఏ అడ్డంకులూ ఉండవు. మాఘమాస స్నానం చేసిన వారికి గానీ, వారిని ప్రోత్సహించు వాళ్ళను చూసి గానీ ఆక్షేపించి పరిహాసములాడు వానికి ఘోర నరక బాధలు కలుగుటయే కాక ఆయుఃక్షీణం, వంశక్షీణం కలిగి దరిద్రుడగును.
నడుచుటకు ఓపిక లేని వారలు, మాఘమాసంలో కాళ్ళూ, చేతులు, ముఖము కడుగుకొని తలపై నీళ్ళు జల్లుకొని సూర్య నమస్కారములు చేసి మాఘపురాణమును చదివి గానీ, వినుట గానీ చేసిన యెడల జన్మాంతరమున విష్ణు సాన్నిధ్యము పొందును. పాపములు, దరిద్రము, నశింప వలయునన్న మాఘస్నానం కన్నా మరొక పుణ్యకార్యమేదియును లేదు. మాఘస్నానమున కలుగు ఫలితము ఎటువంటిదనగా వంద అశ్వమేధ యాగములు చేసి బ్రాహ్మణులకు దక్షిణలు ఇచ్చిన ఎంతటి పుణ్యఫలము కలుగునో మాఘ మాస స్నానము అంతటి పుణ్యము కలుగును. బ్రాహ్మణ హత్య, పితృ హత్య మహాపాపములు చేసిన మనుజుడైననూ మాఘమాసమంతయూ కడునిష్ఠతో నున్నఎడల రౌరవాది నరకములనుండి విముక్తుడగును.
కనుక ఓ పార్వతీ! మాఘమాస స్నానము వలన ఎట్టి ఫలితము కలుగునో వివరించితిని. కావున నే చెప్పిన రీతిని ఆచరించుము.
మాఘ పురాణం – 14వ అధ్యాయం…. బ్రాహ్మణ స్త్రీ భర్తతో స్వర్గమునకు వెళ్ళుట
మాఘ పురాణం – 14వ అధ్యాయం
బ్రాహ్మణ స్త్రీ భర్తతో స్వర్గమునకు వెళ్ళుట
ఓ దిలీపుడా! మాఘమాసములో స్నానమాచరించుట వల్ల కలుగు ఫలమును పార్వతికి ఈశ్వరుడు చెప్పినది వింటివి కదా! అటులనే విప్రకన్య తన భర్తతో ఎటుల విష్ణు సాయుజ్యమును పొందెనో వివరింతును సావధానుడవై ఆలకింపుము.
పూర్వకాలమందు కాశ్మీర దేశమందు గల ఒక గ్రామములో సుబుద్ధి యను బ్రాహ్మణుడు కలదు. అతడు నాలుగు వేదములు చదివి అర్థ తాత్పర్యసహితముగా వర్ణించగల పండితుడు. చదువునందెటుల పాండిత్యము గలదో బుద్ధియందును పేరుకు తగినటులే పెద్దలను గౌరవించుట, భూతదయ గలిగి, అందరి మన్ననలను పొంది యుండెను. అతడు గొప్ప పండితుడగుట వల్ల అనేకమంది ఇతర పండితులు అతనివద్దకు జేరి శిష్యులైరి. ఆ బ్రాహ్మణునకు పడి సంవత్సరముల బాలికామణి కలదు. ఆమె పేరు సుశీల. ఆ బాలిక కడు రూపవతి. సుగుణాల రాశి, అందాలభరిణ. లేడి కన్నులవలె చక్కటి నయనాలు గలది. నిండు చంద్రుని వంటిముఖము కలది. తుమ్మెద రెక్కలను పోలు నల్లని పొడుగాటి తలవెంట్రుకలు కలదు. ఆమె నడచిన యెడల హంస నడకను మరిపించు నడక గలది. అందమైన ముఖవర్చస్సు గలది. కోకిల కంఠము కలది ఆ సుందరాంగి ముక్కు, పండ్లవరుస చూచిన వారికి మరల మరల చూడవలయునను కోరిక పుట్టును. అటువంటి సర్వలక్షణములు గల తన కుమార్తెను ఎవరికిచ్చి పెండ్లి చేతునాయని తండ్రి సుబుద్ధి ఆలోచించుచుండెను.
ఒకనాడు సుమిత్రుడను శిష్యుడొకడు గురువుగారి ఇంట జరుగు దైవకార్యమునకు పూజాద్రవ్యములను తెచ్చుటకై అడవికి బయలుదేరి వెళ్ళుచుండగా- దారిలోనున్న ఉద్యానవనములో సుశీల తన స్నేహితురాండ్రతో బంతులాట ఆడుకొనుచుండెను. ఆ బంతి బైటకుపడినందున బంతి తెచ్చుటకు తోట వెలుపలకు సుశీల వచ్చి సుమిత్రుని చూచినది.
సుమిత్రుడు కూడా యుక్తవయస్సులో నున్నాడు. చక్కటి అవయవ సౌష్టవం కలవాడు. విశాలమైన వక్షము కలిగి బంగారు కాంతి గల రూపవంతుడు. అతని అందమును సుశీల చూడగానే నివ్వెరపోయింది. అతనిని తదేక దృష్టితో చూచి అతని వెంటబడింది. సుమిత్రుడు తన కార్యము కొలది చాలా దూరమేగెను. అలా కొంత దూరమేగుసరికి ఒక కోనేరు కనిపించెను. ఆ కోనేరు నిండా తామరపువ్వులు విరబూసి ఉన్నాయి. తుమ్మెదలు గుంపులుగా ఎగిరి తామర పువ్వులలోని మధువును గ్రోలుచు మత్తెక్కి ఎగురుచున్నవి. అచ్చటనున్న వివిధ ఫల వృక్షాలు పువ్వులతోను, పండ్లతోను నిండివున్నాయి. కోయిలలు తమ మధుర కంఠాలను విప్పి కూయుచున్నవి. మగనెమళ్ళు ఆడ నెమళ్ళకు తమ అందాన్ని చూపించుటకు కాబోలు తమ తమ పింఛములను విప్పి నాట్యమాడుచున్నవి. నీటి జంతువులూ తామర తూండ్లను తింటూ ఒక్కొక్కప్పుడు పైకెగిరిపడుతూ నీటిలో ఈడుచున్నవి. సుమిత్రుడు దూరంనుండి అలసిపోయి వచ్చినందువలన ఆ చల్లని నీరు గ్రోలి చెట్లనీడను విశ్రమించి యుండెను. వెనుకనుండి వచ్చిన సుశీల అచటి ప్రకృతి రమణీయతను చూచి మల్లె, జాజి, సంపెంగ పూవులా వాసనలకు మన్మధ చేష్టలతో మత్తెక్కినదై చెట్లక్రింద విశ్రమించి యున్న సుమిత్రుని సమీపమునకు మెల్లగా వచ్చి నిలవడినది. సుమిత్రుని సౌందర్యమును కనులార చూచి చలించిపోయినది. ఇక తానే సుమిత్రుని పలకరించినది. “ఓ అందగాడా! సుమిత్రా! నిన్ను చూచినది మొదలు నా మనస్సు నా స్వాధీనంలో లేదు. అందుకే నీ వెనుక ఇంతదూరం వచ్చితిని. ఈ ఏకాంత ప్రదేశమున నన్ను కౌగిలించుకొని నాతొ కూడుము. నీ వయసు, నా వయసు సరిసమానము. ఇద్దరమూ ఏరికూర్చిన జంటవలె నున్నాము. చిలకా గోరింకల వలెను, రతీ మన్మధులవలెను, లీనమై పోవుదము. ఆ చెట్టుపై వున్నా గువ్వలజంటలను చూడు. మధువును త్రాగి మత్తెక్కిన ఆ తుమ్మెదల జంటల చూడు ఏలాగున్నవో! కాన రమ్ము నా యవ్వన బింకాన్ని ఆఘ్రాణించుము. సమయమును జారవిడువకుము. నా సుకుమార లేత శరీరాన్ని సున్నితములగు అవయవములను నీకర్పింతును. నీవు మన్మధుని వలె వచ్చి నన్ను కౌగలించుకో” అని అనేక విధాల ఆ విప్రకుమారుని తొందర పెట్టసాగెను.
అంత సుమిత్రుడు నిశ్చేష్టుడై నోటమాట రాక శిలావిగ్రహము వలెను, కొంతసేపైన తరువాత బాలా! నీమాటలు చూడ పిచ్చిదాని వలె నున్నావు. నీకేదైనా గ్రహము ఆవరించినదా? అని సందేహం కల్గుచున్నది. అదియుగాక నీవు ణా గురువు కుమార్తెవు. నేను నీకు అన్ననగుదును. నీవు నాకు చెల్లివంటి దానవు. నీ మనసును నీవు స్వాధీనము చేసుకోలేని స్థితిలో నున్నావు. నీవెంతటి అందగత్తె వాయినాను హద్దుమీరి ప్రవర్తించుట భారతనారికి తగదు. అదిగాక నీవు విద్యావటివి, పుణ్యవతివి గాన నీ ప్రయత్నమును మానుకోనుము. నీకు కష్టములెదురౌను. వావి వరస లేక మన్మధాగ్నికి బలియై మనమిద్దరమూ సంభోగించిన ఆ మహాపాతకము సూర్య చంద్రాదులు వున్నతవరకు మనమెన్ని జన్మలెత్తినను, ఏయే జన్మలెత్తినను, మనలను వెంటాడుచునే ఉండును. ఆ నరకబాధలనుండి మనమెన్నటికిని విముక్తినొందజాలము. గాన నీకోరిక నంగీకరింప జాలను. ఇప్పటికే చాలా ఆలస్యమైనది. ఇల్లు బయలుదేరి నా వెంట వచ్చినటుల గురువర్యులకు తెలిసినచో నిన్ను దండింతురు గాన రమ్ము. ఫలములు, కుశలు, పుష్పములు మొదలను పూజాద్రవ్యములను దోడ్కొని పోవుదము” అని సుమిత్రుడు అనేక విధాల బోధించాడు.
అంత నా కన్యయు, బంగారం, రత్నము, విద్య, అమృతము తనంత తానే వచ్చినప్పుడు నిరాకరించు వాడు మూర్ఖుడు గాని వివేకవంతుడు గాదు. నానిండు యవ్వనాన్ని, నా శరీరాన్ని సమస్తమును నీకర్పింతునాన్న నిరాకరించుచున్నావు గదా! సరే నేనిక వంటరిగా నా గృహమునకు పోజాలను. నేనిందే ప్రాణత్యాగ మొనర్చుకొందును. నీవలన ఒక కన్య చనిపోయినదని నలుగురూ నిన్ను ఆదిపోసుకొందురు. నన్నొంటరిగా యీ కారడవిలో వదలి ఇల్లు చేరినయెడల నా దండ్రి నిన్ను విడుచునా? నా కుమార్తె ఏదియని నిన్ను దండించడా? ఈ పాటికి ణా చెలికత్తెలు నీతో అడవికి పోయెనని చెప్పియేయుందురు. గాన నేను కామబాధ భరించలేకున్నాను. నాతో సంభోగింపుము. నన్ను నీదానను జేసికోనుము” అని పలికెను.
సుమిత్రుడు ఆమె దీనాలాపము లాలకించి సంకట స్థితిలో పడెను. కొంత తడవు ఆలోచించి, ఆ బ్రాహ్మణ కన్యతో రతీక్రీడల దేలుటకై నిశ్చయించుకొనెను. శాంకరీ! ఈవిధముగా వారిరువురునూ ఆ తటాక సమీపమందొక ప్రదేశమును శుభ్రము చేసి, అందు మెత్తని పత్రములు, నానా విధ సువాసనలు వెదజల్లు పుష్పముల బరచి ప్రక్రుతి సౌందర్యములను జూచి మురిసిపోయి కామతృష్ణ దీర్చుకొని, మరికొంతసేపు బంతులాడి గెంతులు వేస్తూ కేకలు వేస్తూ పరుగులిడుచూ ఆడుకొనిరి. వారికామ వికారములను చూచి, పక్షులు సిగ్గుపడి అచ్చోటి నుండి ఎగిరిపోయినవి. సాధుజంతువులు మొగములు ముడుచుకొని అచటినుండి కదలిపోయినవి. కొలనులోని కాలువలు మెడవంచినట్లు – నీళ్ళలో వంగిపోయినవి. సూర్యుడు మబ్బు చాటున దాగుచున్నాడు. మాటిమాటికీ వారి అన్యోన్య చుంబనములు చూడలేక మధువు గ్రోలి మత్తెక్కియున్న తుమ్మెదలు గూడ సిగ్గుపడినవి. ఈవిధంగా వారు ఉల్లాసంగా కొంత తడవు వుండి సమత్కుశ పుష్పములు, నానావిధ ఫలములు సంగ్రహించి ఇంటిముఖం పట్టి ఇల్లు జేరిరి. సుమిత్రుడు గురువునకు నమస్కరించి తెచ్చిన పూజాద్రవ్యములు సమర్పించెను. అడవికి పోయి కష్టపడి తెచ్చిన వస్తువులను సంతోషంతో గురువు స్వీకరించి కుమార్తెను జూచి “సుశీలా! నీవు ఉద్యానవనంలోని చెలులతో బంతులాటలాది అలసిపోయి వున్నావు. పాపము! ఎండకు నీ సుకుమార ముఖారవిందము ఎటుల వాడిపోయి ఉన్నదో కదా! రమ్ము ఈ మధుర పదార్థములను భుజించి కొంత తడవు విశ్రమింపుము. ఆటలాడు కొనుట వలన నీవు ధరించి ఉడుపులు కూడా నలిగియున్నవి. అని కుమార్తెను బుజ్జగించి తినుబండారములను అందించెను. ఆమె లోలోన బెదురూ పైకి ఏమియు ఎరుగని దానివలె నాటించెను. మరి కొంతకాలములకు సుశీలను హిమాలయ ప్రాంత వాసియగు బ్రాహ్మణుడొకడు పెండ్లియాడి అత్తవారింటనే వుండిపోయెను.
మరికొంతకాలమునకు సుశీలను పెండ్లియాడిన బ్రాహ్మణుడు పరలోక గతుడయ్యెను. భర్త శవముపై బడి సుశీల ఏడ్చుచున్నది. చాలా దుఃఖించెను. నవయవ్వనవతి, సౌందర్యవతి యగు తన కుమార్తెకు అకాల వైధవ్యము కలిగెను కదా! అని గొల్లుమని ఆడదాని వలె తండ్రి ఏడ్చుచుండెను. “ఓయీ భగవంతుడా! చిన్నవయసునందే ఇంకనూ సంసార సుఖమన్నది అనుభవించకనే ఈమెను విధవరాలను చేసితివా? తండ్రి దీనికాలమెట్లు తీరును? ప్రజలు విధవను జూచిన యెడల అమంగళకారమని భావింతురే! ఏ శుభ కార్యములయందును పాల్గొననివ్వరు కదా! దీనికి కర్మ నేలా కలిగించితివి!”అని పరిపరి విధములుగ దుఃఖించెను. అంతలో అచ్చోటికి ఒక సిద్ధపురుషుడు భిక్షాటనకై వచ్చెను. ఆ సమీపమునందే ఒక మూల ఏడుపులు వినబడుచున్నందున శవమున్న చోటకు వెళ్ళి సుబుద్ధితో – “ఆర్యా! మీరు దుఃఖించుటకు కారణమేమి? త్వరగా చెప్పుడు” అని పలికెను.
అంతట సుబుద్ధి సిద్ధ పురుషునితో స్వామీ! మా దుఃఖం గురించి ఏమని చెప్పుకొందును. మీ తేజస్సు చూచుటవలన కొంత ఉపశమనం కలిగినది. ఈ బాలిక నా కుమార్తె. ఆ చనిపోయిన వాడు ఆమె భర్త. వివాహమైన కొలది దినములకే ఈతడు చనిపోయినాడు. మాకు ఈమె తప్ప మరెవ్వరునూ లేరు. చిన్నతనములోనే ఈమెకు కల్గిన వైధవ్యమును చూడలేక మా హృదయములు బ్రద్దలగుచున్నవి. ఇదియే మా దుఃఖానికి కారణం. ఈమెకీ దుస్థితి ఎందుకు కలిగెనో ఈమె పూర్వజన్మ మెటువంటిదో మీకు తెలిసియున్న యెడల సెలవిండు” అని వేడుకొనెను.
సిద్ధుడు కొంతతడవు తన దివ్యదృష్టిచే అంతా గ్రహించి “విప్రవర్యా! నీకుమార్తె వెనుకటి జన్మలో క్షత్రియ యువతిగా వుండేది. ఈమె కామాతురత గలదగుటచే కొంతమంది పరపురుష సంపర్కము కలిగివుండి తన భర్త నిద్రలో నుండగా అర్థరాత్రి నిశా సమయమున కత్తితో పొడిచినందున అతడు విలవిల తన్నుకొని ప్రాణములు విడచెను. ఆ రక్తపాతము భయానక దృశ్యము చూచి ఆమె భయపడి తానుకూడా ఆ కరవాలముతో పొడుచుకొని చనిపోయినది. అటువంటి ఘోరహత్యచేసి ఈజన్మలో నీ కుమార్తెగా పుట్టినది. ఆమె చేసియున్న దోషము వల్లనే నీ అల్లుడు చనిపోయాడు. ఆమెకు చుట్టుకున్న పాతకముల వలననే విధవరాలైనది. అంతటి పాపత్మురాలు అయినప్పటికీ పుణ్యాత్ములకు మీకు ఎలా జన్మించినదో ఆ వృత్తాంతము గూడ వివరించెదను వినుము.
చాలా సంవత్సరాల క్రిందట అనగా – నీ కుమార్తెయొక్క పదునాల్గు జన్మల వెనుక మాఘమాసంలో సూర్య భగవానుడు మకరరాశి యందుండగా కొంతమంది బ్రాహ్మణ స్త్రీలతో కలసి యమునానదీ తీరమునకు బోయి స్నానం చేసి ఇసుకతో గౌరీదేవి ప్రతిమను జేసి భక్తి శ్రద్ధలతో పూజలు చేయుచుండిరి. ఆ బ్రాహ్మణ స్త్రీలు చేసే గౌరీదేవి పూజలో నీకుమార్తెగా పుట్టిన ఈమె కూడా పాల్గొనుట వల్ల ఆ వచ్చిన పుణ్య ఫలంచేతనే నీవంశంలో నీకు కుమార్తెగా పుట్టినది. అయిననేమి? నీ శిష్యునితో రహస్యంగా అడవికిపోయి తన కామవాంఛ కొరకు అతనితో రమించినది. అందువలననే యీ వైధవ్యం కలిగినది. పూర్వ జన్మవలన పవిత్రమైన నీ యింత పుట్టిననూ ఘోరపాపం చేసివున్నందున తన మగనిని పోగొట్టుకొని విధవరాలైనది. కనుక పూర్వ జన్మలో చేసిన పాపకర్మ ఈ జన్మలో పాపకర్మ వలననే కుమార్తెకు అకాల వైధవ్యం కలిగినది. ఇప్పుడు దుఃఖించిన లాభమేమున్నది? కానున్నది కాకమానదు. మనుష్యుడు తానూ చేసిన పాపపుణ్యాల ఫలితం ఎప్పటికైననూ అనుభవించవలసినదే కదా! దేవతలకైనను కష్టములు తప్పవు” అని పలికిన సిద్ధుని మాటలకు సుబుద్ధి “హరిహరీ! నేనెంతటి పాపపు మాటలు వినవలసి వచ్చినది. పూర్వజన్మలో యీ నాకుమార్తె తన భర్తను హత్యచేసి తానూ ఆత్మహత్య చేసుకొన్నది. సరే ఈ జన్మలో కూడా కన్యగా వుండి నాకు కుమారునితో సమానుడు, తనకు సోదరుడు లాంటి వాడని గ్రహించక నా శిష్యునితో కూడినదా! ఆహా! ఎంతటి ఘోరము?” అని మనసులో విచారించి ఆ సిద్ధుని జూచి “స్వామీ! మీ పలుకులాలకించినది మొదలు ఒకవైపు పుత్రికపై కోపము మరియొకవైపు ప్రేమ కలుగుచున్నవి. గాన కుమార్తె పాపమునుండి ఎటుల విముక్తురాలగునో తిరిగి ణా అల్లుడు ఎటుల పునర్జీవితుడగునో మీరు వినిపించ వలసినదిగా కోరుతున్నాను” అని పలికెను.
ఓ సుబుద్దీ! నీకుమార్తె గురించి నీవడగక పోయినా తన్నివారణోపాయం వివరించవలయుననియే నేను యిలా వచ్చినాను. ఈ మాఘ మాసంలో నీ కుమార్తె చేత నదిలో గాని, చెరువులోగాని, సూర్యోదయం కాగానే స్నానం చేయించి అచటనే ఇసుకతో గౌరీదేవిని చేసి ముత్తయిదువులతో కలసి ధూపదీప నైవేద్యములిచ్చి పూజలు చేయించుము. ఈవిధంగా మాఘమాసమంతయు నీకుమార్తె చేత చేయించిన యెడల ఆమెకున్న పంచమహా పాపాలన్నీ తొలగిపోయి ఆమె భర్త కూడా బ్రతుకును.
మాఘ శుద్ధ విదియనాడు ముత్తయిదువుల పాదములకు పసుపు రాసి నుదుట బొట్టు పెట్టి పూజ చేయవలెను. రెండు క్రొత్త చేతలు తెచ్చి అందొక చేతలో చీర, రవికల గుడ్డ, పసుపుకుంకుమ, పండ్లు, తమలపాకులు, వక్కలు దక్షిణ పెట్టి దానిపై రెండవచేట మూతవేసి ఆ ముత్తైదువునకు సంతుష్టిగా భోజనం పెట్టి సంతోష పెట్టవలయును. ఆ విధంగా చేసినయెడల పరపురుష సాంగత్యం వలన కలిగిన దోషము నివారణ యగును.
కొంతమంది పురుషులు ఉదయముననే నదికిపోయి స్నానం చేయవలయునన్న అయిష్టత చూపుదురు గాన, అట్టివారల భార్యలయినను వారిని ప్రోత్సాహపరచి వారుకూడా నిష్ఠతో మాఘమాస స్నానములు చేయవలయును. వంశాభివృద్ధికి గాని, కుటుంబ గౌరవానికి గాని, స్త్రీయే ప్రధాన కారకురాలు కనుక ఈ మాఘమాస స్నానం తప్పక స్త్రీ ఆచరించవలెను. ఈ మాఘమాసమంతయు పురాణములు చదివి హరికథలు గాని, హరినామ కీర్తనలు గాని ఆలకించుచు, దానధర్మములు చేసినయెడల దానికన్న ఫలితం మరొక ఏ వ్రతమందునూ కలుగదు. మునిసత్తములు మాఘమాస స్నానములు చేసి తపస్సు చేసుకొన్నచో వారు సిద్ధులగుదురు. మతిలేని వారలచే మాఘస్నానములు విడువక చేయించిన యెడల వారిపిచ్చి కుదురును. కుష్ఠు వ్యాధితో బాధపడు వారలు మాఘస్నానములు చేసిన వారికి రోగ నివృత్తియగుటయే గాక మంచి పుణ్యాత్ములగుదురు. స్త్రీగాని, పురుషుడు గాని మాఘ మాస స్నానములు డాంబికముతో నలుగురు చూచి పొగుడుతున్నట్లుగా గాక చిత్తశుద్ధితో స్నానములు చేసి విష్ణు దర్శనము, సూర్య నమస్కారములు, పురాణములు చదువుట, హరినామ సంకీర్తనలు చేయుట మొదలగునవి నిరాడంబరముగా చేయవలయును మాఘమాస స్నానములు చేయుచున్నానని తన్ను తాను పొగడుకొనరాదు. అటుల చేసిన “చిత్తశుద్దిలేని శివపూజలేలరా” అనురీతిగా నిష్ప్రయోజనములగును. అని సుబుద్ధికి భిక్షాటనకై వచ్చిన సిద్ధుడుపదేశించెను.
ఓ శాంకరీ! ఆవిధముగా సిద్ధుని ఉపదేశములు పొందిన సుబుద్ధి తన కుమార్తె చేత మాఘ స్నానములు ఆచరింపజేసి దాన పుణ్యములు చేయించగా చనిపోయిన అల్లుడు తిరిగి నిద్రమేల్కాంచిన వానివలె లేచి జరిగిన వృత్తాంతమును విని తానుకూడా తన భార్యతో పుణ్య కార్యములను చేసి పాపరహితుడయ్యెను.
మాఘ పూర్ణిమ ప్రత్యేకత
చైత్రాది పన్నెండు మాసాలకూ ఏదో ఒక ప్రత్యేకత వుంది.
కార్తీక మాసం దీపాలకూ, దీపారాధనలకు ప్రసిద్ధి.
మాఘమాసం పవిత్ర స్నానాలకు ప్రసిద్ధి.
“మా – అఘం” అంటే పాపం యివ్వనిది అని అర్థం. కనుకనే మాఘమాసం అన్నారు.
“మాఘమాసేరటం తాప్యః కించి దభ్యుదితే రవౌ
బ్రహ్మఘ్నం వా సురాపం వా కంపతంతం పునీమహే”
“ఈ మాఘమాసమందు సూర్యోదయమునకు పూర్వమే, అనగా … బ్రాహ్మీముహూర్తము
నుంచి జలములన్నియు బ్రహ్మహత్య, సురాపానము వంటి మహా పాతకములను పోగొట్టి
మానవులను పవిత్రులుగా చేయుటకు సంసిద్ధముగా వుండును” అని అర్థం.
అందుకనే మాఘమాసం నెలరోజులు పవిత్రస్నానాలు చేయాలని మన ఋషులు నిర్ణయించారు.
మాఘం అమోఘం :
మాఘమాసానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఈ మాసానికి పరిపోషకుడు మాధవుడు. “మా” అంటే మహాలక్షీ. “ధనుడు” అంటే భర్త. మాధవుడు అంటే లక్ష్మీదేవికి భర్త అని అర్థం. అందుకే శ్రీమహాలక్ష్మీ కూడా ఈ మాసాన్ని ఎంతగానో ఇష్టపడుతుంది. లక్ష్మీనారాయణులకు ప్రీతికరమైన మాసం కనుక శ్రీవైష్ణవులకు ఈ మాఘమాసం ఎంతో ప్రధానమైనది. విద్యాధిదేవత, వాగ్దేవి, జ్ఞానప్రదాయిని అయిన సరస్వతీదేవి ఈ మాఘమాసంలోనే శుద్ధ పంచిమినాడు జన్మించింది. అందుకే మాఘశుద్ధ పంచమిని “శ్రీపంచమి” అని అంటారు. “శ్రీ” అంటే లక్ష్మీదేవి అనే కదా మనందరి అభిప్రాయం.
“శుద్ధలక్ష్మీ: మోక్షలక్షీ: జయలక్ష్మీహ సరస్వతే
శ్రీర్లక్ష్మీ: వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమసర్వదా”
మానవునకు అవసరమైన ఆరు సంపదలలోను విద్యాసంపద ఒకటి. కనుకనే శ్రీమహాలక్ష్మీ “శ్రీపంచమి”నాడు సరర్వతీదేవి రూపంలో భాసిస్తుంది. ఈ రోజునే తల్లిదండ్రులు తమ పిల్లలకు “అక్షరభ్యాసం” జరిపిస్తారు. ఈ నాఘమాసంలోనే ఆరోగ్యప్రదాత అయిన సూర్యుడు సప్తమి తిథినాడు జన్మించాడు. అందుకే మాఘశుద్ధసప్తమి “రథసప్తమి” పర్వదినం అయింది. లయకారుడైన పరమేశ్వరుడు లింగాకారంలో ఉద్భవించి మాఘ బహుళ చరుర్ధషిని “శివరాత్రి” పర్వదినం చేశాడు. విష్ణుసహస్రనామ స్తోత్రాన్ని సర్వమానవాళికి అందించిన భీష్మ పితామహుడు ఈ మాఘ శుద్ధ అష్టమినాడు పరమపదం చేరి, మాఘశుద్ధ ఏకాదశి “భీష్మ ఏకాదశి” పర్వదినం చేశాడు.
త్రిమతాచార్యులలో ఒకరైన “మధ్వాచార్యుడు” ఈ మాఘశుద్ధ నవమినాడు వైకుంఠ ప్రాప్తి పొందాడు. ఈ రోజున ఉడిపి కృష్ణుని మనం చూడగలుతున్నామంటే అందుకు మధ్వాచార్యుని కరుణాకటాక్షమే కారణం. అందుకే మాఘశుద్ద నవమిని “మధ్వనవమి”గా పాటిస్తూ ఉడిపి క్షేత్రంలో ఎంతో కోలాహాలంగా కృష్ణునికి విశేషమైన ఉత్సవాలు, వేడుకలు చేస్తారు.
జ్యోతిషశాస్త్ర ప్రకారం ఈ మాసాన్ని “కేతువు” పరిపాలిస్తూంటాడు. కేతువు జ్ఞానప్రదాత, మోక్షకారకుడు. కనుక ఈ మాసంలో కేతువి విశేష పూజలు అందుకుంటాడు. చాంద్రమానం ప్రకారం చంద్రుడు “మఖ” నక్షత్ర మండలంతో కూడి వుండే మాసం కనుక ఈ మాసానికి “మాఘమాసం అనే పేరు వచ్చింది. అందుకే మాఘం – అమోఖం.
పితృయజ్ఞానికి ప్రాధాన్యత :
మాఘ అమావాస్య పితృకార్యాచరణకు ఎంతో ప్రధానమైన రోజు. ఆ రోజున పైతృకం చేస్తే పితృదేవతలు పదివేల సంవత్సరాల పాటు స్వర్గసుఖాలు అనుభవిస్తారని పురాణాలు చెబుతున్నాయి. సాధారణంగా గ్రహణకాలాలు, సంక్రమణాలు “పైతృకాలకు” ఎంతో అనువైన కాలాలుగా భావిస్తారు. అయితే, ఆదివారం, అమావాస్య, శ్రవణనక్షత్రం, వ్యతీపాత యోగం అన్నీ ఒకేరోజున కలిసివస్తే దాన్ని “అర్ధోదయ పుణ్యకాలం” అంటారు. అది గ్రహణకాలం కన్నా గొప్పదని శాస్త్రాలు చెబుతున్నాయి. పైగా మాఘ అమావాస్య, శతభిష నక్షత్రంలో కూడి వుంటే మరింత విశేషమని ధర్మసింధువు చెబుతుంది. కనుక, ఈ మాఘ అమావాస్య నాడు పితృదేవతలను స్మరిస్తే, పుత్రధర్మాన్ని నిర్వర్తించిన వారిమౌతాం.
మాఘపూర్ణిమ – మహామాఘి :
మాఘమాసం స్నానాలకు ప్రసిద్ధి అని చెప్పుకున్నాం కదా! నిజానికి మకర సంక్రమణం జరిగినది మొదలు కుంభసంక్రమణం జరిగేవరకు మధ్య ఉండే మధ్యకాలమే “మాఘమాసం”. పవిత్రస్నానాలు పౌష్య శుక్ల పూర్ణిమతో మొదలై మాఘశుక్ల పూర్ణిమటో ముగుస్తాయి. చాంద్రమానం అనుసరించేవారికి ఈ మాఘమాసం పౌష్య బహుళ అమావాస్యతో ప్రారంభమై మాఘ బహుళ అమావాస్యతో ముగుస్తుంది. ఈ మాఘమాసం మొత్తం పవిత్రస్నానాలు చేయడం విశేష పూర్వప్రదం. కానీ, ఈ యాంత్రిక జీవితంలో అది సాధ్యం కానీ పని తెలిసే … కనీసం “మాఘపూర్ణిమ” నాడైనా నదీస్నానం గానీ, సముద్రస్నానం గానీ చేస్తే మాఘమాసం మొత్తం పవిత్రస్నానాలు చేసిన ఫలితం వస్తుందని పెద్దలంటారు. ఎందుకంటే మాఘపూర్ణిమను “మహామాఘి” అని అంటారు. సంవత్సరంలో వచ్చే 12 పూర్ణిమలలోనూ “మాఘ పూర్ణిమ” అత్యంత విశేషమైనది. ఈ “మహామాఘి” శివ, కేశవులిద్దరికీ ప్రీతికరమైనది. అందుకే ఈ మాఘ పూర్ణిమ నాడు తప్పకుండా సముద్రస్నానం చేసితీరాలి. శివ, కేశవులిద్దరినీ ఆరాధించి తరించాలి.
సముద్రస్నానం ఎందుకు చేయాలి
“నదీనాం సాగరో గతి:”
సకల నదీ, నదాలు చివరకు సముద్రంతోనే సంగమిస్తాయి. కనుక, సముద్రస్నానం చేస్తే సకల నదులలోనూ స్నానం చేసిన పుణ్యఫలం దక్కుతుంది. ముఖ్యంగా సముద్రుడి ప్రత్యేకత ఏమిటంటే … ప్రతినిత్యం సూర్యకిరణాలవల్ల, ఎంతో నీరు ఆవిరి అవుతున్నా సముద్రం యొక్క పరిమాణం తగ్గదు. అలాగే, ఎన్నో జీవనదులు తనలో కలుస్తున్నా సాగరుని పరిమాణం పెరగదు. స్థిరత్వం ఆయన ధర్మం.
అఘాది, జడత్వాలు ఆయన తత్త్వం.
సాగరుడు సంతోశప్రదుడు. సంవత్సరంలో నాలుగుసార్లు సాగరస్నానం చేయాలనీ, అవి కూడా “ఆషాఢ పూర్ణిమ, కార్తీక పూర్ణిమ, మాఘపూర్ణిమ, వైశాఖ పూర్ణిమ”లలో చేయాలని, ఆలా సాగరస్నానాలు చేసినవారికి సముద్రుడు సంపూర్ణ ఆరోగ్యం కలుగజేస్తాడని పురాణాలు చెప్పాయి. “స్నానం” అంటే “షవర్ బాత్” చేయడమో, “స్విమ్మింగ్ పూల్”లో చేయడమో కాదు. నదీప్రవాహ వేగానికి ఎదురుగా నడుము మునిగే వరకూ నిలబడి, కనీసం 48 నిమిషాల పాటు స్నానం చేయాలని విధి. అది కూడా సూర్యోదయానికి గంటన్నర ముందు కాలంలోనే చేయాలి. ఏమిటీ ఛాదస్తం అని విసుక్కోవద్దు. ఛాదస్తం కాదు, సైన్స్. నీటిలో విద్యుచ్చక్తి ఉందని సైన్సు చెబుతుంది. కానీ ఈ సైన్సు పుట్టుక ముందే ఈ సత్యాన్ని గుర్తించిన మన మహర్షులు బ్రాహ్మీ ముహూర్తాన్ని నదీస్నానానికి అనుకూల సమయంగా నిర్ణయించారు.
సూర్యోదయకాలం నుంచి, సూర్యాస్తమయం వరకూ ప్రసరించే సూర్యకిరణాలలోని విద్యుచ్చక్తిని నదీజలాలు, సాగర జలాలు తమలో నిక్షిప్తం చేసుకుంటాయి. తన వెండి వెలుగులతో జగతిని జ్యోత్స్నామాయం చేసే చంద్రుడు తన కిరణాలలోని అమృతత్త్వాన్ని, ఔశదీ విలువలను నదీజలాలకు అనుగ్రహిస్తాడు. నీటిలో వుండే ఈ అద్భుతశక్తులు … తిరిగి సూర్యకిరణాలకు పరావర్తనం చెంది అంతరించి పోతాయి. అందుకే సూర్యోదయానికి పూర్వమే స్నానం పూర్తి చేయాలనే నియమాన్ని విధించారు పెద్దలు. మరి “నడుము మునిగే వరకూ ఎందుకు నదీ ప్రవాహ వేగానికి ఎదురుగా ఎందుకు నిలబడాలి” అన్న సందేహం రావచ్చు. గర్భస్థ శిశువుగా ఉన్న పిండానికి నాభినాళం ద్వారానే జీవశక్తులు అన్డుతాయన్నది ఎవరూ కాదనలేని సత్యం. సాగర, నదీజలాలలో నిక్షిప్తమై వున్నా సౌరశక్తి, సోమశక్తులు, ఈ నాభినుంచి శరీరం గ్రహిస్తుంది. అందుకే నాభి మునిగే వరకూ నదిలో నిలబడి స్నానం చేయాలి. సముద్రానికి ప్రవాహం లేకపోయినా, ఉత్తుంగ తరంగాలు తమ తాకిడితో ఆ శక్తులను శరీరానికి అందజేస్తాయి. కనుకనే సముద్రుణ్ణి పూజిస్తూ చేసే నాలుగు స్నానాలలో “మాఘ పూర్ణిమ” స్నానం ముఖ్యమైనది.
సముద్రం, నదులు అందుబాటులో లేనివారి పరిస్థితి ఏమిటి? అనే సందేహం కలుగుతుంది. అలాంటి పరిస్థితిలో బావుల దగ్గరగానీ, చెరువుల వద్దగానీ “గంగ, సింధు, కావేరి, కృష్ణ, గౌతమి” నదుల పేర్లు స్మరిస్తూ స్నానం చేస్తే ఆయా నదుల్లో స్నానం చేసిన ఫలితం వస్తుంది. దేనికైనా భక్తి ప్రధానం. అది లేనప్పుడు ఎన్నిసార్లు కాకిలా మునిగి, కర్రలా తేలినా ఫలితం శూన్యం.
మాఘపూర్ణిమ స్నానఫలం :
– ఇంటిలోనే వేడినీళ్ళతో స్నానం చేస్తే ఆ సంవత్సరాలు శుభ్రంగా స్నానం చేసిన ఫలితం లభిస్తుంది.
– బావి నీళ్ళతో స్నానం చేస్తే, 12 సంవత్సరాల పుణ్యస్నాన ఫలితం వస్తుంది.
– చెరువులో స్నానం చేస్తే 24 సంవత్సరాల పుణ్యస్నాన ఫలం లభిస్తుంది.
– సాధారణ నదిలో స్నానం చేస్తే 96 సంవత్సరాల పుణ్యస్నానఫలం లభిస్తుంది.
– పుణ్యనదీ జలాలలో స్నానం చేస్తే 9,600 సంవత్సరాల పుణ్యస్నానఫలం లభిస్తుంది.
– సంగమస్థానాలలో స్నానం చేస్తే 38,400 సంవత్సరాల పుణ్యస్నానఫలం లభిస్తుంది.
– గంగానదిలో స్నానం చేస్తే 3 కోట్ల 84 లక్షల సంవత్సరాల పుణ్యస్నానఫలం లభిస్తుంది.
– ప్రయాగలోని త్రివేణీ సంగమంలో స్నానం చేస్తే … గంగా స్నానం వలన కలిగే ఫలితం కన్నా నూరురెట్లు అధికఫలం కలుగుతుంది.
– సముద్రస్నానం చేస్తే వచ్చే పుణ్యఫలాన్ని చెప్పడానికి మాటలు చాలవు.
ఈ మాఘమాసం మొత్తం పవిత్రస్నానాలు చేయడానికి వీలు కుదరకపోతే, మాఘమాసం చివరి మూడురోజులైనా పవిత్రస్నానాలు చేస్తే మంచి ఫలాన్ని పొందవచ్చు. చివర మూడుస్నానాలనూ “అంత్యపుష్కరిణీ స్నానాలు” అంటారు. సాధారణ స్నానం శరీర మలినాన్ని పోగొడితే, మాఘమాసం, మనసులోని మాలిన్యాన్ని పోగొట్టి మాధవుని సన్నిధికి చేరుస్తుంది.
మాఘమాసం చేస్తున్నప్పుడు :-
“దుఃఖదారిద్యనాశాయ శ్రీవిష్ణోస్తోషణాయాచ
ప్రాతః స్నానం కరోమ్యద్య మాఘేపాపవినాశనం
మకరస్దే రవౌ మాఘే గోవిందాచ్యుత మాధవ
స్నానేనానేన మే దేవ యథోక్త ఫలదో భావ”
అని పఠించి, మౌనంగా స్నానం చేయాలి, అంటే “దుఃఖములు, దారిద్ర్యము నశించుటకు పాపక్షయమగుటకు శ్రీవిష్ణుప్రీతి పూర్వకముగ ఈ పవిత్ర మాఘ స్నానము చేయుచున్నాను. కనుక ఓ గోవిందా! అచ్యుతా! మాధవా! ఈ స్నానమునకు యథోక్తఫలము అనుగ్రహించు” అని అర్థం.
ఆ తరువాత …
“సవిత్రే ప్రసవితే చ పరంథామ జలేమమ
త్వత్తేజసా పరిభష్టం పాపం యాటు సహస్రథా”
అని సూర్యునకు ఆర్ఘ్యప్రదానం చేయాలి. అంటే “ఓ పరంజ్యోతి స్వరూపుడా! నీ తేజస్సుచే నా పాపములు సర్వము వేయి తునాతునకలుగా వ్రక్కలై ఈ జలములందు బడి నశించుగాక” అని అర్థం.
ఈ విధంగా మాఘస్నానం చేసిన తరువాత, పితృతర్పణాది నిత్యకర్మలు పూర్తిచేసుకుని, ఇష్టదైవాన్ని ఆరాధించాలి. ఆ తర్వాత, దానధర్మాలు చేయాలి. వస్త్రములు, కంబలములు [దుప్పటిలు], పాదరక్షలు, గొడుగు, తైలము, నెయ్యి, తిలపూర్ణఘటము, బంగారము, అన్నము మొదలైనవి దానం చేస్తే మహాపుణ్యఫలం లభిస్తుంది. చేయగలితే సమర్థత, అవకాశం ఉన్నవారు “నేతితో తిలహోమం” చేస్తే మరింత పుణ్యం కలుగుతుంది.
తిలల[నువ్వులు]కున్న ప్రత్యేకత :
నువ్వులు అంటే సాక్షాత్తు శనైశ్చరునికి ప్రతిరూపమని, వాటిని తాకితేనే కస్టాలు చేరువ అవుతాయి అనే అపోహ మనలో చాలామందికి ఉంది. అది తప్పు.
శ్రీమహావిష్ణువు స్వేదబిందువులే “తిలలు” … అనగా నువ్వులు.
తిలలు సాక్షాత్తు విశ్నుస్వరూపాలు. ఇవి ఈశ్వర ప్రతీకాలు. అందుకే, శివునకు ఏకదశ రుద్రాభిషేకం చేసేటప్పుడు ప్రత్యేకంగా తిలలతో అభిషేకిస్తారు. తిలలకు అంతటి విశిష్టస్థానం వుంది. కనుక ఈ మాఘమాసం నెలరోజులూ ఒకవంతు చెక్కరకు, మూడువంతులు తిలలు కలిపి [1:3] శ్రీహరికి నివేదన చేసి, అందరికీ ప్రసాదంగా పంచిపెట్టమని శాస్త్రం చెబుతుంది.
మాఘపూర్ణిమనాడు “తిల పాత్రదానము” చేయడం బహుప్రశస్తము. ఈ దానము ఎలా చేయాలంటే, ఒక రాగి పాత్ర నిండుగా తిలలు పోసి, వాటిపైన శక్తికొలది సువర్ణము నుంచి –
“వాజ్మానః కాయజ త్రివిధ పాపనాశపూర్వకం
బ్రహ్మలోకా వాప్తి కామ స్తిల పాత్ర దానం కరిష్యే” అని సంకల్పించి –
“దేవదేవజగన్నాథ వంఛితార్ధ ఫలప్రద
తిలపాత్రం ప్రదాస్వామి తవాగ్రే సంస్థితో వ్యూహం”
అని శ్రీమహావిష్ణువును స్మరిస్తూ ఆ తిలపాత్రను ఒక బ్రాహ్మణునికి దానం యివ్వాలి. ఈ దానంతో మనోవాంఛితము నెరవేరునని శాస్త్రప్రమాణము. ఈ తిలపాత్ర దానము, జాతకరీత్యా శనిదోష, పీడా నివారణార్థం కాదని మాత్రం గుర్తుంచుకోండి.
ఆఖరిగా ఓ మాట : –
మాఘమాసం నెలరోజులూ పవిత్రస్నానాలు చేయాలనీ, ముఖ్యంగా మాఘపూర్ణిమనాడు సముద్రస్నానం చేయాలని, అందువలన కలిగే ఫలం అధికం అని చెప్పుకున్నాం కదా! పూర్ణిమకు సముద్రస్నానానికి ఏమిటి సంబంధం అనే సందేహం కలుగవచ్చు. ప్రతి పూర్ణిమకు, అమావాస్యకు సముద్రానికి “పోటు” ఎక్కువగా ఉంటుంది. “పూర్ణిమ” దైవసంబంధమైన తిథి … అమావాస్య పితృదేవతలకు సంబంధించిన తిథి. అందుకు ఈ పుణ్యతిథులలో సముద్రస్నానం చేయాలని శాస్త్రనియమం.
జ్యోతిష శాస్త్ర రీత్యా పూర్ణిమతిథినాడు రవి, చంద్రులు ఒకరికొకరు సమసప్తక కేంద్రగతులై పరస్పరం వీక్షించుకుంటారు. అమావాస్యనాడు రవి,చంద్రులు ఒకే కేంద్రంలో కలిసి వుంటారు. రవి, చంద్రులకు, సముద్రానికి ఉన్న సంబంధం
—– స్వస్తి—-
మాఘపురాణం – 15వ అధ్యాయం – శిష్యుడు పశ్చాత్తాపము పొందుట
సుబుద్ధియు అతని కుమార్తె ఆమె భర్త మొదలగువారు మాఘస్నానమువలన కలిగిన ఫలితముచే సమస్త దోషములు పోగొట్టుకొని సుఖించిరని సాంబశివుడు పార్వతికి తెలియజేయగా తిరిగి నీలకంఠుని పార్వతీ దెవి ఇట్లు ప్రశ్నించెను.
“నాధా! సుబుద్ధి కుమార్తె వృత్తాంతమును ఆమూలాగ్రముగ తెలియజేసితిరి. మరి సుబుద్ధి శిష్యుడగు సుమిత్రుడేమైనాడు? అతడే స్థితిలో నున్నాడు? వివరింపుడు. వినకుతుహలముగానున్నది” అని సాంబశివుని కోరినది. అందులకా పార్వతీపతి యిట్లు వివరించెను.
“సుమిత్రుడు గురువుగారి కుమార్తెతో సంభోగక్రీడలు దేలియాడినది మొదలు అతనికి ఘోర పాపమంటెను. తానూ
చేసిన పాపమునకు ఫలితమనుభవించుచుంటిని గదా యని పశ్చాత్తాప మనస్కుడై గురువు గారి వద్దకు పోయి గురువు పాదములపై పడి “గురువర్యా! నేను మహా పాపినైతిని. క్షణభంగురమైన తుచ్ఛ కామవాంఛకు లోబడిపోయి నీకుమార్తెయగు సుశీలతో కూడితిని. అయినను అది నాదోషము కాదు. నేను పూజాద్రవ్యములు తెచ్చుటకు అడవికి పోవుచుంటిని. దారియందున్న ఉద్యానవనంలో నీకుమార్తె చెలికత్తెలతో బంతులాడుచు నేను ఏకాంతముగా పోవుట చూచి నెమ్మదిగా నావెంట వచ్చినది. నేను అటు అడవి మధ్యకు పోయి ఒక కోనేటి వద్దనున్న చెట్టుక్రింద విశ్రమించగా నీకుమార్తె మెల్లమెల్లగా నాచెంత జేరి నన్ను మంచిమాటలతో వంచించి తన కామ వాంఛ తెలియజేసినది. నేనందులకు ఒప్పుకొనలేదు. నన్ను బలవంత పెట్టినది. నన్ను క్షమించమని చెవులు మూసుకొంటిని. ఇక లాభం లేదని “నాతొ నీవు క్రీడించకుందువేని నీ ఎదుటనే ప్రాణత్యాగ మొనరించుకొందును” అని చెప్పుసరికి నాకు భయము కలిగి నిజంగా ఆమె ప్రాణత్యాగమే చేసుకున్నచో మీరు నన్ను తప్పక దండించెదరని వెరచి ఆమెతో క్రీడించి, ఆమె వాంఛను తీర్చితిని. ఇందు ణా తప్పేమీ లేదు. ఐనను నేను మహాపాప మనుభవించుచున్నాను. నేను కూడా పాపరహితుడ నెటులకాగలనో సెలవిండ”ని బ్రతిమాలెను.
శిష్యుడు పలికిన మాటలు సుబుద్ధి విశ్వశించి, తన కుమార్తె వలె తన శిష్యుని గూడ పాపరహితుని జేయనెంచి సుమిత్రా! నీపాప కర్మకు ప్రాయశ్చిత్తమున్నది. నీవును మావలె పాపరహితుడవు కాగలవు. అదెటులనిన నీవు గంగానదీ తీరమునకు వెళ్ళి అచట పన్నెండు సంవత్సరాలు తపస్సు చేసుకొనుము. ఆ తపస్సుచే కలుగు ఫలితము వలన పాపము మబ్బు విడిపోయినటుల నశించిపోవును. అప్పుడు నీవు ముక్తుడగుదువు అని శిష్యునితో జెప్పెను.
“ధన్యోస్మి ధన్యోస్మి” మీయాజ్ఞ ప్రకారము నేనిప్పుడే ప్రయాణ సన్నద్ధుడనగుచున్నాను” అని గురువర్యులకు దండ ప్రమాణములాచరించి గంగానదీ తీరమునకు బయలుదేరెను.అటుల ప్రయాణమై సాగిపోవుచుండగా మార్గమధ్యమున గుట్టలు, కొండలు, సెలయేళ్ళు దాటి ఒక అరణ్య మధ్యమునకు వెడలెను. అచట మనోహరమైన ఆహ్లాద మొనరించు దృశ్యములు కనిపించినవి. కౄరమృగములు సాధుజంతువులు కలసిమెలసి తిరుగుచున్నవి. మయూరములు, సర్పములు విచ్చలవిడిగా తిరుగుచున్నవి. పరస్పర వైరుధ్యములు ఏ మాత్రము కనిపించలేదు. అచట ప్రకృతి రమణీయత మనస్సునకానంద మొనరించుచున్నది. అట్టి ప్రాంతమందు ప్రయాస బడలిక తీర్చుకొందమని ఒక వటవృక్షము క్రింద విశ్రమించి నలుదిశల పరికించి చూడగా ఒక ఆశ్రమము కనిపించినది.
వెంటనే లేచి ఆయాశ్రమం వద్దకు వచ్చి తొంగిచూడగా ఆయాశ్రమములో కొంతమంది పురుషులు, స్త్రీలు, బాలికలు కాషాయాంబరములు ధరించి రుద్రాక్షమాలలను త్రిప్పుచు శ్రీమన్నారాయణుని ఫలపుష్ప ధూపదీప నైవేద్యములతో పూజించుచు మాఘపురాణ పఠనం చేయుచుండిరి. మధ్యమధ్య శ్రీహరి విగ్రహంపై అక్షతలు వేసి “హరిహరీ”యని బిగ్గరగా కేకలు వేయుచు భక్తి శ్రద్ధలతో ఆనందోత్సాహములతో పూజ చేయుచుండిరి. ఆ దృశ్యమంతటినీ సుమిత్రుడు కనులార గాంచెను. పూజ పూర్తయిన తరువాత ప్రసాదం అందరూ సేవించిరి. బైట కూర్చుని వున్న సుబుద్ధికి కూడా ప్రసాదమివ్వగా “స్వామీ! మీరాచరించిన వ్రతమెట్టిది? దీనివలన ఫలితమేమి కలుగును? మనుజుడు పాపరహితుడగునా? ఈ నా సందియములను తీర్పవేడుచున్నాను” అని వినయవిగా ఆ మునిసత్తముల నడిగెను.
పాపములచే పీడింపబడుచున్న సుమిత్రుని ప్రార్థన విని అచ్చటనున్న మనుజులందరూ మాఘమాసమందాచరించవలసిన ధర్మములను అతనికి వివరించుటకు గాను వారిలో నొకరిని నియమించిరి. అంత ణా మునికుమారుడు సుమిత్రునితో మాఘమాస మహాత్మ్యమును ఇట్లు వివరించెను. “విద్యార్థీ! మేము చేసినది మాఘమాసమందాచరించవలసిన మాఘమాస వ్రతము. ఈ వ్రతము చేయుటవలన ఎటువంటి పాపములు చేసిననూ, వాటినన్నింటినీ నశింపచేయును. అనగా రౌరవాది నరక బాధలు వెంటాడుచున్నప్పటికిన్నీ ఈ వ్రతము చేసినంత మాత్రమున అవియన్నియు పెనుగాలికి ఎండుటాకులు ఎగిరిపోవునట్లుగా, పాపము లన్నియు నశించిపోవుట, మాఘమాసములో సూర్యుడు మకరరాశిలో వుండగా ఆదినము సూర్యోదయ సమయమందు ఒక నదియందు ఏమనుజుడు స్నానం చేయునో అట్టి మనుజుడు శ్రీహరికి ప్రియుడగును.
ఎట్టి దోషము లేకుండా శ్రీహరిని పూజిస్తూ మాఘపురాణమును వినుచు ఆ మాసమంతయు నదీస్నాన
మొనర్చువారు వైకుంఠ వాసులగుదురు. అలాగున చేయనివాడు, అసత్యంలాడువాడు, పెద్దలను, గురువులను గౌరవించనివాడు, భక్తులను చూచి ఎగతాళి చేయువాడు, పరస్త్రీలను బలాత్కరించి చెరుచువాడు, చోరత్వము చేయువాడు, బ్రహ్మహత్య చేయువానితో సమానుడు. అటులనే ఇండ్లు తగులబెట్టుట, అబద్ధ సాక్ష్యములు చెప్పుట, జన సమర్ధముండు చోట మలమూత్రములను విడచుట, గుర్రములను పశువులను కన్యలను ఇతరులకమ్ముట, మొదలగునవి చేయువారు కూడా బ్రహ్మహత్య చేసినవారితో సమానం. మరియు దైవసంబంధమగు ధనమును అపహరించు వాడు, ఏ పుణ్య దినములలోనైన శుచిగా స్నానము చేసి దేవుని ప్రార్థించనివాడు, దానమిచ్చెదనని వాగ్దానము చేసి ఇవ్వనివాడు, బంగారము వెండి రత్నములు సాలగ్రామములు దొంగిలించు వాడును, జాతి భ్రష్టులై జార చోరత్వములు చేసి వేశ్యయింటికి తిరుగువాడు,వీరందరూ బ్రహ్మహత్యాది మహాపాతకములు చేసినవారితో సమానులగుదురు.
ఇవిగాక అన్నభార్యను సోదరుని భార్యను, గురువు భార్యను, స్నేహితుని భార్యను కూడి రతి సల్పువాడును, తనకన్న వయసులో పెద్దయగు స్త్రీతో రతి సల్పువాడును, జీవహింసలు చేయువాడును, బీదప్రజలను హింసించువాడును, దోపిడీలు చేయువాడును మహాపాతకులు. అట్టివారు కూడా బ్రహ్మహత్య చేసినవారితో సమానుడు. ఇవిగాక తల్లిదండ్రులను హింసించు వాడును, వివాహ సంబంధములు చెడగొట్టు వాడును, నోరులేని పసిపాపల దొంగిలించి ఇతరులకు అమ్మువాడును, శరణు జొచ్చిన వానిని దండించు వాడును, ధర్మ కార్యములకు విఘ్నములు కలిగించు వాడును, పరధనం అపహరించు వాడును, చేసిన మేలు మరచిన కృతఘ్నుడును తానూ తీర్థయాత్రలు చేయక అట్లు చేసిన వారిని జూచి ఎగతాళి చేయువాడును బ్రహ్మహత్య చేసిన వానితో సమానుడగును.
గాన మేము ఆచరించిన వ్రతం మాఘమాస వ్రతం. ఈ వ్రతం చేయుట వలన మాకు ఏ మాత్రమూ పైన చెప్పిన మహాపాతకములలో ఏ ఒక్కటి వున్ననూ అవి నశించిపోవును. ఇది ముమ్మాటికీ నిజం. అందుచేతనే మేమందరం మాఘమాసవ్రతం భక్తిశ్రద్ధలతో ఆచరించుచున్నాము. మాఘమాసం ప్రారంభం కాగానే సూర్యుడు ఉదయించిన కొద్దిసేపటికి నదికిపోయి స్నానం చేసి సూర్యునికి నమస్కరించి, నీళ్ళు విడువవలెను. తరువాత విష్ణుమందిరమునకు పోయి శ్రీహరికి పూజచేసి తులసితీర్థము ప్రసాదం పుచ్చుకోవలెను. ఆవిధంగా మాసాంతము వరకు ఏ మనుజుడు ఆచరించునో అట్టివాడు అశ్వమేధయాగము చేసినంత ఫలితం కలుగును. మాఘమాసమునకు శ్రీహరియే అధిదేవత. గాన యీ మాసమందు ఆచరించిన స్నానం వలన కల్గు ఫలము నిచ్చువాడు అతడే గనుక ఆ వైకుంఠవాసుడగు శ్రీహరిని పూజించవలెను. శ్రీమన్నారాయణుడు ఒకవేళ నదీతీరమునందు గానీ, చెరువు దగ్గరగానీ విష్ణుమందిరము లేకపోయినచో విష్ణు మూర్తి విగ్రహమును గాని విష్ణు పటమును గాని తీసుకువెళ్ళి నదీతీరమందు తులసీదళంతోను కస్తూరి గంధం, అగరు ధూపదీప నైవేద్యం, ఫలపుష్ప తాంబూలాదులతో పూజించి పురాణ శ్రవణము గావించవలయును.
ఈవిధముగా మాఘమాసమంతా చేసి మాసాన్తమున ఒక సద్బ్రాహ్మణునకు వస్త్రములు, బంగారము దక్షిణ ఇచ్చి సంతృప్తిగా పిండివంటలతో భోజనము పెట్టాలి. ధనమున్న వారు బ్రాహ్మణ సమారాధన చేసినయెడల ముక్కోటి దేవతలు సంతసించుటే గాక యముడు తన దూతలను పంపజాలదు. పునర్జన్మ కలుగదు. ఈ ణా వచనముల్ అసత్యములు కావు. ఇప్పటివరకూ మాఘస్నాన ఫలితమంతయు విన్నావు గదా! ఇక మాఘమాసం మూడు దినాలు మాత్రమే వున్నది. గాన ఈ మూడు దినములలోను ఈ నదిలో స్నానము చేసి పూజా కార్యక్రమమునకు సంసిద్ధుడవు కమ్ము” అని మునీశ్వరుడు తెలియజేసెను.
అంత సుమిత్రుడు తన గురువగు సుబుద్ధి తన పాపపరిహార్ధము గంగానదీ తీరమునకు పోయి తపస్సు చేసుకోమని చెప్పినారు. అని మునీశ్వరునితో చెప్పగా – మరల ఆ ముని యిట్లు చెప్పినాడు.
“నీ గురువు చెప్పిన విషయం యదార్థము నీ గురువు పుత్రికతో గూడి రతి సల్పినావు. అందు నీదోషమేమియు లేకున్ననూ మహాపాపము మాత్రము సంక్రమించినది. అది నిన్ను వెంటాడుచునే యున్నది. తరుణోపాయము చేయనిచో ఈజన్మలోను మరుజన్మలోను కూడా నరకబాధలు తప్పవు. గాన ఆమాఘమాసమందలి మూదిదినములయినను స్నానముచేసి, శ్రీహరిని పూజించుము. తరువాత నీవు గంగా తీరమునకుపోయి నీ గురువు చెప్పినవిధంగా భక్తితో తపస్సు చేసినయెడల నీవు జన్మ రాహిత్యమును పొందగలవు. మానవుని మనస్సు వార్ధము, చంచల భావము గలది. నీవు ఇంద్రియాలన్నింటిని బంధించి ఏకాగ్ర చిత్తముతో లక్ష్మీ నారాయణుని ధ్యానించుము” అని ఉపదేశించగా సుమిత్రుడు అచ్చట మూడి దినములుండి మాఘస్నానములు చేసి నదీతీరమందు విష్ణువును పూజించి పురాణ పఠనమును గావించెను. తదనంతరము ఆ ఆశ్రమ వాసులకు నమస్కరించి గంగా నదీ తీరమునకు తపస్సు చేయుటకై వెళ్ళిపోయెను.
మాఘ పురాణం – 16వ అధ్యాయం ఆడకుక్కకు విముక్తి కలుగుట
దిలీప మహారాజా! సుమిత్రుని కథ ఈశ్వరుడు పార్వతీదేవి చెప్పిన రీతిగా విన్నావు కదా! ఇంకొక కథను పార్వతికి ఈశ్వరుడు ఈవిధముగా చెప్పెను. అదెట్లన –
మాఘమాసములో మాఘస్నానములు చేయువాడు గొప్ప ధనశాలి యగును. వర్తమాన కాలమందు ఎన్ని కష్టములు అనుభవించుచున్నప్పటికీ మాఘస్నానం మొదలిడిన తరువాత వారి కష్టములు క్రమేపీ సమసిపోవును. మాఘశుద్ధ దశిమనాడు నిర్మలమైన మనస్సుతో శ్రీమన్నారాయణుని పూజించిన యెడల శ్రీహరి కటాక్షమునకు పాత్రుడగును. అందులో అణుమాత్రమైననూ సంశయం లేదు. అని పార్వతీదేవితో శంకరుడు వివరించుచుండగా పార్వతి మరల ఇట్లు పలికెను.
“నాదా! శ్రీలక్ష్మీ నారాయణుల వ్రతము చేసినయెడల మనోవాంఛాఫలసిద్ధి కలుగునని చెప్పియుంటిరి గదా! ఆ వ్రాత విధానమెట్టిదో ఎటుల ఆచరించవలెనో వివరంగా తెలియపరచు’డని పార్వతీదేవి పరమేశ్వరుని కోరింది.
అంత మహేశ్వరుడు పార్వతితో ఇట్లు చెప్పసాగెను. “మాఘ శుద్ధ దశమినాడు ప్రాతః కాలమున కాలకృత్యములు తీర్చుకొని స్నానం చేసి నది ఒడ్డున గాని, ఇంటివద్ద గాని, మంటపము వుంచి, ఆ మంటపమును ఆవుపేడతో అలికి పంచారంగులతో మ్రుగ్గులు పెట్టి మంటపం మధ్య ఎనిమిది రేకుల పద్మము వేసి, అన్నిరకాల పుష్పములు ఫలములు తీసుకువచ్చి లక్ష్మీనారాయణులను మంటపపు మధ్యమున వుంచి గంధం, కర్పూరం, అగరు మొదలగు ద్రవ్యములు విగ్రహాలకు రాసి పూజించవలెను. రాగి చెంబులో నీళ్ళు పోసి, మామిడి చిగుళ్ళను వుంచి దానిపై కొబ్బరికాయ పెట్టి, క్రొత్త వస్త్రము నొకదానిని కప్పి లక్ష్మీనారాయణుల ప్రతిమ ప్రతిష్ఠించి పూజించవలెను. ఆ మంటపపు మధ్యలో సాలగ్రామమును వుంచియొక సద్బ్రాహ్మణుని ఆహ్వానించి వారిచేత పంచామృత స్నానం చేయించి తులసి దళము తోను, పుష్పాలతోను పూజించి ధూపదీప చందనాగరు పరిమళ వస్తువులుంచి నైవేద్యము చెల్లించవలెను.
తరువాత రాగిపాత్రలో నీరుపోసి అర్ఘ్యప్రదానమివ్వవలెను. అటు తరువాత సూర్యనారాయణ స్వరూపుడగు శ్రీరామచంద్ర ప్రభువును మదిలో ధ్యానించవలెను.
మాఘమాసస్నానం చేయువారు వారి తల్లిదండ్రులు బంధుమిత్రుల సమక్షంలో మాఘమాస వ్రతము చేయవలయును. ఒక సద్బ్రాహ్మణునకు బియ్యము, బెల్లము, ఉప్పు, పప్పు కాయగూరలు పండ్లు మొదలగునవి ఒక పాత్రయందు ఉంచి గాని, క్రొత్త గుడ్డలో మూటగట్టి గాని, దానమియ్యవలయును. మాఘపురాణమును స్వయముగా పఠించునపుడు గాని, లేక వినునప్పుడు గాని చేతిలో అక్షతలు వుంచుకొని భక్తితో శ్రీమన్నారాయణుని ధ్యానించుకొని కొన్ని అక్షతలు భగవంతునిపై వుంచి మరికొన్ని అక్షతలు తలపై వేసుకోవలయును. గాన ఓ శాంభవీ! మాఘస్నానం చేసి మాఘశుద్ధ దశమినాడు లక్ష్మీనారాయణులను నిష్ఠతో పూజించిన యెడల ఎటువంటి మహాపాపములైనను నశించిపోవును. ఇందులకొక ఉదాహరణ కూడా తెలియజేసెదను. సావధానురాలవై వినుము.
గౌతమమహర్షి ఒకనాడు తన శిష్యులతో గూడి తీర్థయాత్రలు చేయుటకై ఉత్తరదిశకు బయలుదేరాడు. వారు అనేక పుణ్యనదులలో స్నానములు చేయుచు ప్రసిద్ధ క్షేత్రములను దర్శించుచు మార్గమందున్న మునిపుంగవులతో ఇష్టాగోష్టులు జరుపుకొనుచు ప్పటికి మాఘమాసము ప్రవేశించుట వలన కృష్ణానదిలో స్నానము చేయవలయునని ఆ ప్రాంతమునకు వచ్చి విడిది చేసిరి. గౌతమముని తన శిష్యునితో గూడి కృష్ణా నదిలో సూర్యోదయ సమయంలో స్నానం చేసి తీరముననున్న ఒక రావిచెట్టు వద్దకు వచ్చి
శ్లో!!మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణే!
అగ్రతశ్శివ రూపాయ వ్రుక్షరాజాయ తే నమః!!
అని రావిచెట్టుకు నమస్కరించి ఆ చెట్టు మొదట ఆసీనులయి శ్రీహరిని విధియుక్తముగా పూజించిరి. తరువాత శిష్యులందరికీ మాఘమాస ప్రభావమును వినిపించిరి. ఈవిధముగా ప్రతిదినము ఆచరించుచుండగా మాఘశుద్ద దశమినాడు ఆ చెట్టు మొదట మండపమేర్పరచి మ్రుగ్గులు, బొట్లు పెట్టి మామిడాకు తోరణాలు కట్టి అలంకరించారు. ఆ మంటపము మధ్యలో శ్రీహరి చిత్రపటం వుంచి పూజించినారు. ఆవిధంగా పూజించుచున్న సమయంలో ఒక ఆడకుక్క వచ్చి భగవంతునికి చేయుచున్న పూజావిధానమంతయు రెప్పవాల్చకుండా దీక్షతో చూచుచు ఆ రావిచెట్టునకు ఎదురుగా కూర్చొని ఉండెను. శిష్యులు వారి వద్దనున్న దండముతో దానిని బెదిరించిరి. ఆ కుక్క అచటినుండి లేచి ఉత్తర దిశవైపు మళ్ళీ మరల తూర్పు తిరిగి, ఆ వైపునుండి దక్షిణ దిశకు కడలి మరల యధాప్రకారం పడమటి దిశలోనే కూర్చుండెను. శిష్యులు మరల బెదరించిరి. ముందు చేసినతులే రెండవసారి కూడా ఆ మండపం చుట్టూ తిరిగి వచ్చెను. శిష్యులు ఆ మంటపం చుట్టూ ప్రదక్షిణ చేసినందున అది మాఘమాసము అయి ఉన్నందున వెంటనే ఆ కుక్క రూపము వదలి ఒక రాజుగా మారిపోయాడు. ఆ రాజు సకలాభరణాలు ధరించిన వాడై మునుల ఎదుట నిలబడి మునులందరికీ నమస్కరించెను. అక్కడ నున్న ఆ కుక్క రాజుగా మారిపోవుట, చూచినా మునులు గౌతమ మహర్షి కూడా అమితాశ్చర్యం నొందిరి.
ఓయీ! నీవెవ్వరవు? నీవిట్లు మారుటకు కారణమేమి? అని గౌతముడు ప్రశ్నించాడు. మునిచంద్రమా! నేను కళింగరాజును. మాది చంద్రవంశం. నా పేరు జయచంద్రుడు. నాకు అన్ని విద్యలయందునూ ప్రావీణ్యం గలదు. నాదేశ ప్రజలను ధర్మమార్గమున పరిపాలన చేయుచూ వున్నాను. దానధర్మములనిన నాకు అతిప్రేమ. నేను అనేక దానాలు చేసియుంటిని. గోవు, భూమి, హిరణ్య సాలగ్రామదానాలు కూడా చేసియున్నాను. ఎక్కువగా అన్నదానం తిలదానం చేసియున్నాను. అనేక ప్రాంతములలో చెరువులు త్రవ్వించినాను. నూతులు త్రవ్వించి బాటసారులకు నీడనిచ్చు నిమిత్తం అన్నసత్రములు మంచినీటి చలివేంద్రములు మరెన్నో పుణ్యకార్యాలు చేసియున్నాను. అనేక దేవాలయాలను నిర్మించి దైవ విగ్రహాలను ప్రతిష్ఠించినాను. సద్బ్రాహ్మణుల చేతను, వేదాలు చదువు పండితుల చేతను ఎన్నో క్రతువులు చేయించినాను. పురాణాలలో వున్న అన్ని ధర్మాలను చేసియున్నాను. కాని నేనిలా కుక్కనయ్యాను. దానికి కారణం లేకపోలేదు. ఆ కారణం కూడా మీకు విశదపరచెదను వినుడు.
ఒకానొక దినమున ఒక మునిపుంగవుడు గొప్ప యజ్ఞ మొకటి తలపెట్టాడు. యజ్ఞంచేయాలన్న సామాన్య విషయం కాదు కదా! దానికి కావలసిన దానం వస్తుసముదాయం చాలా కావలెను. గాన ఆ మునిపుంగవుడు నావద్దకు వచ్చి అర్ధించెను. మునిసత్తముడు వచ్చిన వెంటనే ఎదురేగి కాళ్ళు కడిగి ఆ నీళ్ళు నా శిరస్సుపై జల్లుకొని కుశల ప్రశ్నలడిగితిని. మునియు మిక్కిలి సంతసించి రాజా! నీకు గుప్త విషయములు తెలియజేయుదును. ఈ మాసములో మకరరాశియందు సూర్యుడు ప్రవేశించును. ఆ దినము సూర్యోదయం అయిన తరువాత నీవు స్నానం చేసి భక్తి శ్రద్ధలతో మాఘమాస మహాత్యము చదవుటగాని, లేక వినుగా గాని చేయుము. దానివలన నీకు వైకుంఠ ప్రాప్తి కలుగును. అంతియేగాక అశ్వమేధ యాగం చేసినయెడల ఎంతటి ఫలితము కలుగునో అంతటి ఫలము గాని, తీర్థ స్నానాలు చేయగా వచ్చిన ఫలము గాని లేక దాన పుణ్యములు అనగా పంచ యాగాలు చేసినంత ఫలము గాని పొందగలవు. మాఘ శుద్ధ సప్తమీ ఆదివారం వచ్చినగాని, దశమీ ఆదివారం వచ్చిన గాని, ఉదయమే స్నానం చేసినాను మరియు మాఘ పౌర్ణమి రోజు ఉదయమున స్నానము చేసినచో మానవుడు ఎటువంటి పాపములనైనను విడువగలడు.
ఒకవేళ ఇతర జాతుల వారైననూ మాఘమాసమంతటా నిష్ఠతో నదీ స్నాన మాచరించి దానధర్మాలు మాఘ పురాణము పఠించినను లేక వినినను మరుజన్మలో బ్రాహ్మణుడై జన్మించును. అని ఆ మునివర్యుడు నాతో చెప్పగా నేను అతనిని అవమానించినటుల మాటలాడి ఇట్లంటిని.
“అయ్యా మునిసత్తమా! మీరు పలికిన విషయములు నాకు తెలియును. అవన్నియు బూటకములు. వాటిని నేను యధార్ధములని అంగీకరింపను. ఏవో అతిశయోక్తులు తప్ప మరొక్కటి కాదు. గాన నేను మాఘస్నానములు చేయుటగాని, దాన పున్యాదులు జేయుట గాని, పూజా నమస్కారములు ఆచరించుట గానీ చేయను. చలిదినములలో చన్నీళ్ళు స్నానములు చేయుట ఎంతకష్టము! ఇకనాకు ఈ నీతి బోధలు చెప్పకుడు నాకున్న ఫలము చాలు” అని ఆ మునితో అంటిని.
ణా మాటలకు మునికి కోపం వచ్చినది. ముఖం చిట్లించుకొని సరే, నేను చెప్పవలసినది చెప్పితిని. అది ణా ధర్మము అని యజ్ఞమునకు కావలసిన ధనమును తీసుకోకుండా వెడలిపోయినాడు.
అంతట నేను ఆ ముని చేతులు పట్టి బ్రతిమలాడగా ఎట్టకేలకు ముని అంగీకరించి ధనము తీసుకొని పోయెను. ఆవిధంగా నేను కొంతకాలము రాజ్యమేలి ప్రాణములు విడిచితిని. తరువాత నాకు కుక్క జన్మయే వచ్చినది. నా పాపఫలమేమో గాని కుక్కగా ఏడుజన్మలూ బాధపడితిని. ఇప్పుడు మీరు చేయు పూజాస్తాలము చుట్టూ మూడు పర్యాయములు ప్రదక్షిణాలు చేసితిని గాని ణా పూర్వజన్మ నాకు కలిగినది. దైవయోగమున ఎవ్వరునూ తప్పించలేరు కదా! ఇటుల కుక్క జన్మతో వుండగా మరల నాకు పూర్వజన్మ ఎటుల సంక్రమించినదో వివరింప వేడెదను” అని రాజు పలికెను.
ఆ రాజు చెప్పిన వ్రుట్టాన్తమునకు ఆ ముని ఆశ్చర్యపడి మాఘ మాసమును నీవు చులకనగా చూచుట వలన ఎంతటి విపత్తు గతిల్లెనో అనుభవమే చెప్పుచున్నది. నీవద్దకు వచ్చిన ముని సత్తముడు ఉత్తముడు. అతడు పలికిన విషయములన్నియు యధార్థములే. నీవు కుక్కవై ఎటుల పవిత్రుడవైతివో ఆ వృత్తాంతమును వివరించెదను. సావధానుడవై ఆలకింపుము.
నేను నా శిష్యులతో ఈ మాఘమాసమంతయు కృష్ణవేణీ తీరమందుండిన కృష్ణా నదిలో మాఘమాసమంతయు స్నానములు, జపములు చేసి తిరిగి మరొక పున్యనడికి పోవుదామని వచ్చి యుంటిమి. మేమందరమూ ఈ వుర్క్ష రాజము క్రింద విష్ణు విగ్రహాన్ని పట్టి పూజించుకొనుచున్నాము. కుక్క రూపంలోనున్న నీవు దారినిపోతూ ఇచ్చటి నైవేద్యమును చూసి తినవలయుననెడి ఆశతో పూజ సమీపమునకు వచ్చి కూర్చుంటివి. అప్పుడు నీవు ఎలాగున్నావో తెలుసా! నీశరీరము బురద మైల తగిలి వున్నది. చూచుటకు చాలా అసహ్యంగా వున్నావు. పరిశుద్ధమై భగవంతుని పూజ చేయుచున్న సమయములో అచటకు జంతువూ గాని, పక్షి గాని వచ్చియున్న దానిని తరిమివేయుట సహజమే కదా! నీవు అసహ్యంగా ఉన్నందున శిష్యులు నిన్ను తపోదండంతో తరిమిరి. నైవేద్యం తినవలయుననెడి ఆశతో ఈ మండపం చుట్టూ తిరిగి యధాస్థానమునకు వచ్చి కూర్చుంటివి. మరల ణా శిష్యులు నిన్ను కొట్టబోవుటచే తిరిగి మళ్ళీ వచ్చినావు. అట్లు మూడు పర్యాయములు తిరుగుటచే భగవంతుడు నీ రూపమును మార్చి నిజరూపమును ప్రసాదించినాడు. అనగా మాఘమాస ఫలం భగవంతుని మండపం చుట్టూ తిరగడం వలన పునర్జన్మ వచ్చినదన్నమాట. ఇక మాఘమాసమంతాయూ నదిలో స్నానం చేసి భగవంతుని ధ్యానించి పురాణ పఠనం చేసినచో ఎంతటి ఫలం వచ్చునో ఊహించుకొనుము అని గౌతమ ఋషి చెప్పగా రాజు మిగుల సంతోషించి గౌతమ ఋషికి అతని పరివారమంతటికీ నమస్కరించు చుండగా అంతలో ఆ రావిచెట్టులో నున్న ఒక తొర్రనుండి ఒక మండూకం బైటకు వచ్చి గౌతమ ఋషి పాదములపై బడి బెక బెకమని అరచి అటు ఇటు గెంతుచుండెను. హఠాత్తుగా కప్పు రూపమును వదలి ముని వనితగా మారిపోయెను.
ఆమె నవ యౌవనవతి అతి సుందరాంగి. ఆమె గౌతమ ఋషిని చూడగానే తనకు జ్ఞానోదయమై పూర్వజన్మ వృత్తాంతమంతయు జ్ఞప్తికి వచ్చ్సినది. అంత గౌతమ ముని అమ్మాయీ! నీవెవ్వరి దానవు? నీ నామధేయమేమి? నీ వృత్తాంతం తెలియజేయుము అని ప్రశ్నించిరి. గౌతమ మునిని చూడగానే తన పూర్వ జన్మ వృత్తాంతం తెలియుటచే ఇట్లు చెప్పదొడంగెను.
మాఘపురాణం – 17వ అధ్యాయం కప్పరూపము వదలిన స్త్రీ తన వృత్తాంతమును చెప్పుట
మునిశ్రేష్ఠా! నా వృత్తాంతమును తెలియజేయుదును. కావున ఆలకింపుము. నా జన్మస్థానము గోదావరి నదికి సమీపమందున్న ఒక కుగ్రామము. నా తండ్రి పేరు హరిశర్మ. నా పేరు మంజుల. నన్ను నా తండ్రి కావేరీ తీర్థ వాసియగు జ్ఞానానందుడను వానికిచ్చి పెండ్లి చేసెను. అతడు దైవభక్తుడు, జ్ఞాని, నిగర్వి. మాకు వివాహమైన వెంటనే అతని వెంట కాపురమునకు వెళ్ళినాను. మరికొన్నాళ్ళకు మాఘము ప్రవేశించినది. ఒకనాడు నా భర్త సఖీ! మాఘమాసము ప్రవేశించినది. మాఘమాసము చాలా పవిత్రమైనది. దీని మహత్తు చాలా విలువైనది. నేను నా చిన్నతనమునుండీ ప్రతి సంవత్సరమూ మాఘస్నానములు చేయుచున్నాను. నీవు నా భార్యవు గావున నీవును ఈ మాఘమాసమంతయు యీ కావేరీ నదిలో స్నానమాచరించుము. ప్రతిదినము ప్రాతఃకాలము నిద్రనుంచి లేచి కాలకృత్యాలు తీర్చుకొను సమయమునకు తెల్లవారి సూర్యోదయమగును. సూర్యుడు ఉదయించిన వెంటనే నదికి పొమ్ము. నదిలో స్నానం చేయుము. ప్రభాత సూర్యునికి నమస్కరించిన తరువాత నది ఒడ్డున విష్ణువు యొక్క చిత్రపటము పెట్టి పువ్వులతోను, మంచి గంధము అగరు, ధూపదీపములను వెలిగించి, స్వామికి ఖండశర్కర పటిక బెల్లం నైవేద్యము ఇచ్చి నమస్కరింపుము. తరువాత తులసి తీర్థము లోనికి పుచ్చుకొని తలకు రాసుకొనుము. మన కుటీరమునకు వచ్చి మాఘ పురాణమును రోజుకొక అధ్యాయము చొప్పున పఠించుము. దీనివలన నీకు చాలా ఫలము కలుగును. నీ ఐదవతనము చల్లగా ఉండును అని హితబోధ చేసెను.
నేను అతని మాటలను వినిపించుకోక రుసరుసలాడి అతనిని నీచముగా చూచితిని. నా భర్త శాంత స్వరూపుడు. అయిననూ నేను హద్దుమీరి మాటలాడుటచే అతనికి కోపం వచ్చి శపించినాడు. ఓసీ మూర్ఖురాలా! నా ఇంటికి వచ్చి నా వంశాన్ని ఉద్ధరిస్తావనుకున్నాను. ఇంత దైవద్వేషివని నాకు తెలియదు. నీవిక నాతో నుండ తగవు. మాఘమాస వ్రతము నీకింత నీచంగా కనిపించినదా? సరియే. నీ పాపము నిన్నే శిక్షించును. కావున నీవు కృష్ణానదీ తీరమునందు ఉన్న రావిచెట్టు తొర్రలో మాండూక రూపంలోనుందువు గాక! అని నన్ను శపించెను.
వారి సింహగర్జనకు వణికిపోయితిని. వారి శాపమునకు భయపడి పోయితిని. వారి రౌద్రాకారమును చూడజాలక పోతిని. నాకు జ్ఞానోదయము కలిగినది. నాతప్పు నేను తెలుసుకున్నాను. “అన్నా! ఎంతటి మూర్ఖత్వముగా ప్రవర్తించితిని” అని పశ్చాత్తాపము కలిగినది. వెంటనే భర్త పాదములపై బడి రెండుపాదాలు పట్టుకొని “నాకీ శాపము ఎట్లుపోవును? మరల నిన్నెటుల కలుసుకొందును? నాకు ప్రాయశ్చిత్తము లేదా ని పరిపరివిధాల ప్రార్థించగా ణా భర్త కొంత తడవాలోచించి ఒక గడువు పెట్టెను. అది ఏమనగా గౌతమమహర్షి గోదావరీ నదీతీరమందున్న తన యాశ్రమమునుండి ఉత్తరదేశ యాత్రలు చేయుటకు బయలుదేరి తిరిగి మాఘ శుద్ధ దశమినాటికి కృష్ణానదీ స్నానము చేయుటకు వచ్చెదరు. అలాంటి సమయములో నీవు వారిని దర్శించినయెడల ఆ మహర్షి ప్రభావము వలన నీకు నిజరూపము కలుగును” అని చెప్పుచుండగా నేను కప్పరూపము దాల్చితిని. నాభర్త కూడా నా మూర్ఖత్వమునకు విచారించెను. నేను కప్పు రూపముతో గెంతుకుంటూ కొన్ని దినాలకు కృష్ణానదీ తీరాననున్న ఈరావి చెట్టు తొర్రలో నివాసమేర్పరచుకొని జీవించుచూ మీరాకకోసం ఎదురుచూచుచుంటిని. ఇది జరిగి ఎంతకాలమైనదో నాకు తెలియదు” అని తన వృత్తాంతము గౌతమమునికి తెలియజేసెను.
“అమ్మాయీ! భయపడకుము. నీకీ శాపము కలిగి వెయ్యేండ్లు పైగా అయినది ఇంతకాలము నీవు అనేక కష్టములు పడి వెయ్యేండ్లు నీ భర్తయును ఏకాంతముగా చాలా కాలము జీవించి హరినామ సంకీర్తనలు చేయుచు మృతుడయ్యెను. అతడిప్పుడు వైకుంఠములో వున్నాడు. నీవు తన మాటలు విననందున ఎంత కష్టపడినావో తెలిసినది గదా! మాఘమాస ప్రభావం అసామాన్యమైనది. సకల సౌభాగ్యాలు, పుత్రసంతతి ఆరోగ్యము కలుగుటయే గాక మోక్ష సాధనమైనట్టిది కూడా. దీనికి మించిన మరియొక వ్రతము లేదు. విష్ణుమూర్తికి ప్రియమైనదీ వ్రతము. ఇటువంటి వ్రతమాచరింపుమని నీభర్త యెంత చెప్పిననూ వినిపించుకొనవైతివి. నీభర్త దూరదృష్టిగల జ్ఞాని. అతని గుణగణాలకు సంతసించెడి వారు. నిన్ను పెండ్లియాడిన తరువాత తన వంశాభివృద్ధి చేసుకొనవలయుననెడి ఆశతో నుండేవాడు. కానీ నీవలన అతనికి ఆశలన్నీ నిరాశాలై పోయినవి. నీ మూర్ఖత్వము వలన నీ భర్తకు కోపము కలిగి నిన్ను శపించవలసి వచ్చెను. నిన్ను నీళ్ళలో స్నానం చేయమన్నాడు. నీవు చేయనన్నావు.అందులకు నీకు నీరు దొరకకుండా చెట్టు తొర్రలో జీవించమని శపించినాడు. ఈ దినము నా సమక్షములో దైవ సన్నిధిని పడినందున నీ భర్త శాపము ప్రకారము మరల నీ నిజరూపము పొందగలిగినావు. అందునా ఇది మాఘమాసము. కృష్ణా నదీతీరము. కాగా మాఘమాస వ్రత సమయము నీకు అన్నివిధాలా అనుకూలమైన రోజు. అందుచే నీవు వెంటనే సుచివై రమ్ము. స్త్రీలు గానీ, పురుషులు గానీ ఈ సమయంలో ప్రాతఃకాలమున స్నానము చేసినయెడల విష్ణు సాన్నిధ్యము పొందుదురు. ఎవరైనా తెలిసి గానీ తెలియక గానీ మాఘ శుద్ధ సప్తమి, దశమి, పౌర్ణముల యందును, పాడ్యమి రోజునను నదీ స్నానమాచరించిన యెడల వారి పాపాలు నశించును. మాఘ శుద్ధ పాడ్యమి నాడు స్నానమునను, అటులనే దశమి, ఏకాదశి, ద్వాదశి, దినములలో స్నానము చేసి శ్రీమన్నారాయణుని పూజించి పురాణ కాలక్షేపము చేసినయెడల శ్రీహరి సంతోషించి మనోవాంఛ సిద్ధించునటుల వరమిచ్చును. భక్తి శ్రద్ధలతో మాఘ పురాణము వినిన మోక్షప్రాప్తి కలుగును. అని గౌతమ ముని ఆ మునివనితతో చెప్పినట్లుగా మహేశ్వరుడు పార్వతితో ఈ కథ చెప్పెను.
మాఘ పురాణం – 18వ అధ్యాయం – పిసినిగొట్టు వ్యాపారికి మాఘమాస ఫలము కలుగుట
వశిష్ఠ మహాఋషి దిలీపునకు పార్వతీదేవితో పరమేశ్వరుడు చెప్పిన పిసినారి వృత్తాంతమును యిట్లు తెలియజేసెను.
“పార్వతీ! చాలాకాలం క్రిందట దక్షిణప్రాంతమందలి వసంతవాడయను నామము గల పెద్ద పల్లెయుండెను. అందొక బంగారు శెట్టి అను వైశ్యుడొకడు ఉండెను. అతని భార్య పేరు తాయారమ్మ బంగారు శెట్టి వట్టి పిసినిగొట్టు. తనకున్న పిత్రార్జిత సంపదయే లెక్కకు మిక్కుటముగా నున్నది. కాని అతడు ఇంకనూ ధనాశ కలవాడై తనవద్దనున్న ధనమును వడ్డీలకిచ్చి మరింత సంపన్నుడయ్యెను. కానీ ఒక్కనాడైనా హరిని ధ్యానించడం కానీ, దానధర్మాలు చేయుట గానీ ఎరుగడు. అంతేగాక బీద ప్రజలకు వారి ఆస్తులపై వడ్డీలకు ఋణాలు ఇచ్చి అనుకున్న గడువుకు ఋణము తీర్చనందున తప్పుడు సాక్ష్యాలతో వ్యాజ్యములు వేసి వారి ఆస్తులు సైతము స్వాధీన పరుచుకునే వాడు. ఒకనాడు బంగారు శెట్టి గ్రామాంతరము వెళ్ళెను. ఆరోజు సాయంత్రం ఒక ముదుసలి బ్రాహ్మణుడు బంగారు శెట్టి భార్యను చూసి తల్లీ నేను ముసలి వాడను. నా గ్రామము చేరవలయునన్న ఇంకనూ పది ఆమడలు వెళ్ళవలసి ఉన్నది. ఇప్పుడు చీకటి కాబోతున్నది. ఆకాశంలో మేఘాలు ఉరుముతున్నాయి. చల్లగాలికి వణికిపోతున్నాను. మీ ఇంటివద్ద ఈరాత్రి గడువనియ్యి. నీకెంతైనా పుణ్యముంటుంది. నేను సద్బ్రాహ్మణుడను, సదాచార వ్రతుడను. ప్రాతఃకాలమున మాఘ స్నానం చేసి వెళ్ళి పోదును అని బ్రతిమలాడెను.
తాయారమ్మకు జాలి కలిగెను. వెంటనే తన అరుగు మూల శుభ్రం చేసి అందొక తుంగ చాప వేసి కప్పుకొనుటకు వస్త్రమిచ్చి పండుకొనుండని పలికెను. ఆమె దయార్ద్ర హృదయమునకు ఆ వృద్ధ బ్రాహ్మణుడు సంతసమొంది విశ్రాంతి తీసుకొనుచుండగా తాయారమ్మ ఒక ఫలము ఇచ్చి దానిని భుజించుమని చెప్పి ఆర్యా! మాఘ స్నానము చేసి వెళ్ళెదనన్నారు కదా! ఆ మాఘ స్నానమనగానేమి? దాని వలన కలుగు ఫలితమేమి? సెలవిండు. వినుటకు కుతూహలముగా ఉన్నది. అని అనగా ఆ వృద్ధ బ్రాహ్మణుడు దుప్పటి కప్పుకొని “అమ్మా! మాఘ మాసము గురించి చెప్పుటకు నాకు శక్యము గాదు. ఈ మాఘ మాసములో నదియందు గానీ, తటాకమందు గానీ, లేక నూతియండు గానీ సూర్యోదయం అయిన తర్వాత చన్నీళ్ళు స్నానం చేసి విష్ణు మందిరానికి వెళ్ళి తులసీ దళంతోనూ, పూవుల తోనూ, పండ్లతోనూ, పూజ చేసి స్వామివారి ప్రసాదమును స్వీకరించవలెను. తరువాత మాఘ పురాణం పఠించవలెను. ఇట్లు ప్రతిదినమూ విడువకుండా నెలరోజులు చేసి ఆఖరున బ్రాహ్మణునకు సమారాధన, దానములు ఇవ్వవలెను. అట్లు చేసిన యెడల మానవునికున్న రౌరవాది మహాపాపములు వెంటనే నశించి పోవును. ఒకవేళ ఈ నెలరోజులూ చేయలేని వారు వృద్ధులు, రోగులు ఒక్కరోజైననూ అనగా ఏకాదశి రోజున గానీ, ద్వాదశి నాడు గానే, పౌర్ణమి దినమున గానీ పైప్రకారము చేసినచో సకల పాపములు వైదొలగి సిరి సంపదలు, పుత్ర సంతానం కలుగును. ఇది నా అనుభవంతో తెలియజేయుచున్నాను” అని చెప్పగా ఆ బ్రాహ్మణుని మాటలకు తాయారమ్మ మిక్కిలి సంతసించి తాను ప్రాతఃకాలమున బ్రాహ్మణునితో నదికి పోయి స్నానం చేయుటకు నిశ్చయించుకొనెను.
అంతలో పొరుగూరికి వెళ్ళిన తన భర్తయగు బంగారు శెట్టి ఇంటికి వచ్చినాడు. అతడు రాగానే మాఘస్నానం గురించి చెప్పి తాను తెల్లవారు జామున స్నానమునకు పోవుదునని తెలియజేసెను.
భార్య చెప్పిన మాటలకు బంగారుశెట్టి కోపము వచ్చి వంటినిండా మంటలు బయలుదేరినట్లుగా పళ్ళు పటపట కొరికి ఓసీ వెర్రిదానా! ఎవరు చెప్పినారే నీకీ సంగతి? మాఘ మాసమననేమిటి? స్నానమేమిటి? వ్రతము, దానములేమిటి? నీకేమైనా పిచ్చి పట్టినదా? చాలు చాలు అధిక ప్రసంగం చేసినచో నోరు నొక్కి వేయుదును. డబ్బులు సంపాదించుటలో నా పంచ ప్రాణములు పోవుచున్నవి. ఎవరికినీ ఒక్క పైసా కూడా వదలకుండా వడ్డీ వసూలు చేస్తూ కూడబెట్టిన ధనము దానము చేయమనెదవా? చలిలో చన్నీళ్ళు స్నానం చేసి పూజ చేసి దానములు చేస్తే ఒళ్ళు, ఇల్లు గుల్లై నెత్తిపైన చెంగు వేసుకొని, భిక్షాం దేహి అని అనవలసిందే. జాగ్రత్త! వెళ్ళి పడుకో! అని భర్త కోపిగించినాడు. ఆ రాత్రి తాయారమ్మకు నిద్ర పట్టలేదు. ఎప్పుడు తెల్లవారునా, ఎప్పుడు నదికి వెళ్ళి స్నానము సేతునా? అని ఆత్రుతగా ఉన్నది. కొన్ని ఘడియలకు తెల్లవారినది. తాను కాలకృత్యములు తీర్చుకొని ఇంటికి వచ్చియున్న వృద్ధ బ్రాహ్మణునితో మొగనికి చెప్పకుండా నదికి పోయి స్నానము చేయుచున్నది. ఈలోగా బంగారు శెట్టి పసిగట్టి ఒక దుడ్డుకర్ర తీసుకొని నదికి పోయి నీళ్ళలో దిగి భార్యను కొట్టబోవుచుండగా ఆ యిద్దరూ కొంత తడవు నీళ్ళలో పెనుగులాడిరి. అటుల పెనుగు లాడుచుండగా ఇద్దరూ నీళ్ళలో మునగవలసి వచ్చెను. అటుల మునుగుటచే ఇద్దరికీ మాఘ మాస ఫలము దక్కినది. భార్యను కొట్టి ఇంటికి తీసుకు వచ్చినాడు.
కొన్ని సంవత్సరములు జరిగిన తర్వాత ఒకనాడు ఇద్దరికీ ఒక వ్యాధి సోకినది. మరికొన్ని రోజులకు ఇద్దరూ చనిపోవుటచే బంగారు శెట్టిని తీసుకొని పోవుటకు యమభటులు వచ్చి కాలపాశము వేసి తీసుకొని పోవుచుండిరి. తాయారమ్మను తీసుకొని పోవుటకు విష్ణు దూతలు వచ్చి ఆమెను రథముపై ఎక్కించుకొని తీసుకొని పోవుచుండిరి. అప్పుడు తాయారమ్మ యమ భటులతో ఇట్లు పలికెను.
ఓ యమ భటులారా! ఏమిటీ అన్యాయము? నన్ను వైకుంఠమునకు తీసుకు పోవుట ఏమి? నా భర్తను యమ లోకమునకు తీసుకొని పోవుట ఏమిటి? ఇద్దరమూ సమానమే కదా! అని వారి నుద్దేశించి అడుగగా “ఓయమ్మా! నీవు మాఘమాసములో ఒకదినమున స్నానము చేసితివి. అదియు ఆ వృద్ధ బ్రాహ్మణుని వలన విని స్నానం చేయగా నీకీ ఫలం దక్కినది. కానీ నీ భర్త అనేకులను హింసించి అన్యాయంగా ధనార్జన చేసి అనేకుల వద్ద అసత్యములాడి నరకమన్న భయము లేక భగవంతునిపై భక్తి లేక వ్యవహరించినందునే యమలోకమునకు తీసుకొని పోవుచున్నాము. అని యమభటులు పలికిరి.
ఆమె మరల వారినిట్లు ప్రశ్నించెను. నేను ఒకే ఒక దినమున స్నానము చేసినందున పుణ్య ఫలము కలిగినప్పుడు నన్ను కొట్టుచూ నాతో నాభర్త కూడా నీట మునిగినాడు కదా! శిక్షించుటలో ఇంత వ్యత్యాసమేల కలిగెను? అని అనగా ఆ యమభటులకు సంశయం కలిగి ఏమియూ తోచక చిత్రగుప్తుని వద్దకు వెళ్ళి జరిగిన సంగతి ఆమె వేసిన ప్రశ్నలు తెలియజేసిరి.
చిత్రగుప్తుడునూ వారి ఇద్దరి పాప పుణ్యముల పట్టిక చూడగా ఇద్దరికీ సమానమైన పుణ్య ఫలము రాసి ఉన్నది. జరిగిన పొరపాటునకు చిత్రగుప్తుడు విచారించి బంగారు శెట్టిని కూడా వైకుంఠమునకు తీసుకొని పొమ్మని విష్ణు దూతలతో చెప్పెను.
విష్ణు లోకమునకు ముందుగా వెళ్ళియున్న తాయారమ్మ భర్త గతి ఏమయ్యెను? అని ఆత్రుతతో ఉండగా బంగారు శెట్టిని పుష్పక విమానం మీద తెచ్చి వైకుంఠములో విడిచిరి. భార్యాభర్తలు ఇద్దరూ మిక్కిలి సంతసమందిరి.
రాజా! వింటివా. భార్య వల్ల భర్తకు కూడా ఎటుల మోక్షము కలిగెనో. భర్త దుర్మార్గుడై పిసినిగొట్టుగా వ్యవహరించిననూ భార్య యథాలాపంగా ఒక్కరోజు మాఘస్నానం చేసినందున ఇద్దరికీ వైకుంఠ ప్రాప్తి కలిగినది కదా! కనుక మాఘ స్నానం నెలరోజులూ చేసినచో మరింత మోక్షదాయకం అగుననుటలో సందేహం లేదు.
మాఘ పురాణం – 19 వ భాగం – గంగాజల మహాత్మ్యము
ఓ కార్తవీర్యార్జునా! శివపూజ గురించి శివమహాత్మ్యమును గురించి వివరించెదను వినుము. మున్ను శ్రీరామచంద్రుడు రావణుని చంపుటకు సముద్రంపై వారధి కట్టినచోట శివలింగమును ప్రతిష్ఠించి శివుని ధ్యానించి వారధిని దాటి రావణుని చంపెను. అటులనే హనుమంతుడు సముద్రమును దాటునపుడు శివుని ధ్యానించి, రామునికి నమస్కరించి మహాబలమును సంపాదించి సముద్రమును దాటెను. అర్జునుడు యుద్ధమునకు బయలుదేరేముందు శివపూజ చేసి యుద్దరంగంలో ప్రవేశించాడు. మరెందరో మహానుభావులు శివుని ధ్యానించి తమకు జయమును చేకూర్చుకొనిరి. స్త్రీలు తమ మనోవాంఛను ఈడేర్చుకొనిరి. గనుక పూజలందు శివపూజ పవిత్రమైనది. అటులనే నదులలో గంగానది పరమపవిత్రమైనది. ఎటులనగా గంగాజలం విష్ణు పాదములనుండి పుట్టినదియు, శివుని శిరస్సునుండి ప్రవహించునట్టియు అయినందుననే సర్వపాపరహితమైనది. గంగాజలంలో స్నానం చేసినచో మహాపాపములు సైతం హరించిపోవును. గాన గంగాజలమునకు అంత ప్రాముఖ్యత వున్నది. ఇంకనూ గంగాజలం గురించి చెప్పబోవునది ఏమనగా ఏనదిలో గాని, సెలయేరులో గాని, చెరువునందు గాని స్నానం చేయునపుడు ‘గంగ గంగ గంగ! అని మూడు పర్యాయములు అనుకొని శిరస్సున నీళ్ళు జల్లుకొనినచో అది గంగాజలంతో సమానమయినదగును. గంగాజలం విష్ణుమూర్తి ప్రతిరూపం గనుక గంగాజలంతో సాటియగు జలము ఈ ప్రపంచమునందెచ్చటనూ లేదు. అని గంగా జలమును గురించి కార్తవీర్యార్జునునకు దత్తాత్రేయుడు వివరించెను.
మాఘ పురాణం – 20 వ భాగం
బ్రాహ్మణ కన్యల విమోచనము కొంతకాలం క్రిందట మగధరాజ్యంలో పురోహిత వృత్తిచే జీవించుచున్న నలుగురు బ్రాహ్మణులుండిరి. నల్గురకు నల్గురు కుమార్తెలుండిరి. వారు నిండు యవ్వనవతులై ఉండిరి. కొన్నాళ్ళకు ఆ గ్రామపు కోనేటిలో స్నానం చేయుటకొక గురుకుల విద్యార్ధి వచ్చెను. బ్రాహ్మణ కన్యలు ఆ యువకుని అందము చూచి మోహించి అతనిని సమీపించి చుట్టుముట్టి తమ్ము వివాహము చేసుకోమని బలవంతము చేయ – ఆ బ్రాహ్మణ విద్యార్థికి విద్య పూర్తి కానందున వారి కోర్కె నిరాకరించెను. అంత నా కన్యలు కోపంతో “నీవు పిశాచివి కమ్మని” శపించగా ఆ విద్యార్దియూ “మీరుకూడా పిశాచులగుదురు గాక”యని ప్రతిశాపమిచ్చుటచే వారంతా పిశాచ రూపములతో ఆ కొలను వద్దనే వుండి అందరినీ బాధించి, ఆహారము దొరికితే పెనుగులాడుచుండిరి. కొంత కాలమునకు ఒక సిద్ధుడాకోనేటి దగ్గరకు రాగా నా పిశాచముల తల్లిదండ్రులు తమ బిడ్డలకు కలిగిన పిశాచ రూపములెట్లు పోవునని అడిగిరి. ఆ సిద్ధుడు “వీరందరి చేత మాఘమాసంలో గాయలోనున్న త్రివేణిలో స్నానం చేయించినచో వారికున్న పిశాచరూపం తొలగి పోవును” అని చెప్పగా వారట్లు చేయుటచే ఆ నలుగురకూ యధారూపములు కలిగినవి. అట్లు జరుగుట మాఘస్నానమే కారణము.
మాఘ పురాణం – 21 వ భాగం
విశ్వామిత్రునికి వానరముఖము కలుగుట
శూద్ర స్త్రీ వృత్తాంతము
మాఘమాసమందలి నదీస్నానం మనుజులకే కాక దేవతలకు గంధర్వులకు కూడ పరమ పవిత్రమైనది.
ఒక మాఘమాసంలో నొక గంధర్వుడు తన భార్యతో భూలోకానికి వచ్చి గంగానదిలో స్నానమాడెను. తన భార్య మాత్రం స్నానమాచరించనని చెప్పుటచే ఆమె దేవత్వము నశించి గంధర్వలోకానికి వెళ్ళలేక ఉండిపొయినది. ఆమెను విడిచిపెట్టి ఆ గందర్వుడొక్కడే వెళ్ళిపోయాడు. ఆమె అడవిలో తిరుగుతూ విశ్వామిత్రుడు ఉన్నచోటుకు వెళ్ళి వయ్యారంగా క్రీగంట చూచెను. ఆమె అందము యౌవనానికి విశ్వామిత్రుడు తన్మయుడై ఆమెను ప్రేమించుటచే ఇద్దరూ కామక్రీడలతో తేలియాడుచుండగా మరలనా గంధర్వుడు భార్యను వెదకుకొనుచూ వచ్చి చూడగా విశ్వామిత్రుడు, గంధర్వస్త్రీ క్రీడించుచుండిరి. ఆదృశ్యమును చూచి మండిపడుచు “నీవు తపస్వివైయుండి కూడా కామతృష్ణ గల వాడవైతివి గాన నీకు కోతి ముఖము సంభవించుగాక యని విశ్వామిత్రుణ్ణి, “ఓసీ కులటా! నీవు పాషాణమై పడివుండు”మణి భార్యను శపించి వెళ్ళిపొయినాడు. విశ్వామిత్రుడు చేయునది లేక వానరముఖము కలిగివుండగా నారదుడు ఈవిషయం తెలుసుకొని విశ్వామిత్రుని కడకు వచ్చి “విశ్వామిత్రా! క్షణభంగురమైన తుచ్ఛ కామవాంఛకు లోని నీ తపశ్శక్తి అంతా వదులుకున్నావు. సరేలెమ్ము. గంగా నదిలో స్నానం చేసి నీ కమండలంతో గంగాజలం తెచ్చి ఈ పాషాణంపై చల్లుము. అని నారదుడు వివరించగా విశ్వామిత్రుడు గంగానదిలో స్నానం చేసి విష్ణువును ధ్యానించి కమండలంతో నీరు తెచ్చి పాషాణంగా మారిన గంధర్వ స్త్రీపై చల్లెను. ఆ స్త్రీ నారదునికి నమస్కరించి గంధర్వ లోకమునకు వెళ్ళిపోయెను. విశ్వామిత్రుడు తపస్సుకు వెళ్ళిపోయినాడు.
మాఘ పురాణం – 22 వ భాగం
సులక్షణ మహారాజు వృత్తాంతము వంగదేశమును సూర్యవంశపు రాజగు సులక్షణ మహారాజు పరిపాలించుచుండెను. అతనికి నూర్గురు భార్యలు గలరు. అతడు గొప్ప ధైర్యవంతుడు, బలవంతుడు, ధర్మపాలకుడు. తన దేశ ప్రజల కేయాపద వచ్చిననూ తనదిగా భావించి తన్నివారణోపాయం చేసెడివాడు. సులక్షణ మహారాజెంతటి రాజాధిరాజైననూ యెంతటి తరగని సంపత్తికలవాడైన నేమి లాభం? “అపుత్రస్యగతిర్నాస్తి” అనునటుల పుత్రసంతానం లేకపోవుటచే తనకు గతులు లేవు కదా! కాగా తన వంశం ఎటుల అభివృద్ధి చెందును? తనతో తన వంశం అంతరించి పోవలసినదేనా? అని దిగులు చెందుచుండెను. ఒకనాడు తాను తన రధమెక్కి నైమిశారణ్యమున గొప్ప తపశ్శాలురున్న ప్రదేశమునకు వెళ్ళెను. అచట తపోధనులందరూ తపస్సు చేసుకొనుచుండిరి. వారికి సులక్షణ మహారాజు నమస్కరించి యిటుల పలికెను – “మునిశ్రేష్ఠులారా! నేను వంగ దేశాధీశుడను. ణా పేరు సులక్షణుడందురు. నాకు నూర్గురు భార్యలు. అయిననేమి? ఒక్క సంతానమైనను కలుగలేదు. గాన నాకు పుత్రసంతానం కలుగునట్లోనరింపుడు” అని అంజలి ఘటించి ప్రార్థించాడు. మహారాజు పలుకులకు ముని శ్రేష్ఠులు విని జాలినొందిరి. “రాజా! నీవు సంతానహీనుడవగుటకు కారణమేమనగా – పూర్వజన్మలో నీవు సౌరాష్ట్రమును పాలించియుంటివి. ఆ జన్మలో ఒక్క మాఘస్నానమైననూ చేయలేదు. ఒక్క దానమైననూ ఇవ్వలేదు. ఒక సద్బ్రాహ్మణునకు గుమ్మడికాయనైనా దానం చేసియున్నచో ఈ జన్మలో పుత్రసంతతి కలిగి వుండేది. గాన వెనుక కర్మఫలం వలననే నీకీ జన్మలో పుత్రసంతతి కలుగలేదు. ఎవరు మాఘమాసంలో శుద్ధ సప్తమి రోజున కూష్మాండ దానం చేయుదురో వారికి తప్పక పుత్రసంతానం కలుగగలదు. ఇందుకు సందేహమేమియు లేదు” అని చెప్పి ఒక ఫలమును మంత్రించి రాజునకిచ్చి “దీనిని నీ భార్యలహే జీవిమ్పజేయుము” అని పలికిరి. మహాభాగ్యం అని ఫలమును కండ్లకద్దుకొని యింటికి వెళ్ళిపొయినాడు. భర్త రాకవిని పట్టమహిషులు ఎదురేగి మంగళహారతులిచ్చి సేద దీర్చిరి. రాజు తెచ్చిన మంత్రఫలం గురించి వివరించి “భోజనానంతరం సేవిమ్పుడు” అని చెప్పి తన గదియందు ఫలమును భద్రపరచి తానూ భోజనశాలకు పట్నులతో వెడలిపోయెను. నూర్గురు భార్యలలో కడసారి భార్యకు మిక్కిలి ఆశకలిగి ఫలమంతయు నేనే భుజించేదానని తలపోసి, రహస్య మార్గమున రాజు పడకగదిలోకి వెళ్ళి ఆ ఫలమును భుజించి ఏమియు ఎరుగని దానివలె అందరితో కలిసి తిరుగుచుండెను.
మాఘ పురాణం – 23 వ భాగం
సుధర్ముడు తండ్రిని చేరుట
పాపమా బాలుని జాతకము ఎటువంటిదో గాని తన తల్లి అడవిలో పులిచే చంపబడింది. ఇప్పుడు పెంపుడు తల్లి అడవిలో విడిచిపెట్టి వెళ్ళిపోయినది. ఇక ఆ పిల్లవానిని దీన రక్షకుడగు శ్రీహరియే రక్షించాలి. ఆ రాత్రి బాలుడు ఏడ్చీ ఏడ్చీ అలసి నిద్రపోయాడు. అక్కడొక తులసిమొక్క వున్నది. నిద్రలో బాలుని చెయ్యి తులసిచెట్టు పై బడినందున ఆ రాత్రి అతనికే అపాయమూ కలుగలేదు. పైగా దైవభక్తి కలిగెను. ఉదయమే లేచునప్పటికి అడవిలో ఏకాంతముగా నున్నందున భయపడి బిగ్గరగా ఏడ్చినాడు. ఆ రోదనకు పక్షులు, జంతువులు, మృగములు కూడా రోదనచేసి ఆ బాలునికి రక్షణగా ఉండి ఆహారము తెచ్చి ఇచ్చుచుండెడివి. ఆ బాలుడు అడవి జంతువులచే పెంచబడుతూ దినదినాభి వృద్ధి చెందుతూ ఏ తులసి చెట్టు వద్ద పడి వుండెనో ఆ మొక్కకు ప్రతినిత్యము పూజలు చేయుచు కాలము గడుపుచుండెను.
అలా పెరుగుతూ పన్నెండేండ్లు ప్రాయం గల వాడయ్యెను. ప్రతి దినము తులసి పూజ భగవన్నామ స్మరణ చేస్తూ “నన్ను కాపాడుము తండ్రీ అనాధరక్షకా” అని ప్రార్థించుచు, ఒక్కొక్కప్పుడు విరక్తుడై “ఛీ ఎంత ప్రార్థించినా నా గతి ఇంతేనా? నేను బ్రతికెందుకు?” అని దుఃఖించుచుండగా, ఆకాశవాణి “ ఓ బాలచంద్రా! నీవట్లు విచారింపకుము. ఈ సమీపముననే ఒక కోనేరు వున్నది. మాఘమాసం ప్రవేశించినది. అందుచే నీవా సరస్సులో స్నానం చేసినయెడల శ్రీమన్నారాయణుడు నీకు ప్రత్యక్షమగును” అని పలికిన మాటలు ఆకాశమునుండి వినిపించినవి. వెంటనే ఆరాజకుమారుడు సరోవరమునకు వెళ్ళి మాఘమాస స్నానం చేసి శ్రీహరిని స్తుతించెను.
ఈ బాలుని నిష్కళంక భక్తికి, నిర్మల హృదయానికి లక్ష్మీ నారాయణులు ప్రత్యక్షమై అతనిని దీవించి “బాలకా నీకేమి కావలయునో కోరుకొనుము” అని యనగా “ప్రభూ! నాకు తండ్రి ఎవరో తల్లి ఎవరో తెలియదు. నాకు ఆలనా పాలనా చేయువారెవరైననూ లేరు. పుట్టినది మొదలు కష్టములే తప్ప సుఖమన్నది ఎరుగను. ఈ వనచరములే నన్ను రక్షించి పోషించుచున్నది. గాన మీ సన్నిధానమునకు నన్ను తీసుకొని పొండు. మరేమియు అక్కరలేదు” అని ప్రార్థించెను.
“ఓయీ రాజనందనా! నీవు ఇంకను భూలోకమునందు ధర్మంగా పరిపాలన చేయవలసిన యవసరమున్నది. నీ తండ్రియగు సులక్షణుడు వృద్ధుడై నీగురించి నీ కన్నతల్లిని గురించి బెంగతో ఉన్నాడు. గాన నీవు నీ తండ్రి వద్దకు పోయిరమ్ము” అని చెప్పి ఆ కొలను సమీపమున తపస్సు చేసుకొనుచున్న ఒక మునీశ్వరునితోడు యిచ్చి సులక్షణుని వద్దకు పంపెను.
అప్పటికే సులక్షణుడు తన కడసారి భార్య గర్భావిటిగా వుండి ఎటుపోయెనో, పుట్టిన బిడ్డ ఏమాయెనో అని తన రాజ్యమంతయు వెదకించి తానును వెదకి వారి జాడ తెలియనందున విచారమనస్కుడై రాచకార్యములు చూడకుండెను. అటువంటి సమయములో మునివెంట కుమారుడు వెళ్ళెను. రాజుతో ముని యా బాలుని జన్మవృత్తాంతం తెలియజేయుసరికి సులక్షణ మహారాజు అమితానందభరితుడై బాలుని కౌగలించుకొని మునీశ్వరునికి మర్యాదలు చేసి కుమారునికి సుధర్ముడని పేరు పెట్టి పట్టాభిషేకము చేసెను.
మాఘ పురాణం – 24 వ భాగం
ఋక్షక యను బ్రాహ్మణ కన్య వృత్తాంతము
పూర్వము భృగుమహాముని వంశమందు ఋక్షకయను కన్య జన్మించి దిన దినాభివృద్ధి పొందుచుండెను. ఆమె దురదృష్టవంతురాలు కాబోలు. పెండ్లి అయిన వెంటనే పెండ్లి కుమారుడు చనిపోయెను.
ఋక్షక తన దురదృష్టమునకు దుఃఖించి విరక్తి భావముతో ఇల్లు విడిచి గంగానదీ తీరమునకు బోయి ఆశ్రమము నిర్మించుకొని శ్రీమన్నారాయణుని గూర్చి తపస్సు ప్రారంభించెను.
ఆవిధంగా చాలా సంవత్సరములు ఆచరించుట వలన ననేక మాఘ మాస స్నాన ఫలములు దక్కెను. ఆమె మనోవాంఛ ఈడేరు సమయం దగ్గర పడింది. ఒకనాడామె తపస్సు చేసుకొనుచూ ప్రాణములు విడిచెను. ఆరోజు వైకుంఠ ఏకాదశి అగుట వలన వైకుంఠమునకు వెడలెను. ఆమె చాలా సంవత్సరములు వైకుంఠమందే ఉండి తరువాత బ్రహ్మలోకమునకు పోయెను. ఆమె మాఘ మాస వ్రత ఫలము కలిగి పవిత్రురాలగుటచే బ్రహ్మదేవుడామెను సత్య లోకములో దేవకార్యములు తీర్చుటకు అప్సర స్త్రీగా చేసి “తిలోత్తమా”యను పేరుతో సత్యలోకమునకు పంపెను. ఆ కాలంలో సుందోపసుందులనే ఇద్దరు రాక్షస సోదరులు బ్రహ్మను గూర్చి ఘోర తపస్సు చేసిరి. వారి తపస్సుయొక్క ప్రభావమునకు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై “మీకేమి కావలయును? కోరుకొనుడు” అని అనగా “స్వామీ! మాకు ఇతరుల వలన మరణము కలుగకుండా ఉండునట్లు వరమిమ్ము” అని వేడుకొనగా బ్రహ్మ అటులనే ఇచ్చితినని చెప్పి అంతర్ధానమయ్యెను.
బ్రహ్మ దేవుని వలన వరము పొందిన ఆ ఇద్దరు రాక్షసులు మహా గర్వము గలవారై దేవతలను హింసించి మహర్షుల తపస్సులకు భంగము కలిగించు చుండిరి. యజ్ఞయాగాది క్రతువులలో మాంసం, రక్తం, పడవేసి ప్రజలను నానాభీభత్సములు చేయుచుండిరి. దేవలోకముపై దండెత్తి దేవతలందరినీ తరిమివేసిరి. ఇంద్రుడు మొదలగు దేవతలందరూ సత్యలోకమునకు వెళ్ళి బ్రహ్మను వేడుకొని “మహానుభావా! సుందోపసుందులనే రాక్షసులకు మీరిచ్చిన వరములతో గర్వము గలవారై తపశ్శాలురను బాధించుచూ దేవలోకమునకు వచ్చి మమ్మందరనూ తరిమి చెరసాలలో పెట్టి నానా భీభత్సం చేయుచున్నారు. గాన వారి మరణమునకు ఏదైనా ఉపాయము ఆలోచించు”మణి దేవేంద్రుడు ప్రార్థించెను. బ్రహ్మ దీర్ఘముగా నాలోచించి తిలోత్తమను పిలిచి “అమ్మాయీ! సుందోపసుందులను రాక్షసులను ఎవరి వలననూ మరణం కలుగదని వరం ఇచ్చియున్నాను. వర గర్వంతో చాలా అల్లకల్లోలం చేయుచున్నారు గాన నీవు పోయి నీ చాకచక్యంతో వారికి మరణం కలుగునటుల ప్రయత్నించుము” అని చెప్పెను.
తిలోత్తమ బ్రహ్మదేవునకు నమస్కరించి సుందోపసుందులు ఉన్న అరణ్యమును ప్రవేశించెను. ఆమె చేత వీణ పట్టుకొని మధురమైన పాటలు పాడుకొనుచూ ఆ రాక్షస సోదరులున్న నివాసమునకు సమీపములో తిరుగుచుండెను. వీణానాదమును ఆమె మధుర గానమును విని సుందోపసుందులు తిలోత్తమును సమీపించిరి. ఆమె ఎటు పోయిననటు, ఎటు తిరిగిననటులామెను అనుసరిస్తూ ప్రేక్షకుల వలె వెంటాడుచుంటిరి. ఆమెను “నన్ను వరింపుము” యని తిలోత్తమను ఎవరికి వారు బ్రతిమలాడ సాగిరి.
ఓ రాక్షసాగ్రేసరులారా! మిమ్ములను పెండ్లియాడుట నాకు ఇష్టమే. మీరిద్దరూ నాకు సమానులే. నేను మీ ఇద్దరి యెడల ప్రేమతో నున్నాను. ఇద్దరినీ వివాహమాడుట సాధ్యం కానిది. గాన నాకోరిక ఒకటున్నది. అది ఏమనగా “మీ ఇద్దరిలో ఎవరు బలవంతులో వారినే నేను ప్రేమించగలను” అని తిలోత్తమ చెప్పెను. తిలోత్తమ పలుకులు వారిని ఆలోచింప జేశాయి. నీకంటే నేను బలవంతుణ్ణి అని సుందుడు అంటే, లేదు నేనే బలవంతుణ్ణి అని ఉపసుందుడు అన్నాడు. ఇద్దరికీ వాగ్వివాదం పెరిగి పౌరుషం వచ్చింది. మనిద్దరిలో ఎవరు గొప్పో తేల్చుకుందాం అంటూ ఘోర యుద్ధానికి తలపడ్డారు. గదాయుద్ధము, మల్లయుద్ధము చేశారు. పలురకాల ఆయుధాలతో పోరాడుకున్నారు. చివరిగా కత్తి యుద్ధం చేస్తూ ఒకరి కత్తి మరొకరి కంఠానికి ఖండించడంతో ఇద్దరూ చనిపోయారు. వారిద్దరూ మరణించడంతో దేవతలందరూ సంతోషించారు. తిలోత్తమను పలువిధాలుగా శ్లాఘించారు. బ్రహ్మదేవుడు కూడా సంతోషించి “తిలోత్తమా! నీ చాకచక్యంతో సుందోపసుందుల పీడను తొలగించావు. దేవతలందరికీ ఆరాధ్యురాలవైనావు. ఇదంతా నీవు చేసిన మాఘమాస వ్రత ఫలితమే కానీ మరొకటి కాదు. ఇకనుండి నీవు దేవలోకములో అందరిచే అధికురాలిగా ఆదరింపబడతావు. నీ జన్మ ధన్యమైనది. వెళ్ళు. దేవలోకంలో సుఖించుము” అంటూ ఆమెను దేవలోకానికి పంపాడు.
మాఘ పురాణం – 25 వ భాగం
విష్ణువు బ్రహ్మ రుద్రాదులకు చేసిన హితబోధ
పూర్వము బ్రహ్మ, ఈశ్వరులకు వాదోపవాదం జరిగింది నేను గొప్ప అంటే నేను గొప్ప అని. నేను సర్వేశ్వరుడను, పధ్నాలుగు లోకములకు అధిపతిని నేనే అన్నాడు శివుడు. కాదు, ఈ పధ్నాలుగు లోకాలను, సమస్త చరాచర జీవరాశినీ, సృష్టించిన సృష్టికర్తను నేను. కావున నేనే గొప్ప అన్నాడు బ్రహ్మదేవుడు. వాదప్రతివాదములు, తర్కమీమాంసలతో వెయ్యేళ్ళు గడిచిపోయినవి. ఇద్దరూ వాగ్వివాదంలో మునిపోయారేమో సృష్టి కార్యం అంతా స్తంభించి పోయింది. అంతట శ్రీమహావిష్ణువు విరాట్ రూపంతో ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మ, ఈశ్వరులు ఇద్దరూ సమస్త లోకములూ ఇమిడివున్న ఆ రూపమును తిలకించి నిశ్చేష్టులైనారు. సప్త సముద్రాలు, సమస్త విశ్వమూ, ప్రకృతి భూత భవిష్యత్ వర్తమానములన్నీ కనిపించుచున్నాయి. అ విరాట్ రూపుని ఎడమచెవిలో శంకరుడు, కుడిచెవిలో బ్రహ్మదేవుడు ఉన్నారు. ఆ రూపమునకు ఆద్యంతములు లేవు. సర్వత్రా తానై ఉన్నాడు. అనేక వేల బాహువులతో ఉన్నాడు. సమస్త దేవాధిదేవులు, దేవతలు, రాక్షసులు, మునులు సమస్తమూ భగవంతుని కీర్తిస్తూ కనపడుచున్నారు. నదీనదములు, పర్వతములు, కొండలు, గుట్టలు, జలపాతములూ సమస్తమూ కనపడుచున్నవి. భీషణమైన వేడి నిట్టూర్పులు వెదజల్లబడుతున్నాయి. కోటి సూర్య కాంతుల వెలుగులలో ప్రకాశింపబడుతున్నాడు. సామాన్యులకు సాక్షాత్కరించని, వీక్షించలేని ప్రకాశవంతుడుగా ఉన్నాడు. ఆ విరాట్ రూపానికి మొదలెక్కడో చివర ఎక్కడో తెలియడం లేదు. ఆ విరాట్ స్వరూపుని ఆద్యంతములు తెలుసుకోవాలని అట్లు తెలుసుకున్న వారే అధికులనీ, బ్రహ్మ, ఈశ్వరుడు నిర్ణయించుకున్నారు. ఇరువురూ వెంటనే బయలుదేరి వెయ్యేళ్ళు తిరిగి ఆ విరాట్ స్వరూపుని ఆద్యంతములు కనుగొనలేక యథాస్థానానికి వచ్చి ఇట్లు తలపోశారు. ఆహా! ఏమి ఇది? బ్రహ్మ, ఈశ్వరులైన మేము ఈ విరాట్ స్వరూపుని ఆద్యంతములు కనుగొనలేక పోయితిమి. అంటే మనం అధికులం కాదన్నమాట. సమస్తమునకూ మూలాధారమైన శ్రీమహావిష్ణువే మనకంటే అధికుడన్నమాట. సృష్టి స్థితి లయ కారకుడతడే. అతడే సర్వాంతర్యామి. జగములనేలే జగదాధారుడతడే. పంచభూతాలు, సూర్యచంద్రులు, సర్వమూ ఆ శ్రీమన్నారాయణుడే. కావున ఆ శ్రీ మహావిష్ణువే సర్వమూ అయి వున్నాడు. మనమంతా ఆయన కుక్షిలోని కణములమే అని నిర్ణయించుకున్నవారై శ్రీమహావిష్ణువును స్తోత్రం చేయగా విష్ణువు విరాట్ రూపమును వదిలి యథారూపమును ధరించి మీరెంతో కాలమునుండి వాదించు కొనుచున్న విషయము తెలుసుకొని మీకు జ్ఞానోపదేశం కలుగుటకై ఈ విరాట్ రూపమును ప్రదర్శించాను. నా విరాట్ రూపముయొక్క ఆది మధ్యాంతములను తెలుసుకొనలేక నిశ్చేష్టులై మీ కలహాన్ని ఆపుచేశారు. మీరెందుకు అహంతో వాదించుకుంటున్నారో తెలిపెదను వినండి. “సమస్తమునకూ మూడు గుణములు నిర్దేశించబడ్డాయి. వీటీనే త్రిగుణములు అంటారు. అవి సత్త్వరజస్తమోగుణములు. మీరు రజస్తమో గుణములు కలిగిన వారు. ఎవరైతే సత్త్వరజస్తమో గుణములు కలిగిఉందురో వారే గొప్పవారు. తేజోవంతులుగా ఏకాత్మ స్వరూపునికి ఆదిలో మూడు రూపములే ఉన్నాయి. అవి సృష్టిస్థితి లయలు. సృష్టికి బ్రహ్మ, స్థితికి నేను, లయమునకు ఈశ్వరుని అధిపతులుగా చేసితిని. కావున వీరిని త్రిమూర్తులు అందురు. త్రిమూర్తులు అనువారు ముగ్గురు కాదు. ఏక స్వరూపమే. సృష్టి సౌలభ్యం కొరకు త్రిగుణాత్మక స్వరూపులమైనాము. కావున మీరు వేరు, నేను వేరు అనునది లేదు. అంతా ఏకత్వ స్వరూపమే. కావున మన ముగ్గురిలో ఎవరికీ పూజలు చేసినా ఏకాత్మ స్వరూపునికే చెందుతాయి. త్రిమూర్తులమైన మనలో భేదముండదు. రజస్తమో గుణముల ప్రభావముచే మీరిట్లు ప్రవర్తిన్చిరి. శాతమునొంది చరింపుడు. బ్రహ్మదేవా! నీవు ఎక్కడినుండి ఉద్భావిన్చావు? నా నాభికమలము నుండియే కదా! కావున నీకును, నాకును బెధమున్నడా? లేదు. అట్లే ఓ మహేశ్వరా! ఓంకార స్వరూపుడవగు నీ గొప్పతనమును తెలియగోరి నారదుడొకనాడు నీ మహాత్మ్యమును తెలుపమనగా నేను నీయొక్క మహిమను సర్వస్వమును వినిపించితిని. నాటినుండి సర్వేశ్వరుని ఘనతను నారదుడు సమస్త లోకాలకూ విస్తరింపజేశాడు. ఓ సాంబశివా! నువ్వు నిర్వికార నిరాకల్పుడవు. శక్తి స్వరూపుడవు, త్రినేత్రుడవు, సర్వేశ్వరుడవు, ఆదిదేవుడవు నీవే. ఆత్మ స్వరూపుడవు నీవే. భోళా శంకరుడవైన నీవే ఇంత పంతము పట్టదగునా? నేనే నీవు, నీవే నేను అందుకే శివకేశవులని భక్తులు భజియుంతురే! పూజింతురే! నిత్య సత్య స్వరూపుడవు. నిత్యానంద రూపుడవు. నిత్య ధ్యాన స్వరూపుడవు. అర్థ నారీశ్వరుడవు. నీవుకూడా నాతొ సమనుడవే” అంటూ బ్రహ్మకు, శివునకు జ్ఞానోపదేశం చేసి వారిద్దరికీ సఖ్యత కుదిర్చి వారిని ఆశీర్వదించి పంపివేసెను. కావున మాఘమాసమందు త్రిమూర్త్యాత్మక స్వరూపుడైన జగద్రక్షకుడగు ఆ శ్రీహరిని పూజించినచో సమస్త పాపముల నుండి విముక్తులగుటయే కాక స్వర్గార్హత పొంది సుఖించగలరు.
మాఘ పురాణం – 26 వ భాగం
మాఘమాసమందు ఏకాదశీ మహాత్మ్యము – క్షీర సాగర మథనము.
మాఘమాసమునందు నదీస్నానము చేసి మాఘమాస వ్రతాన్ని ఆచరించిన వారికి అశ్వమేథ యాగము చేసిన ఫలము కలుగును. అట్లే ఈ మాఘమాస ఏకాదశీ వ్రతం చేసి ఉపాసం వున్న వారలు వైకుంఠప్రాప్తినొందగలరు. మాఘమాసమందు ఏకాదశీ వ్రతమొనరించి సత్ఫలితము పొందిన దేవతలకథలు వినండి. పూర్వకాలమందు దేవతలు, రాక్షసులు క్షీర సాగరమును మధించి అమృతమును గ్రోలవలెనని అభిప్రాయమునకు వచ్చిరి. మంధర పర్వతమును కవ్వముగాను, వాసుకి అను సర్పమును త్రాడుగాను, చేసుకొని క్షీరసాగరాన్ని మధించసాగారు. తలవైపు రాక్షసులు, తోక వైపు దేవతలు ఉండి మధించుచుండగా మొదట లక్ష్మీదేవి పుట్టినది. విష్ణుమూర్తి లక్ష్మీదేవిని భార్యగా స్వీకరించాడు. పిమ్మట ఉచ్చైశ్రవము అనే గుఱ్ఱము, కామధేనువు, కల్పవృక్షము ఉద్భవించాయి. వాటిని విష్ణుమూర్తి ఆదేశంపై దేవేంద్రుడు భద్రపరిచాడు. మరల పాల సముద్రమును మధించగా లోకభీకరమైన ఘన తేజస్సుతో నొప్పారు అగ్ని తుల్యమైన హాలాహలము పుట్టినది. ఆ హాలాహల విష జ్వాలలకు సమస్త లోకములూ నాశనమవసాగాయి. దేవతలు, రాక్షసులు భయపడి పారిపోసాగారు. సర్వులూ సర్వేశ్వరుని శరణుజొచ్చారు. భోళాశంకరుడగు సాంబశివుడు వారిని కరుణించి వెంటనే ఆ కాలకూట విషాన్ని తన కంఠమునందు బంధించాడు. కాలకూట విషమును పానము చేసినందువల్లనే శివుని కంఠము నీలంగా మారింది. అందుకే శివునికి నాటినుండి నీలకంఠుడు అని పేరు వచ్చినది. మరల దేవ దానవులు అమృతం కోసం పాలసముద్రాన్ని మధించగా అమృతం పుట్టింది. ఆ అమృతం కొరకు వారిరువురు తగవులాడుకొన సాగిరి. అంతట శ్రీమహావిష్ణువు మాయామోహిని అవతారమునెత్తి వారి తగవును పరిష్కరింపదలచాడు.
మాయామోహిని అందచందాలలో మేటి. ఆమె అందమునకు సరితూగు స్త్రీలు ఎవరూ లేరు. జగన్మోహిని యైన ఆమె అతిలోక సౌందర్యవతి. తన మాయా మోహన రూపంతో అందరినీ ఆకర్షించగల అద్భుత సౌందర్యరాశి. ఆమె వారిరువురి మధ్యకూ వచ్చి అమృతాన్ని ఇరువురికీ సమానముగా పంచెదను. ఎందుకీ తెగని తగవులాట? మీరందరూ ఒక వరుస క్రమంలో నిలబడితే అందరికీ అమృతాన్ని పంచుతాను. మీకిష్టమేనా? అన్నది. దేవదానవులు అంగీకరించారు. ఆమె అద్భుత సౌందర్యమునకు పరవశించి రాక్షసులు కూడా మారు మాట్లాడకుండా దేవతలందరూ ఒక వరుసలోనూ, రాక్షసులందరూ మరొక వరుసలోనూ నిలబడిరి. జగన్మోహిని రెండు భాండములను తీసుకొని ఒక భాండమునందు సురను, మరొక దానియందు అమృతమును నింపి నర్తిస్తూ మురిపిస్తూ మైమరపిస్తూ తన వయ్యారపు నడకలతో చిరునవ్వులు చిందిస్తూ రాక్షసులను ఊరిస్తూ వారికి తెలియకుండా సురను రాక్షసులకు, అమృతమును దేవతలకు పోయసాగింది. మంద భాగ్యులైన రాక్షసులు ఇదేమీ గమనించకుండా ఆమె అద్భుత సౌందర్యమునకు మురిసిపోతూ పరవశింప సాగారు. ఈవిధంగా రాక్షసులను తన వలపు వయ్యారాలతో ఊరిస్తూ సురను మాత్రమే పోస్తోంది. ఈ కనికట్టును గమనించిన రాహుకేతువులు మాయాదేవతగా మారి దేవతల పంక్తిలో కూర్చొని అమృతాన్ని పానం చేశారు. రాహుకేతువులు చేసిన ఆగడాన్ని కనిపెట్టిన జగన్మోహిని కోపించి తన చక్రాయుధంతో తలను నరికివేసింది. ఈమోసమునకు రాక్షసులు, దేవతలు గొడవపడ్డారు. శ్రీమహావిష్ణువు మిగిలిన అమృతాన్ని దేవేంద్రుడికి ఇచ్చాడు. త్రిమూర్తులు అదృశ్యమయ్యారు. దేవేంద్రుడు అమృత భాండాన్ని భద్రపరచుచుండగా రెండు చుక్కలు విధివశాత్తూ నేలరాలాయి. అవి పడిన చోట రెండు దివ్యమైన మొక్కలు పెరిగాయి. అవే పారిజాత, తులసి మొక్కలు. సత్రాజిత్తు అనే మహారాజు వాటికి నీరుపోసి పెంచసాగాడు. కొంత కాలమునకు పారిజాత వృక్షము పుష్పించి అద్భుతమైన సువాసనలను వెదజల్లసాగింది. ఒకనాడు దేవేంద్రుడు అటువైపుగా వెళ్తూ పారిజాత పుష్ప వాసనకు పరవశించి ఒక పువ్వును కోసుకొని తన భార్యయైన శచీదేవికి ఇచ్చాడు. మిగిలిన వారు కోరగా మరల వచ్చి రహస్యంగా పువ్వులను కోయదలచి తోటలో ప్రవేశించాడు. అంతకు ముందే తన తోటలోని పువ్వులను ఎవరో అపహరిస్తున్నారని అనుమానం వచ్చిన సత్రాజిత్తు శ్రీ మహావిష్ణువుకు పూజ చేసి మంత్రించిన అక్షతలను పువ్వులపై, వనమంతా జల్లాడు. దేవేంద్రుడు పారజాత పువ్వును త్రెంచుచుండగా అక్షతల ప్రభావం వల్లనో, విష్ణు మహిమ వల్లనో మూర్ఛపోయాడు. ఈవార్త తెలిసిన దేవతలందరూ నారదుణ్ణి బ్రతిమలాడగా నారదుడు కృష్ణుని వద్దకు పోయి విషయాన్ని వివరించాడు. అంత కృష్ణుడు తన మామగారైన సత్రాజిత్తు వద్దకు బయలుదేరాడు. సత్రాజిత్తు మిక్కిలి భగవద్భక్తి పరాయణుడగుటచే అమోఘమైన శక్తిచే అలరార సాగాడు. భగవంతుడైన శ్రీకృష్ణుడు అతనికి శ్రీ మహావిష్ణువు రూపమున కనిపించి అతనికి వరప్రసాద మొనరించి అమృత తుల్యమగు పారిజాత వృక్షాన్ని దానికర్హుడగు దేవేంద్రునికి ఇప్పించెను. అట్లే తులసిని తన సన్నిధిలో ఉండమని చెప్పగా నాటినుండి తులసి శ్రీమహావిష్ణువు సాన్నిధ్యంలో ఆయనతో సమానంగా పూజలు అందుకొన సాగింది. అందుచే తులసిని పూజించినచో సకల సౌభాగ్యములు సిద్ధించును.
ఫలశ్రుతి:
సూతమహర్షి శౌనకాది మునులతో మహర్షులారా! వశిష్ఠుల వారు దిలీపునకు తెలియజేసిన మాఘమాస మహాత్మ్యమును, మాఘ స్నాన మహిమను మీకు వివరించితిని. మీరు తలపెట్టిన పుష్కర యజ్ఞం కూడా పూర్తి కావచ్చింది. కావున సర్వులూ మాఘమాస వ్రతమును, నదీ స్నానమును నియమ నిష్ఠలతో చేసి ఆ శ్రీహరి కృపకు పాత్రులు కండి. మాఘమాసంలో సూర్యుడు మకర రాశియందుండగా సూర్యోదయం అయిన తర్వాత నదిలో స్నానం చేయాలి. ఆదిత్యుని పూజించి విష్ణ్వాలయమును దర్శించి శ్రీమన్నారాయణునకు పూజలు చేయాలి. మాఘమాసం ముప్పది రోజులూ క్రమం తప్పక మిక్కిలి భక్తి శ్రద్ధలతోనూ, ఏకాగ్రతతోనూ, చిత్తశుద్ధితోనూ శ్రీమహావిష్ణువు ను మనసారా పూజించినచో సకలైశ్వర్య ప్రాప్తియూ, పుత్రపౌత్రాభివృద్ధియు, వైకుంఠప్రాప్తి నొందగలరు.
సర్వే జనాః సుఖినో భవన్తు!!
మాఘపురాణం సంపూర్ణం!!